వంద కోట్లతో సీటు కొనుక్కున్న వివేక్: బాల్క సుమన్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి రూ.100 కోట్లు ఇచ్చి చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ సీటును కొనుక్కున్నాడని చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు

- బీజేపీకి మోసం చేసిండు..
- చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి రూ.100 కోట్లు ఇచ్చి చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ సీటును కొనుక్కున్నాడని చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. సోషల్ మీడియాలో, సొంత చానళ్లలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, నమ్ముకొన్న క్యాడర్ ను మోసం చేసిన దుర్మార్గుడు వివేక్ అని విమర్శించారు. బాల్క సుమన్ మంగళవారం తన నివాసంలో నిర్వహించిన చెన్నూరు నియోజకవర్గ స్థాయి ‘యువ ఆత్మీయ సమ్మేళనం’లో పెద్దపెల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతతో కలిసి మాట్లాడారు.
చెన్నూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ గతంలో బీజేపీ పార్టీకి మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉండి కాంగ్రెస్ లోకి వచ్చారని అన్నారు. వివేక్ చేసిన మోసం మూలంగా బీజేపీ ఇప్పటివరకు మ్యానిఫెస్టో విడుదల చేయలేక పోయిందని బాల్క సుమన్ ఆరోపించారు. చెన్నూరు నియోజవర్గంలో ఓటు లేని, ఇల్లు లేని వ్యక్తి వివేక్ అని, అలాంటి వ్యక్తి మోసం చేయడానికి వచ్చాడని పేర్కొన్నారు.
ఓట్ల కోసం కోట్లు వేసుకుని వస్తున్న కోటీశ్వరున్ని ప్రజలు నమ్మరని, రాబోయే ఎన్నికల్లో చెన్నూరు ప్రజలు వివేక్ కు తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు. వివేక్ తండ్రి వెంకటస్వామి చివరి రోజుల్లో కేర్ హాస్పిటల్ లో నుంచి పెయిడ్ నర్సులతో సేవలు అందించిన నీచపు చరిత్ర వివేక్ కుటుంబానిదని విమర్శించారు. ఈనెల 27న మంత్రి కేటీఆర్ చెన్నూరు పర్యటన విజయవంతం చేయాలని కోరారు. 28న 20 వేల బైక్లతో బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాజా రమేష్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.