బీజేపీ విజయాలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు అర్ధరహితం: బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలను బీఆరెస్ ఓట్ల బదలాయింపుకు అంటగట్టి ప్రజాతీర్పును అవమానించేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల పట్ల ఆత్మవిమర్శ చేసుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ హితవు పలికారు.

బీజేపీ విజయాలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు అర్ధరహితం: బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌

విధాత : తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలను బీఆరెస్ ఓట్ల బదలాయింపుకు అంటగట్టి ప్రజాతీర్పును అవమానించేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల పట్ల ఆత్మవిమర్శ చేసుకోవాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ హితవు పలికారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. తాము బీఆరెస్ సహా మరెవరి దయా దాక్షిణ్యాలపై గెలవలేదని, ప్రధాని మోడీపై ఉన్న నమ్మకంతో ప్రజలు తమ అభ్యర్థులను ఎనిమిది మందిని గెలిపించి లోక్‌సభకు పంపారని అన్నారు. 47అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ ఇచ్చారని, ఎనిమిది ఎంపీ స్థానాల్లో గెలిపించి, ఆరు ఎంపీ స్థానాల్లో రెండో స్థానంలో నిలిపారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అటకెక్కించినందునే కాంగ్రెస్‌ను జనం చీకొట్టారని అన్నారు.

మరో ఆరు నెలల్లో హస్తం పార్టీపై ప్రజలు తిరుగుబాటు చేయడం ఖాయమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దొంగే దొంగ అన్నట్లుగా ఉన్నాయని, చావుతప్పి కన్ను లొట్టపోయినట్లుగా ఆ పార్టీకి సీట్లు వచ్చాయని అన్నారు. రేవంత్ రెడ్డికే చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడటం లేదని ఆయన మండిపడ్డారు. చీకటి ఒప్పందానికి పాల్పడింది ఎవరో ఇక్కడే తెలిసిపోతోందన్నారు. చరిత్రలో ఇప్పటి వరకు బీఆరెస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోలేదని, ఇక మీదట కూడా పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు.