ఇప్ప‌టి వ‌ర‌కూ వివిధ జిల్లాల్లో మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్ల‌లో అస‌మ్మతి ర‌గిలి అవిశ్వాసాల‌కు దారి తీస్తుండ‌గా.. తాజాగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ)లోనూ వ‌ల‌స‌ల కాక మొద‌లైంది

  • ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన ఫ‌సియుద్దీన్‌
  • తాజాగా రేవంత్‌రెడ్డిని క‌లిసిన బొంతు
  • త్వ‌ర‌లో లాంఛ‌నంగా కాంగ్రెస్‌లో చేరిక‌!
  • వారి బాట‌లోనే త్వ‌ర‌లో మ‌రికొంద‌రు
  • పాతిక‌మంది కార్పొరేట‌ర్లు క్యూలో!
  • కేటీఆర్ టైమ్ ఇవ్వ‌ట్లేద‌న్న నేత‌లు
  • ఇప్ప‌టికే ప‌లు మున్సిపాల్టీలు హ‌స్త‌గ‌తం
  • తాజా టార్గెట్ జీహెచ్ంఎంసీ
  • రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పావులు క‌దుపుతున్న కాంగ్రెస్ పెద్ద‌లు
  • ఎంఐఎం మ‌ద్ధ‌తుతో మేయ‌ర్ పీఠం!

Telangana | విధాత‌, హైద‌రాబాద్‌: ఇప్ప‌టి వ‌ర‌కూ వివిధ జిల్లాల్లో మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్ల‌లో అస‌మ్మతి ర‌గిలి అవిశ్వాసాల‌కు దారి తీస్తుండ‌గా.. తాజాగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ)లోనూ వ‌ల‌స‌ల కాక మొద‌లైంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు గుంభ‌నంగా ఉన్న బీఆరెస్ కార్పొరేట‌ర్లు కాంగ్రెస్‌లోకి జంప్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని తెలుస్తున్న‌ది. మాజీ మంత్రి, బీఆరెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒంటెత్తు పోక‌డ‌ల‌తో విసిన కార్పొరేట‌ర్లు త‌మ దారి తాము చూసుకునే ప‌నిలో ఉన్నార‌ని స‌మాచారం. జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో మొత్తం 150 మంది కార్పొరేట‌ర్లు ఉండ‌గా పార్టీల వారీగా బ‌లాబ‌లాలు ఈ విధంగా ఉన్నాయి.

బీఆరెస్ 55, బీజేపీ 40, ఎంఐఎం 44 మంది స‌భ్యులు ఉండ‌గా.. కాంగ్రెస్‌కు మూడు సీట్లు ఉన్నాయి. ఎన్నిక‌ల త‌రువాత బీజేపీ నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ఒక‌రు చొప్పున బీఆరెస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత కార్పొరేట‌ర్ల‌లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంద‌నే చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. తాము క‌లిసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. కేటీఆర్ క‌నీసం టైమ్ కూడా ఇవ్వ‌డం లేద‌న్న అసంతృప్తితో బీఆరెస్ కార్పొరేట‌ర్లు ఉన్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో అసంతృప్త కార్పొరేట‌ర్ల‌ను చేర్చుకునేందుకు మాజీ ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావును కాంగ్రెస్ రంగంలోకి దింపింద‌ని తెలుస్తున్న‌ది.

రేవంత్‌ను క‌లిసిన బొంతు రామ్మోహ‌న్‌

ఆదివారం నాడు జీహెచ్ఎంసీ మాజీ మేయ‌ర్, బీఆరెస్ నాయ‌కుడు బొంతు రామ్మోహ‌న్.. ముఖ్య‌మంత్రి ఏ రేవంత్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి శాలువా క‌ప్పారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ ఆయ‌న బీఆరెస్‌ను వీడాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆయ‌న భార్య ప్ర‌స్తుతం కార్పొరేట‌ర్ గా ఉన్నారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన బొంతు రామ్మోహ‌న్‌ ఆయనతో ప్రత్యేకంగా సమావేశమై పలు రాజకీయ అంశాలపై చర్చించారు.

కాంగ్రెస్ నుంచి మల్కాజిగిరి టికెట్ కావాలని రామ్మోహ‌న్‌ కోరుతుండగా, ముందు ఆయన పార్టీలో చేరాలని, టికెట్ విషయం అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తున్న‌ది. రేవంత్ రెడ్డి, రామ్మోహ‌న్‌తో భేటీ సందర్భంగా సీఎం ప్రధాన సలహాదారు వేంరెడ్డి నరేందర్‌రెడ్డి కూడా వారి వెంట ఉన్నారు. బీఆరెస్‌పై కొంతకాలంగా తీవ్ర అసంతృప్తిగా ఉన్న బొంతు రామ్మోహ‌న్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డారు.

