ఉద్యమకారులపై బీఆర్‌ఎస్‌ దృష్టి.. తమ వైపు తిప్పుకునేందుకు గులాబీ యత్నాలు

ఉద్యమకారులపై బీఆర్‌ఎస్‌ దృష్టి..  తమ వైపు తిప్పుకునేందుకు గులాబీ యత్నాలు
  • ఇన్నాళ్లూ అపాయిట్మెంట్ ఇవ్వని వైనం?
  • ఉద్యమ జ్ఞాపకాలనూ చెరిపేసిందన్న విమర్శలు
  • కాంగ్రెస్ గ్యారెంటీల్లో ఉద్యమకారులకు ఇంటి స్థలం
  • తమ వైపు తిప్పుకునేందుకు గులాబీ యత్నాలు

విధాత: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికారపార్టీ ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి అనేక అవస్థలు పడుతున్నది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం మొదలు మంత్రి కేటీఆర్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి, వివిధ పౌర, ప్రజా సంఘాల నేతలకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. దర్శకుడు బీ నర్సింగరావు అయితే ఏకంగా మంత్రి కేటీఆర్‌పైనే తీవ్ర విమర్శలు చేసిన విషయం విదితమే.



టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత ఉద్యమ జ్ఞాపకాలను చెరిపేసిందని, తెలంగాణ ఆత్మను తాకట్టుపెట్టిందని రేవంత్‌రెడ్డితో పాటు కొంతమంది ఉద్యమకారులు కూడా విమర్శించారు. వీటిని అధికారపార్టీ పట్టించుకోకపోగా.. సోషల్‌ మీడియాలో వారి అనుయాయులతో ఉద్యమకారులపై తీవ్ర విమర్శలు చేసింది. తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో బీఆర్‌ఎస్‌ కొంతమంది ఉద్యమకారులకు అవకాశాలు కల్పించినా, చాలామంది ఉద్యమకారులకు దూరమైందనే వాదనలున్నాయి.

ప్రభుత్వ వ్యతిరేకతతో దిగొచ్చేనా?



తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో తమవంతు పాత్ర పోషించి, అనారోగ్య కారణాలతో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని చాలాకాలంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. అయినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు.



ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ హామీల్లో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామన్నది. దీంతో ఇప్పటికే నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. అనేక వర్గాలు దూరమయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడూ ఎమ్మెల్యేల పనితీరు కూడా సరిగ్గా లేదని సర్వేలు చెబుతున్నాయి.



ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో సంక్షేమ పథకాలే గట్టెక్కించలేవన్న అభిప్రాయం బీఆర్‌ఎస్‌ అధినేతలో ఉన్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమంలో పనిచేసి అనారోగ్యంతో కన్నుమూసిన కవులు, కళాకారుల కుటుంబాలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌లను అందిస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తమౌతున్నది. కానీ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని, ఉద్యమంలో జేఏసీల్లో కీలకంగా పనిచేసిన వారు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.



ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్‌ సమయం ఇస్తే వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుని రావాలని అనుకుంటున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ వైఖరి మారుతున్నదని, ఉద్యమకారులంతా కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నందున వారిని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నదని తెలుస్తోంది.