బీఆరెస్‌లో కుదుపు!.. మీడియాలో మేడిగడ్డ బరాజ్ కుంగినంత శబ్దం
ఒకప్పుడు అధినేతకు తెలియకుండా తెలంగాణ భవన్‌లో చీమ కూడా చిటుక్కుమనేది కాదు! ఆయన అనుమతి లేకుండా ఎవరూ మాట్లాడేవారు కాదు!

ఎమ్మెల్యేలు రేవంత్‌ను కలవడంతో గగ్గోలు
కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ ప్రచారం
పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున అయోమయం
తెల్లారే ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యేల వివరణ
పార్టీ మారేందుకు కానే కాదని వెల్లడి
రేవంత్‌తో భేటీని సమర్థించుకునే యత్నం
మేం కేసీఆర్ సన్నిహితులమైనంత మాత్రం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవకూడదా?
మాకు స్వేచ్ఛ ఉంది.. పార్టీకి నమ్మకం ఉంది
వందసార్లైనా సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తాం
మీడియా భేటీలో బీఆరెస్ ఎమ్మెల్యేలు
రేవంత్‌తో నలుగురు ఎమ్మెల్యే భేటీ వెనుక హరీశ్?
బీఆరెస్‌లో చిచ్చుపెడుతున్న మెదక్ లోక్‌సభ సీటు
ఒకప్పుడు అధినేతకు తెలియకుండా తెలంగాణ భవన్‌లో చీమ కూడా చిటుక్కుమనేది కాదు! ఆయన అనుమతి లేకుండా ఎవరూ మాట్లాడేవారు కాదు! ఆయన చెబితేనే ఎవరైనా మీడియా ముందుకు వచ్చేవారు! ఆయన చెప్పకుండా ఎవరినీ కలిసేవారూ కాదు! గులాబీ జెండా ఓనర్లం అన్నందుకు ఈటల రాజేందర్ వంటి టాప్ ఫైవ్ నాయకుడు ప్రగతిభవన్‌కు దూరమైపోయారు! ఒక రకమైన కట్టడి మధ్య గులాబీ నాయకత్వం మసిలిన వేళలవి! కానీ.. మొదటిసారిగా బీఆరెస్‌లో చిన్న కుదుపు వచ్చింది. అది మేడిగడ్డ బరాజ్ కుంగిన సమయంలో వచ్చినంత శబ్దం చేసింది! మాకు స్వేచ్ఛ ఉంది అనే పదం ఒక బీఆరెస్ ఎమ్మెల్యే నోట తొలిసారి వెలువడింది. అదే సమయంలో.. తెరవెనుక మాజీ మంత్రి హరీశ్‌రావు వేసిన స్కెచ్ ప్రకారమే రేవంత్‌ను నలుగురు ఎమ్మెల్యేలు కలిశారనే గుప్పుమన్నది! పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కేందుకు ఎంతో సమయం లేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి!
విధాత హైదరాబాద్/ మెదక్ ప్రత్యేక ప్రతినిధి : పార్టీలో తమకు స్వేచ్ఛ ఉన్నదని బీఆరెస్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పార్టీ అధినేతకు తెలియకుండా వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నలుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలు కలవడం రాజకీయంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నలుగురు ఎమ్మెల్యేలు అందునా, పార్టీ అధినేతకు చెందిన జిల్లా ప్రజాప్రతినిధులు అయిన నలుగురు కీలక నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి, నవ్వుతూ ఫొటోలు దిగడం పార్టీ శ్రేణుల్లో అనేక అనుమానాలు రేకెత్తించింది. మీడియాలో, సోషల్ మీడియాలో దీనిపై అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. దీనిపై మరుసటిరోజే నలుగురు ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్‌రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. తాము పార్టీ మారేందుకు రేవంత్‌రెడ్డిని కలవలేదని పదే పదే చెబుతూ.. ఆయనతో తమ సమావేశాన్ని సమర్థించుకునేందుకు నానా తంటాలు పడ్డారు. కేసీఆర్‌కు తెలియకుండా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న ప్రశ్నకు కొత్త ప్రభాకర్‌రెడ్డి సూటిగా సమాధానం చెప్పలేక పోయారు. పార్టీలో తమకు ఫ్రీడం ఉన్నదని చెప్పారు. తమపై పార్టీకి నమ్మకం ఉన్నదని చెప్పుకున్నారు. తమ నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారం, ప్రొటోకాల్ ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకే తాము కలిశామని చెప్పారు. తాము రేవంత్‌రెడ్డిని కలవడంపై దుష్ర్పచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ఎండ్రకాయల పార్టీ అని అభివర్ణిస్తూ.. అందులో ఎవరు చేరుతారని ఎదురు ప్రశ్నించారు. అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి వందసార్లయినా కలుస్తామని స్పష్టం చేశారు. సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్యరావు, గూడెం మహిపాల్ రెడ్డి కూడా దాదాపు ఇదే వాదనలు వినిపించారు. అనవసరంగా బీఆరెస్ ఎమ్మెల్యేలపై బురదజల్లడం మానుకోవాలని సూచించారు. తమకు రాజకీయ విలువలు ఉన్నాయని చెప్పారు. అపనిందలు మోయాల్సి రావడం బాధాకరమని వాపోయారు. అదే సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుపై నిత్యం నిలదీస్తూనే ఉంటామని చెప్పారు. హడావుడిగా మీడియా సమావేశం పెట్టి తమపై జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యేలు ఖండించినా.. అసలు కథ వేరే ఉన్నదనే వార్తలు గుప్పుమంటున్నాయి. మెదక్ లోక్‌సభ సీటు రేపిన చిచ్చు.. ఈ పరిణామంలో భాగమని తెలుస్తోంది.
