AP Jithender Reddy | ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా జితేందర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు

విధాత, హైదరాబాద్: ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నన్ను నమ్మి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం కల్పించారు, కేబినెట్ ర్యాంక్ ఇచ్చారన్నారు. ఢిల్లీలో తెలంగాణ హక్కుల కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. అలాగే రాష్ట్రానికి అంతర్జాతీయ ఈవెంట్స్ వచ్చేలా కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. ఎన్నో పోరాటాలు చేసి, రాష్ట్రాన్ని సాధించుకున్నామని, విభజన చట్టంలో పెట్టిన అంశా పై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కృష్ణా నుంచి రావలసిన నీటి వాటా కూడా రాలేదని, సాగునీరు, త్రాగు నీరు సాధించడం కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు. బీబీనగర్ ఎయిమ్స్ విషయంలో కూడా కేంద్రం చాలా అంశాలను పెండింగ్ లో పెట్టిందని జితేందర్ రెడ్డి గుర్తు చేశారు.
కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖల పై ఒత్తిడి తెస్తామని, పెండింగ్ సమస్యల సాధనకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్నారు. తెలంగాణ ను స్పోర్ట్స్ హబ్ గా తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం కోసం కసరత్తు మొదలైందని, త్వరలోనే ఢిల్లీలో తెలంగాణా కు కొత్త భవనం నిర్మాణం జరుగుతోందన్నారు. గతంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బాధ్యతలను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవికి అప్పగించగా ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో తెలంగాణ ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన నాగర్ కర్నూల్ ఎంపీగా గెలుపొందారు. ఆయన స్థానంలో పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నేత జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది.