బీఆరెస్ నేత‌ల‌కు ఇంకా అహంకారం త‌గ్గ‌లేదు

ప్రజలు ఓటమి రుచి చూపించినా ఇంకా అదే అహంకార రీతిలో బీఆరెస్ నేతలు మాట్లాడుతూ ప్రజలెన్నుకున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి డి.శ్రీధర్‌బాబు

బీఆరెస్ నేత‌ల‌కు ఇంకా అహంకారం త‌గ్గ‌లేదు
  • ఓడినా మీలో మార్పు రాదా
  • మీ పాలనలో రెండు నెలలకు కేబినెట్ ఏర్పాటు
  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు
  • మాది గడిల పాలన కాదు.. గల్లీ బిడ్డల పాలన : మంత్రి సీతక్క

విధాత : ప్రజలు ఓటమి రుచి చూపించినా ఇంకా అదే అహంకార రీతిలో బీఆరెస్ నేతలు మాట్లాడుతూ ప్రజలెన్నుకున్న ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు విమర్శించారు. గురువారం మంత్రి సీతక్కతో కలిసి ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదంటూ బీఆరెస్ విడుదల చేసిన 420బుక్‌లెట్‌ను తీవ్రంగా ఖండించారు. 3500 రోజులు పాలించిన బీఆరెస్‌ వాళ్ళే 35రోజుల పాలన చేసిన మాపై అప్పుడే అక్కసుతో మార్పు కావాలని ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తున్నారన్నారు.బీఆరెస్ ప్రభుత్వం 2018లో ఏర్పడిన సందర్భంలో సీఎంగా కేసీఆర్ మినహా రెండు నెలల దాకా కేబినెట్ కూడా ఏర్పాటు చేయని సంగతి వారు మరచిపోవడం హాస్యాస్పదమన్నారు. ఇది ప్రజాతీర్పును బీఆరెస్ అపహాస్యం చేసిన తీరుకు నిదర్శనమన్నారు.


మేం ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలలో 48గంటల్లోనే రెండు హామీలు అమలు చేశామని, ఫ్రీ బస్ సర్వీస్ పథకాన్ని ఇప్పటి వరకు 6 కోట్ల మంది మహిళలు సేవలు వినియోగించుకున్నారన్నారు. బీఆరెస్‌ పదేళ్ల పాలనలో ప్రజారోగ్యం గాలికి వదిలేయగా, మేం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచి అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ వచ్చి 35 రోజులు కూడా కాలేదని, ప్రతిపక్షంగా మీ వద్ధ ఏమైనా మంచి సూచనలు మేము స్వీకరించడానికి సిద్దంగా ఉన్నామని ఇప్పటికే అసెంబ్లీ వేదికగా సీఎం చెప్పారన్నారు. పదేళ్ల పాలించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి.. ఇప్పుడు మేము వచ్చిన 30 రోజులకే ఇంత అహంకారంగా వ్యవహరించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మా ప్రభుత్వ పాలనపై బీఆరెస్ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టడం కాదని, గ్రామాల్లోకి వెళ్లి అక్కచెల్లెళ్లను అడిగితే తెలుస్తుందన్నారు. బీఆరెస్‌ పాలనలో ఒక్కసారైనా ప్రజలను కలువలేదని, వారి గోస వినలేదని, అందుకే మీ అహంకార పూరిత పాలనకు చరమగీతం పాడారన్నారు.


అయినా మారకుండా మాపై అక్కసు వెళ్లగక్కుతుందన్నారు. మేం ప్రజాదర్భార్‌, ప్రజా పాలన కార్యక్రమాలతో ప్రజల సమస్యలు విని పరిష్కార చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2014, 2018ఎన్నికల్లో బీఆరెస్ ఇచ్చిన దళిత, సీఎం, మూడెకరాల భూమి, మైనార్టీలకు12శాతం, గిరిజనులకు 10శాతం రిజర్వేషనే్ ఇస్తామని చెప్పి, కేజీ టూ పీజీ ఉచిత విద్య అని, డబుల్ బెడ్‌రూమ్‌లని చెప్పిన హామీల సంగతేమిటో బీఆరెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కేంద్రంపై విభజన హామీల సాధనకు,బయ్యారం ఉక్కు, ప్రాజెక్టులకు జాతీయ హోదా… ట్రైబల్ యూనివర్సిటీ సాధనకు ఎందుకు పోరాటం చేయలేదన్నారు. అందుకే ప్రజలు ఎవరు 420 ఎవరు డబుల్ 420 అని తెలుసుకుని మిమ్మల్ని ఓడించారని చురకలేశారు.


 


మాది గడీల పాలన కాదు..గల్లీ బిడ్డల పాలన : మంత్రి సీతక్క

మాది గడిల పాలన కాదు.. గల్లీ బిడ్డల పాలన అని, మా ప్రభుత్వానికి ప్రజల మద్దతు చూసి, అధికారం దూరమైందన్న అక్కసుతో బీఆరెస్‌ నేతలు మాపై దుష్ప్రచారం చేస్తున్నాని, ముందు మీ పార్టీని చక్కదిద్దుకోమని మంత్రి సీతక్క హితవు పలికారు. బీఆరెస్ నేతలు ఆటో డ్రైవర్ లను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకొని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం బీఆరెస్ వ్యతిరేకిస్తున్నట్లుగా కనబడుతుందన్నారు. రాజకీయాల కోసం ఆటో డ్రైవర్స్ ను బలి చెయ్యొద్దని, మా ప్రభుత్వం వారికి కూడా న్యాయం చేసే కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. బీఆరెస్‌ ప్రభుత్వంలో ఏకకాలంలో రుణమాఫీ అన్నారని ఏమైందని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోపిడీ దొంగలు దోచుకున్నారని, బీఆరెస్‌ పార్టీ 420 అనే ప్రజలు ఓడగొట్టారన్నారు. ప్రజాస్వామికంగా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కూల్చేస్తాం, పేలుస్తాం అంటున్నారని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆరెస్‌ పార్టీ ఫ్యూడల్ పార్టీ అని.. అధికారం లేకుండా ఆ పార్టీ నాయకులు బతకలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికలతో బీఆరెస్ కనుమరుగు కాకతప్పదన్నారు.