మెదక్‌లో మరో 4 స్థానాలకు బీజేపీ అభ్యర్థులు..

- 10 నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 8 ఖరారు
- పెండింగ్‌లో సంగారెడ్డి, సిద్దిపేట
- 6 సీట్లు బీసీలకే..
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ ఉమ్మడి జిల్లాలో బీజేపీ గురువారం ప్రకటించిన 3వ జాబితాలో 4 స్థానాలకు ఆపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఇప్పటివరకు 8 స్థానాలకు ఆపార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రకటించిన స్థానాల్లో బీసీలకు పెద్దపీట వేసింది.

తాజా జాబితాలో జహీరాబాద్ – రామచంద్ర రాజనర్సింహ, నారాయణ్ ఖేడ్ – సీనియర్ జర్నలిస్ట్ సంగప్ప, ఆందోల్ – మాజీ మంత్రి బాబు మోహన్ ను ప్రకటించారు. మెదక్ నియోజకవర్గానికి బీఅర్ఎస్ నుండి నిజాంపేట్ జడ్పీటీసీ గా గెలిచిన పంజా విజయ్ కుమార్ ఇటీవల బీజేపీలో చేరారు. ఈటెల రాజేందర్ ద్వారా ఆయన మెదక్ టికెట్ సాధించారు.

ఇక్కడ ఆరుగురు అభ్యర్థులు పోటీ పడ్డా, చివరకు సీనియర్లను కాదని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన విజయ్ కుమార్ కు బీజేపీ అధిష్టాన వర్గం టికెట్ కేటాయించింది. మెదక్ నియోజకవర్గంలో అత్యధికంగా ముదిరాజ్ లు ఉండడం, బీఅర్ఎస్, కాంగ్రెస్ లో ఓసీ వర్గానికి చెందిన పద్మా దేవేందర్ రెడ్డి, రోహిత్ రావు పోటీ చేస్తుండడంతో, బీజేపీ పంజా విజయ్ కుమార్ వైపే మొగ్గుచూపింది.

మెదక్ స్థానం నుంచి మాజీ మంత్రి కరణం రాంచందర్ రావు కోడలు పరిణిత, నందు జనార్ధన్ రెడ్డి, నందా రెడ్డి, న్యాయవాది రాజశేఖర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆశించారు. ఇదిలా ఉండగా పంజా విజయ్ కుమార్ బీఅర్ఎస్ లో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి వర్గంగా కొనసాగారు. ఇటీవల బీజేపీలో చేరారు.

ఇప్పటి వరకు 8 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయగా, అందులో 6 సీట్లను అత్యధికంగా బీసీలకు కేటాయించింది. 2 జహీరాబాద్ ఎస్సీ, రామచంద్ర నర్సింహ, ఆందోల్ ఎస్సీ – మాజీ మంత్రి బాబు మోహన్ కు కేటాయించారు.

గజ్వేల్ లో సీఎం కెసిఆర్ పై ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ పడుతున్నారు. పటాన్ చెరువు కు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గానికి మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, మెదక్ కు పంజా విజయ్ కుమార్, నారాయణ్ ఖేడ్ లో సంగప్పకు కేటాయించారు. ఇంకా సిద్దిపేట, సంగారెడ్డి లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

నాలుగు కొత్త ముఖాలు
జిల్లాలో బీజేపీ ప్రకటించిన 8 మంది అభ్యర్థుల్లో నలుగురు అభ్యర్థులు అసెంబ్లీకి పోటీలో మొదటి సారి బరిలోకి దిగుతున్నారు. మురళి యాదవ్, సంగప్ప, పంజా విజయ్ కుమార్, రామచంద్ర రాజనర్సింహ తొలిసారి అసెంబ్లీ బరిలో ఉంటున్నారు. ఈటెల రాజేందర్, బాబూమోహన్, రఘునందన్ రావు, నందీశ్వర గౌడ్ అసెంబ్లీలో అడుగు పెట్టిన వారే కావడం గమనార్హం.
