దొర బలమా.. ప్రజా బలమా?

- కామారెడ్డి ప్రజలే తేల్చుతారు..
- బీజేపీ ఇన్చార్జ్ వెంకట రమణారెడ్డి
విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: దమ్ముంటే కేసీఆర్ గజ్వేల్ ను వదిలి కామారెడ్డి నుంచి మాత్రమే పోటీ చేయాలని, దొర బలమో, ప్రజా బలమో ప్రజలు నిర్ణయిస్తారని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ వెంకట రమణారెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం కామారెడ్డి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతోనే రెండు చోట్ల కేసీఆర్ పోటీ చేస్తున్నాడని అన్నారు.
గజ్వేల్ ను పూర్తిగా దోచుకొని, కామారెడ్డిని దోచుకునేందుకు వస్తున్నాడని ఆరోపించారు. ఉద్యమ తెలంగాణను అప్పుల తెలంగాణగా చేసాడని, కేసీఆర్ కు కామారెడ్డి ప్రజలు దిమ్మ దిరిగే షాక్ ఇస్తారన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తే శని వస్తుందని, ఆ శనిని దూరం పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
తెలంగాణలో కవిత పోచమ్మ వలె, కేసీఆర్, కేటీఆర్ పోతురాజుల వలె ప్రవర్తిస్తున్నారన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండ తల్లిదండ్రుల మీద ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. ఇప్పటికి రేషన్ కార్డులు వచ్చే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన కామారెడ్డి ఉద్యమ కారుల అనవాళ్ళు ఎక్కడ ఉన్నాయని, సిద్దిపేట, గజ్వేల్ లో బానిసలను చేసి ఇప్పుడు కామారెడ్డిలో గంపగోవర్దన్ ను బానిసగా చెయ్యడానికి వస్తున్నాడన్నారు.
బతుకమ్మలో ఏడాదికి రూ.200 కోట్ల స్కాం జరుగుతున్నదని ఆరోపించారు. సిరిసిల్లలో ఎక్కడ చూసినా ఇసుక, భూ మాఫియా విచ్చలవిడిగా కొనసాగుతున్నదన్నారు. కేటీఆర్ రాజ్యంలో కేటీఆర్ మేనత్త కొడుకు రూ.60 కోట్ల కుంభకోణం చేసాడన్నారు. కేసీఆర్ కామారెడ్డి లో గెలుస్తావ్ అనుకుంటే.. ఎవరికి డిపాజిట్ పోతాదో నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారన్నారు. కేసీఆర్ ను ఓడించక పొతే కామారెడ్డిలో తాను మళ్ళీ పోటీ చెయ్యనని సవాల్ విసిరాడు.