ఆయనను కాదని బండారు లక్ష్మారెడ్డికి బీఆరెస్ అధినేత కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో లక్ష్మారెడ్డి విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో మల్కాజిగిరి బీఆరెస్ టికెట్‌ను ఆశించిన రామ్మోహ‌న్‌కు మరోసారి కూడా కేసీఆర్‌, కేటీఆర్‌ నుంచి ప్రతికూల స్పందన వచ్చిందని స‌మాచారం. బీఆరెస్‌లో తనకు రాజకీయ భవిష్యత్తు లేదన్న అసంతృప్తితో ఉన్న బొంతు రాంమోహన్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకుని సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇప్ప‌టికే కాంగ్రెస్‌లోకి బాబా ఫ‌సియుద్దీన్‌

రెండు రోజుల క్రితం బీఆరెస్‌ కార్పొరేట‌ర్, మాజీ డిప్యూటీ మేయ‌ర్‌ బాబా ఫ‌సియుద్దీన్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయ‌న కూడా కేటీఆర్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అరాచ‌కాల‌ను త‌ట్టుకోలేకే పార్టీ వీడుతున్న‌ట్లు ప్ర‌కటించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే టీ ప‌ద్మారావు వైఖ‌రిపై డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీల‌తా రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌ని స‌మాచారం.

ఈ విష‌యం కేటీఆర్‌కు స్వ‌యంగా చెప్పేందుకు ఆమె ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ అప్పాయింట్‌మెంట్ ల‌భించ‌డం లేద‌ని తెలుస్తోంది. బీఆరెస్‌కు కౌన్సిల్లో 55 మంది స‌భ్యులు ఉండ‌గా, ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది. అద‌నంగా ఇర‌వై మంది వ‌ర‌కు ఎక్స్ ఆఫీషియో స‌భ్యులు ఉన్నారు. దీంతో మేయ‌ర్ ప‌ద‌విని బీఆరెస్ ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోపే ఖాళీ!

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోపే బీఆరెస్ నుంచి పెద్ద సంఖ్య‌లో కార్పొరేట‌ర్లు, నాయ‌కుల‌ను పార్టీలోకి తీసుకునేందుకు కాంగ్రెస్ పెద్ద‌లు ముఖ్య నాయ‌కుల‌ను రంగంలోకి దింపార‌ని తెలుస్తున్న‌ది. వారు ఇప్ప‌టికే బీఆరెస్ కార్పొరేట‌ర్ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. కేటీఆర్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న‌వారంద‌రితో ఇప్ప‌టికే రెండు మూడు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు పూర్త‌య్యాయ‌ని విశ్వ‌స‌నీయంగా తెలిసింది. మేయ‌ర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశ‌గా వ‌ల‌స‌లు ప్రోత్స‌హించాల‌ని టార్గెట్ పెట్టుకుని.. క‌నీసం బీఆరెస్‌ను స‌గం మేర చీల్చే ప్ర‌య‌త్నాల్లో కాంగ్రెస్ నాయ‌క‌త్వం ఉన్న‌ద‌ని

స‌మాచారం.

ఎంఐఎం మ‌ద్ద‌తు ల‌భిస్తే మేయ‌ర్ సీటును ద‌క్కించుకునేందుకు వెన‌కాడ‌వ‌ద్ద‌ని, స‌న్న‌ద్దంగా ఉండాల‌ని కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి సంకేతాలు అందాయ‌ని తెలుస్తోంది. ఏది ఏమైనా మ‌రో వారం రోజుల్లో ఒక స్ప‌ష్ట‌త రానున్న‌ద‌ని గాంధీభ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే జిల్లాల్లో మునిసిపాల్టీలు, కార్పొరేష‌న్ల‌లో అవిశ్వాస తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెట్టి , బ‌ల‌నిరూప‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, ప‌లు చోట్ల‌ పీఠాల‌ను కైవ‌సం చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. అవి దాదాపు పూర్తి కావ‌డంతో కాంగ్రెస్ నాయ‌క‌త్వం గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ పై దృష్టి పెట్టిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది.

హైద‌రాబాద్ న‌గ‌రంలో బీఆరెస్, ఎంఐఎం పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మొత్తం 15 నియోజ‌క‌వ‌ర్గాల‌లో బీజేపీ నుంచి ఒక‌రు, ఎంఐఎం నుంచి ఏడుగురు, బీఆరెస్ నుంచి ఏడుగురు విజ‌యం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క‌టంటే ఒక్క సీటు కూడా గెలుపొంద‌లేదు. దీంతో పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ప‌ట్టు పెంచుకోవాల‌నే క‌సితో కాంగ్రెస్ నాయ‌కులు జీహెచ్ఎంసి కౌన్సిల్‌లో బీఆరెస్‌ను ఖాళీ చేసి మాన‌సికంగా దెబ్బ‌కొట్టాల‌నే ల‌క్ష్యంతో ఉన్నార‌ని తెలుస్తున్న‌ది.

Updated On 12 Feb 2024 2:05 AM GMT
Somu

Somu

Next Story