సూర్యాపేట ఎస్పీగా బీకే రాహుల్ హెగ్డే

సూర్యాపేట ఎస్పీగా బీకే రాహుల్ హెగ్డే

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: సూర్యాపేట జిల్లా నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా బీకే రాహుల్ హెగ్డేను నియమించారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన బదిలీల్లో భాగంగా రెండేళ్లుగా సూర్యాపేట ఎస్పీగా పనిచేసిన రాజేంద్రప్రసాద్ బదిలీ అయ్యారు. శుక్రవారం వరకు అదనపు ఎస్పీ మేక నాగేశ్వరరావు ఇంచార్జి ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు.


మధ్యాహ్నం ఐపీఎస్ ల బదిలీల్లో భాగంగా రాహుల్ హెగ్డేను సూర్యాపేట ఎస్పీగా బదిలీ చేశారు. 2014 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రాహుల్, కర్ణాటకకు చెందిన వారు. ఆర్వీ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేశారు. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన ప్రతిభావంతుడుగా రాహుల్ హెగ్డేను చెపుతుంటారు.


మొదటగా 2015లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరు నాగారం అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2018లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి, ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల పాటు నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాదులో ట్రాఫిక్ విభాగంలో డిప్యూటీ కమిషనర్ గా ఫిబ్రవరి 2023 నుంచి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సూర్యాపేటకు బదిలీపై వచ్చారు.