బీఆరెస్‌లో ఏం జరుగుతున్నది?
ఇటీవల హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్, హరీశ్ రావు సమావేశమయ్యారు. మెదక్ లోక్‌సభ టికెట్ విషయం చర్చకు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. కానీ కేసీఆర్ మాత్రం మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని బీఆరెస్ అభ్యర్థిగా పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే పనిలో పనిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును, మల్కాజిగిరి నుంచి కేటీఆర్‌ను పోటీ చేయించాలనే ఆలోచన కూడా అధినేతకు ఉన్నట్టు సమాచారం. అయితే.. తనను రాష్ట్ర రాజకీయాల నుంచి కనుమురుగు చేసేందుకే ఢిల్లీకి పంపాలనుకుంటున్నారని భావించిన హరీశ్.. లోక్‌సభకు పోటీ చేయడానికి అయిష్టత చూపుతున్నారని సమాచారం. దీనితోపాటు.. వెంకట్రామిరెడ్డి కూడా ఇక్కడి నుంచి పోటీ చేయడానికి హరీశ్ వ్యతిరేకతతో ఉన్నారని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పార్టీకి ఒక కుదుపు ఇవ్వాలనే ఉద్దేశపూర్వకంగా.. తన వర్గంగా ముద్ర పడిన కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, కే మాణిక్యరావులను సీఎం వద్దకు పంపారనే చర్చ మెదక్ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతున్నది. తద్వారా అధినేతపై ఒత్తిడి తేవడమే హరీశ్ ఉద్దేశమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెదక్ సీటుకు అభ్యర్థి ఎంపికలో తన పాత్ర ఉండబోదనే అంశం కూడా హరీశ్‌లో అసహనం రేకెత్తించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవునన్నా కాదన్నా మెదక్ పార్లమెంటు బీఆరెస్ సమావేశం నుంచే పార్టీలో రచ్చ మొదలైందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రేవంత్‌కు హరీశ్‌రావు అండనిస్తారా?
రాష్ట్ర రాజకీయాల్లో మూడు రోజులపాటు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లండన్ పర్యటనలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి వ్యతిరేక వర్గంగా భావిస్తున్న కొందరు మంత్రులు శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో చర్చలు జరిపారు. వారిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారనే వార్తలు కూడా అప్పట్లో బయటకు వచ్చాయి. ఇది గమనించిన సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం సొంత జిల్లాలోని ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవాలని స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఉభయుల ప్రయోజనాలు ఉండటంతో హరీశ్‌రావు నేరుగా రేవంత్ రెడ్డితో అంతరంగిక చర్చలు జరిపి తన వర్గానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను సీఎం వద్దకు మర్యాదపూర్వకంగా కలిసేందుకు పంపినట్లు మరో వాదన రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నది. రేవంత్ రెడ్డికి, హరీశ్‌రావుకు మంచి సంబంధాలే ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా తిరుపతిలో సమావేశమైన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డికి అండగా ఉండేందుకు తన వర్గం ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డికి అనుకూలంగా హరీశ్‌రావు మార్చతున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కేటీఆర్, హరీశ్‌రావు మధ్య విబేధాలు?
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలు చాలా కాలంగా ఉన్నాయి. హరీశ్‌రావుకు తెలియకుండా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసే సాహసం చేయరనేది రాజకీయంగా అందరికీ తెలిసిన విషయమేనని అంటున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంను కలిశామని చెబుతున్నప్పటికీ లోపల విషయాలు వేరుగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. బీఆరెస్ అధినేత కేసీఆర్ ఈ ఉదంతంపై దిద్దుబాటు చర్యలకు దిగి, వెంటనే ఆ నలుగురు ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్‌మీట్ పెట్టి తాము అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామంటూ సన్నాయి రాగం వినిపింపచేశారు. అయితే అప్పటికే రాజకీయంగా జరుగాల్సిన నష్టం పార్టీకి, అధినేత కేసీఆర్‌కు జరిగినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నలుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలు ఏ ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినా అధినేత కేసీఆర్‌కు తెల్వకుండా వారు సీఎంను కలిసే ధైర్యం చేయడమంటేనే బీఆరెస్‌లో ఏదో జరుగుతుందన్న ప్రచారానికి ఊతమిచ్చినట్లయ్యింది. ఈ కుదుపు.. కుదుపుగానే తేలిపోతుందా? లేక మేడిగడ్డ తరహా విపరీత పరిణామాలకు దారి తీస్తుందా? అన్నది భవిష్యత్తే తేల్చనుంది.