తెలంగాణ‌లో ఇదీ బీజేపీ ప్లాన్..!

అవినీతికి పాల్పడిన కేసీఆర్‌ జైలుకు పోక తప్పదనీ మోదీ చెలరేగి విమర్శలు చేస్తున్నారు. జాతీయ స్థాయి నేతలు మొదలుకుని ఇటు రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకూ కేసీఆర్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు

తెలంగాణ‌లో ఇదీ బీజేపీ ప్లాన్..!
  • వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్‌కు పడకూడదు!
  • అదే వ్యూహంతో కమలనాథుల ప్రచారం?
  • కేసీఆర్‌పై తీవ్ర విమర్శలూ అందుకే!
  • ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌పై ఆశ వదిలేసిన బీజేపీ
  • హోరాహోరీలో రాజస్థాన్‌ దక్కకపోవచ్చు!
  • తెలంగాణ ఓడితే లోక్‌సభ పోల్స్‌పై ఎఫెక్ట్‌
  • దీర్ఘకాలిక ప్రణాళికతోనే బీజేపీ ఎత్తులు!


విధాత : కేసీఆర్‌పై మోదీ చెలరేగి విమర్శలు చేస్తున్నారు. అవినీతికి పాల్పడిన కేసీఆర్‌ జైలుకు పోక తప్పదనీ హెచ్చరిస్తున్నారు. బీజేపీ జాతీయ స్థాయి నేతలు మొదలుకుని.. ఇటు రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకూ కేసీఆర్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. బీజేపీకి, బీఆరెస్‌కు మధ్య రహస్య మైత్రి ఉంటే.. ఇంత ఘాటు వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న తలెత్తడం సహజం. దీని వెనుకే అతిపెద్ద వ్యూహం దాగుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆఖరి నిమిషంలో కాంగ్రెస్‌కు బలమైన ప్రజా మద్దతు అందుతున్న నేపథ్యంలో ఏది ఏమైనా తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి రాకూడదనేదే వారి అసలు వ్యూహమని చెబుతున్నారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఇక మిగిలింది తెలంగాణ ఒక్కటే. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయంగా కనిపిస్తున్నది. మిజోరంలో కాంగ్రెస్‌తో కలిపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక హోరాహోరీ పోరుసాగిందని చెబుతున్న రాజస్థాన్‌లో పరిస్థితి తారుమారై కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేకపోలేదన్న అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ విజయం సాధిస్తే.. బీజేపీకి, ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోదీకి ఇంతకంటే అవమానకర పరాజయం ఉండబోదు. అది రేపటి లోక్‌సభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశమూ ఉంటుంది.


లోక్‌సభ ఎన్నికలతోపాటు జరిగే నాలుగు రాష్ట్రాలలో ఏపీ, ఒడిశా మినహాయిస్తే అరుణాచల్‌ మాత్రమే బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రం. సిక్కింలో సంకీర్ణం నడుస్తున్నది. అంటే. ఇప్పటికే కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోయింది. తాజా ఐదు రాష్ట్రాలు కలుపుకొంటే ఓడిన రాష్ట్రాల సంఖ్య ఏడుకు చేరుతుంది. రాబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఏపీ, ఒడిశాలో బీజేపీకి చాన్స్‌ లేనట్టే. ఈ నేపథ్యంలో ఎలాగైనా తెలంగాణ కాంగ్రెస్‌ వశం కాకుండా చూడటమే కర్తవ్యంగా పెట్టుకున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు కన్సాలిడేట్‌ కాకుండా చూసేందుకు, ఆ ఓట్లు బీజేపీవైపు మళ్లించుకుని, బీఆరెస్‌ను గట్టెక్కించేందుకే కేసీఆర్‌పై, బీఆరెస్‌ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు చెలరేగి విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయాలు రాజకీయ చర్చల్లో వినిపిస్తున్నాయి. అందుకు తగినట్టే బీఆరెస్‌ నాయకులు ప్రత్యేకించి కేసీఆర్‌.. బీజేపీపై స్వల్ప విమర్శలతోనే సరిపెట్టేస్తున్నారు.


