బీఆరెస్‌ను ఖతం చేసేందుకు బీజేపీ కాంగ్రెస్‌ల ఉమ్మడి ఆపరేషన్‌

తెలంగాణ గొంతుక బీఆరెస్‌ను ఖతం చేసేందుకు బీజేపీ కాంగ్రెస్‌లు కుమ్మక్కై ఉమ్మడి ఆపరేషన్ చేస్తున్నాయని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ కీలక

బీఆరెస్‌ను ఖతం చేసేందుకు బీజేపీ కాంగ్రెస్‌ల ఉమ్మడి ఆపరేషన్‌
  • పార్టీ కమిటీలు లేక నష్టపోయాం
  • యూట్యూబ్ చానెళ్ల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయాం
  • కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తే విధ్వంసకారులంటూ నిందలు
  • ఆన్‌లైన్‌లో రేషన్ కార్డులు ఇచ్చాం..ఆ విషయం కేడర్‌కు తెలియలేదు
  • మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

విధాత : తెలంగాణ గొంతుక బీఆరెస్‌ను ఖతం చేసేందుకు బీజేపీ కాంగ్రెస్‌లు కుమ్మక్కై ఉమ్మడి ఆపరేషన్ చేస్తున్నాయని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లు బీఆరెస్‌కు వ్యతిరేకంగా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయనడానికి ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో పాటు ఓ తెలుగు దిన పత్రిక కథనం రుజువుగా భావించవచ్చన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రధాని మోడీని కలిసిన సందర్భంగా తెలంగాణలో బీఆరెస్‌ను ఫినిష్ చేసేందుకు పూర్తిగా సహకరిస్తారనని అన్నారంటూ ఆ పత్రిక చీఫ్ చెప్పిన వ్యాఖలు కూడా మరో నిదర్శనంగా కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు చూస్తే బీజేపీకి బీఆరెస్ బీటీమ్ కాదని,.బీజేపీ కాంగ్రెస్‌లు రెండు ఒక్కటేనని స్పష్టంగా తేలిపోతుందన్నారు. అదానీ మోడీ ఒక్కటేనని ఢిల్లీలో విమర్శించే కాంగ్రెస్ నేతలు దావోస్‌లో అదే అదానీతో పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారని ఇది కూడా మోడీ, రేవంత్‌ల బంధాన్ని చాటుతుందన్నారు. తెలంగాణలో బీఆరెస్ పాలనలో అదానీకి అవకాశమే ఇవ్వలేదన్నారు.

 

హామీలపై ప్రశ్నిస్తే విధ్వంసమా

నేను కరెంటు బిల్లులు కట్టొద్దంటే డిప్యూటీ సీఎం భట్టి నాది విధ్వంసకర మనస్తత్వం అంటున్నారని, నిజాలు మాట్లాడితే..హామీలపై ప్రశ్నిస్తే విధ్వంసకర మనస్తత్వమా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. సోనియా గాంధీనే బిల్లులు కడుతుందని కాంగ్రెసోళ్లు చెప్పారని, కరెంటు బిల్లులను సోనియాగాంధీకే పంపించేలా బీఆరెస్ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని రేవంత్ రెడ్డి, గత నవంబర్ నుంచే కట్టొద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపు నిచ్చారని, వారి మాటలనే నేను గుర్తు చేశానన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని, .మనం ఇప్పట్నుంచే హామీల అమలుకై ఒత్తిడి చేయాలన్నారు. నిరుద్యోగ భృతి పై డిప్యూటీ సీఎం భట్టి ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా మాట తప్పారని, రేవంత్ ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే భట్టి మేం చెప్పలేదంటూ మాట్లాడారన్నారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ తప్పించుకున్నట్టే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా పై కూడా మాట మార్చిందన్నారు. కాంగ్రెస్ హామీల నుంచి తప్పించుకుంటున్న తీరును ప్రజా కోర్టులోనే సాధికారికంగా ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సమాచార హక్కు చట్టాన్ని కూడా కార్యకర్తలు సమర్ధంగా వాడుకోవాలన్నారు.

దుష్ర్పచారాన్ని తిప్పికొట్టలేపోయాం

మనం పాలన మీదే దృష్టి పెట్టి యూ ట్యూబ్ ఛానళ్లలో వచ్చిన అడ్డగోలు దుష్ప్రచారాన్ని సమర్ధంగా తిప్పికొట్టలేకపోవడం కూడా ఓటమిగా దారితీసిందన్నారు. ప్రగతి భవన్ లో విలాస వంతమైన సౌకర్యాలూ అంటూ దుష్ప్రచారం చేశారని,.ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి అందులోనే ఉంటున్నారని, విలాసాలే అందులో ఉంటే భట్టి ఈ పాటికే టాం టాం చేయక పోయేవారా ? అని ప్రశ్నించారు. బీఆరెస్ ప్రభుత్వంలో ఆన్లైన్ లో రేషన్ కార్డులు ఇచ్చామని, ఆ విషయం కార్యకర్తలకు కూడా తెలియలేదన్నారు. పార్టీ కమిటీలు కూడా పూర్తిగా వేయక పోవడం వల్ల నష్టం జరిగిందని,ఇక ముందు ఆలా జరగదన్నారు. మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశం నిర్వహించుకుందామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగవన్నారు. కార్ కేవలం సర్వీసింగ్ కు వెళ్ళిందని, మళ్ళీ రెట్టింపు వేగంతో పరుగెత్తనుందన్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీఆరెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, కార్యకర్తలు అధైర్య పడొద్దని, పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా ఉంటుందన్నారు. మోడీకి రేవంత్ రెడ్డికి భయపడే పార్టీ బీఆరెస్‌ కాదన్నారు.

తెలంగాణ గొంతుక బీఆరెస్ మాత్రమే

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆరెస్‌ కన్నా కేవలం నాలుగు లక్షల ఓట్లు ఎక్కువ సాధించిందని, బీఆరెస్‌ ఇంకో ఏడో ఎనిమిదో స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రంలో హాంగ్ అసెంబ్లీ ఉండేదన్నారు. తక్కువ ఓట్ల తేడాతో 14 సీట్లు కోల్పోయామన్నారు. పోయిన సారి మల్కాజ్ గిరి లోక్‌సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయామని, ఈ దఫా ఈ సీటులో బీఆరెస్ గెలుపు తధ్యమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణ ఏకైక గొంతుక బీఆరెస్ మాత్రమేనన్నారు. పార్లమెంటులో తెలంగాణ సమస్యల మీద పోరాడిన చరిత్ర బీఆరెస్‌దేనన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఢిల్లీలో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆరెస్ ఎంపీలు గెలువాల్సివుందన్నారు. మైనారిటీల్లో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. మల్కాజ్ గిరిలో భారీ మెజారిటీ దిశగా అందరం కష్టపడుదామన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లా రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.