అతివలపైనే.. అందరి దృష్టి! అత్యధిక నియోజకవర్గాల్లో వారిదే పైచేయి

అతివలపైనే.. అందరి దృష్టి! అత్యధిక నియోజకవర్గాల్లో వారిదే పైచేయి
  • వారిని ఆకట్టుకునే పనిలో ప్రధాన పార్టీలు
  • మహిళకు లబ్ధి కూర్చేలా ఎన్నికల ప్రణాళికలు
  • రానున్న కాలంలో మరిన్ని హామీలకు చాన్స్‌!
  • మహిళలే కేంద్రంగా ఇప్పటికే బీఆరెస్‌ పథకాలు
  • అంతకు మించి ప్రకటిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ
  • బీఆరెస్‌, కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి
  • కేంద్ర స్థాయిలో మహిళలపై బీజేపీ సర్కార్‌ వరాలు


తెలంగాణలో సింహభాగం జిల్లాలు, అధిక శాతం నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 33 జిల్లాలకు గాను 26 జిల్లాల్లో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉండగా.. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా ప్రకారం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 76 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని తేలింది. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అతివల ఓట్లే కీలకం కానున్నాయి. వీటిలో కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, సిద్దిపేట, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, జోగుళాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, ఖమ్మం, ములుగు జిల్లాల్లో మహిళా ఓటర్లదే పైచేయిగా ఉన్నది. అందుకే ప్రధాన పార్టీలన్నీ వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజా జాబితా ప్రకారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికం. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లోనూ అతివలదే పైచేయిగా ఉన్నది. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. – (విధాత ప్రత్యేకం)


మహిళా దీవెనలే పార్టీలకు భరోసా


26 జిల్లాలు, 76 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు తేలింది. దీంతో వారు ఎక్కువ శాతం ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపితే ఆ పార్టీకే ఆయా నియోజకవర్గాల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే మిగిలిన ఓటర్లలో యువత, వృద్ధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ తదితర ఓటర్లు ఏ పార్టీకీ ఏకపక్షంగా ఓటు వేసే పరిస్థితి ఉండదు. మహిళా ఓటర్ల వలె వారి నిర్ణయం స్థిరంగా ఉండదని ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికలతో పాటు వివిధ ఉప ఎన్నికల సందర్భంగా స్పష్టమైంది. అందుకే ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత ప్రధాన పార్టీలన్నీ మహిళను ఆకట్టుకునే మరిన్ని పథకాలను తమ మ్యానిఫెస్టోల్లో ప్రకటించే అవకాశం ఉన్నదని అంటున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల మధ్య పథకాల కంటే ఎక్కువగా మహిళాభివృద్ధి, మహిళా సాధికారత, మహిళలకు ప్రాతినిధ్యం వంటివి ప్రచారాస్త్రాలు కానున్నాయి.


కాంగ్రెస్‌ ముందే ప్రకటన


ముందుగా కాంగ్రెస్‌ పార్టీ తుక్కుగూడలో జరిగిన విజయభేరీ సభా వేదికగా తమకు అధికారం ఇస్తే ఆరు గ్యారెంటీ హామీలు అమలు చేస్తామని ప్రకటించింది. అందులో మహిళలకు పెద్దపీట వేసింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఆర్థిక సహాయం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వంటి హామీలను ఇచ్చింది. అంతేకాకుండా చేయూత పథకంలో భాగంగా వితంతువులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.4 పింఛన్‌ ఇస్తామని చెప్పింది.

అదనపు హామీలతో బీఆర్‌ఎస్‌!


ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళలను ఆకట్టుకోవడానికి కళ్యాణలక్ష్మీ\ షాదీ ముభారక్‌, కేసీఆర్‌ కిట్‌, అమ్మ ఒడి వంటి పథకాలను అమలు చేస్తున్నది. తమ డిమాండ్ల సాధన కోసం కొన్నిరోజులుగా నిరసన చేపట్టిన అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేరుస్తామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీతో ఈ నియమం అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల దాదాపు 70 వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు లబ్ధి పొందనున్నారు.


కేంద్ర ప్రభుత్వం స్థాయిలో బీజేపీ


కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక పద్ధతి ప్రకారం మహిళలను తనవైపు తిప్పుకొనేందుకు పథకాలను ప్రకటిస్తూ వస్తున్నది. గతంలో భారీ స్థాయిలో గ్యాస్‌ ధరలు పెంచుతూ పోయారు. ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యే ప్రమాదం ఉన్నదన్న ఆందోళనతో ధర తగ్గిస్తూ వచ్చారన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీన్ని చూపుతూ కూడా ఓట్లు దండుకోవచ్చనేది ఆ పార్టీ అభిప్రాయంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా భారీ సంఖ్యలో ఉజ్వల కనెక్షన్లు కూడా ఇస్తున్నారు.


టికెట్ల కేటాయింపుల్లోనూ..


ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2014, 2018 తరహాలో కాకుండా.. హోరాహోరీగా జరగనున్నాయనే అభిప్రాయాలను వివిధ సర్వేలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 80పైగా నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ బీఆరెస్‌, కాంగ్రెస్‌ల మధ్యే ఉండనున్నది. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలతో కాంగ్రెస్‌ శ్రేణులు ప్రజల్లోకి వెళ్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. దీన్ని ఎన్నోసార్లు కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. బీఆర్‌ఎస్‌ ప్రకటించిన జాబితాలోనూ ఏడుగురు మహిళా అభ్యర్థులకే అవకాశం దక్కింది.


మెదక్‌, ఆలేరు, ఇల్లందు, మహేశ్వరం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు కంటోన్మెంట్‌ , ములుగు, ఆసిఫాబాద్‌ స్థానాల్లో మహిళలకు ఛాన్స్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా మహిళలకే పెద్దపీట వేసే అవకాశం ఉన్నది. బీజేపీ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి మహిళా రిజర్వేషన్ల అంశాన్ని అప్పుడే ప్రచారంలో పెట్టింది. దానికి అనుగుణంగా వారి జాబితాలో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితా దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ప్రకటించవచ్చని చెబుతున్నారు.