లేచి.. పడిన బీజేపీ

వాస్తవానికి 2023 మే, జూన్‌ నెలల్లో బీజేపీ బలమైన పార్టీగా తెలంగాణలో కనిపించింది. కానీ.. నాటకీయ పరిణామాల్లో అది ఒక్కసారిగా నేలమట్టమైంది. దీని వెనుక చిదంబర రహస్యంపై అనేక చర్చలు నడిచాయి. వాటి సారాంశం.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో రాకుండా చూడటమేనని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు కీలక కాంగ్రెస్‌ అభ్యర్థుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించడాన్ని ప్రస్తావిస్తున్నారు. అటువంటివారిలో జీ వివేక్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వంటివారు ఉన్నారు. వివేక్‌ గతంలో బీజేపీలో ఉండేవారు. ఎలక్షన్‌ మ్యానిఫెస్టో కమిటీ సారథిగా ఉండి.. కాంగ్రెస్‌లోకి వచ్చారు. కాంగ్రెస్‌ గాలి వీస్తున్న అంశాన్ని ఆలస్యంగానైనా గుర్తించే వివేక్‌, విజయశాంతి తదితరులు కాంగ్రెస్‌లో చేరారనే అభిప్రాయాలు ఉన్నాయి. వివేక్‌కు కుటుంబ పరంగా అనేక పరిశ్రమలు, వ్యాపారాలు ఉన్నాయి. వివేక్‌ పారిశ్రామిక, వ్యాపార ప్రయాణం ఇప్పటిది కాదు. కానీ.. ఇప్పుడే ఆయన కార్యాలయాలు, నివాసాల్లో ఎందుకు సోదాలు జరిగాయో సులభంగానే అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రచారం చివరి రోజుల్లో కాంగ్రెస్‌ ఆర్థిక వనరులపై దెబ్బతీసేందుకు జరిగిన ప్రయత్నమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆఖరి సమయంలో ఆర్థిక వనరులు టార్గెట్‌ చేయడం బీఆరెస్‌కు మేలు చేసేందుకేనని సాధారణ ప్రజలకు కూడా అర్థమవుతున్నదని పేర్కొంటున్నారు.


లోక్‌సభ ఎన్నికలపై ఎఫెక్ట్‌!

కాంగ్రెస్‌ గాలి ఉన్నదనే అంశం చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ.. అది మెజార్టీ మార్కు దాటడంతోనే పరిమితమవుతుందా? లేక ఊహించని స్థాయిలో.. ఆ పార్టీ నేతలే చెబుతున్నట్టు సునామీ సృష్టిస్తుందా? అన్నది వేచి చూడాలి. ఇది ఎలా ఉన్నా.. కాంగ్రెస్‌కు పెరుగుతున్న గట్టి ప్రజా మద్దతు బీఆరెస్‌నే కాకుండా.. ప్రత్యేకించి బీజేపీని కలవరానికి గురిచేస్తున్నదని సీనియర్‌ పాత్రికేయుడు ఒకరు అన్నారు. కాంగ్రెస్‌ కనుక మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, పరిస్థితి తారుమారై రాజస్థాన్‌లోనూ విజయం సాధించి, ఇక్కడా గెలిస్తే జాతీయ స్థాయిలో తీవ్ర పర్యవసానాలు ఎదురవుతాయని బీజేపీ నాయకుడు ఒకరు అంగీకరించారు. ఇక్కడ కాంగ్రెస్‌ గెలవకూడదని గట్టి పట్టుదలతో బీజేపీ ఎందుకు ఉన్నదో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.



కవిత అరెస్టుతో మైత్రి బట్టబయలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కూడా ఇక్కడ ఒక కీలక అంశంగా ఉన్నది. బండి సంజయ్‌ చేతిలో పగ్గాలు ఉన్న సమయంలో పాదయాత్రల పేరిట బీజేపీ గ్రాఫ్‌ పెంచారు. ఒక దశలో బీఆరెస్‌కు గట్టి, ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అనే వాతావరణం కూడా నెలకొన్నది. ఆ సమయంలో కేసీఆర్‌ కుటుంబంపై ఉన్న అవినీతి కేసులలో విచారణ జరిపించాలని కేంద్ర నాయకత్వాన్ని బండి కోరితే.. పార్టీ పెద్దల నుంచి స్పందన రాలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేసీఆర్‌ కుమార్తె కవిత తప్ప.. చార్జిషీటులో ఉన్న మిగిలినవారంతా అరెస్టయ్యారు. కవితను అరెస్టు చేస్తారనే వాతావరణం వచ్చినా.. ఆమె చక్కగా ఇంటికి వచ్చేశారు. ఆ సమయంలోనే బీఆరెస్‌, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ప్రజలకు అర్థమైపోయిందని పరిశీలకులు చెబుతున్నారు.