బీఆరెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలం: హరీశ్‌రావు

బీఆరెస్‌ పార్టీ ఎస్సీ వర్గీకరణకుమొదటి నుంచి అనుకూలమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావుఅన్నారు. తనను కలిసిన ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ బృందంతో ఆయన మాట్లాడారు

బీఆరెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలం: హరీశ్‌రావు

విధాత: బీఆరెస్‌ పార్టీ ఎస్సీ వర్గీకరణకుమొదటి నుంచి అనుకూలమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావుఅన్నారు. తనను కలిసిన ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ బృందంతో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో రెండుసార్లు వర్గీకరణ కోసం తీర్మానం చేశామని, తప్పనిసరిగా వర్గీకరణ చేయాలని కేసీఆర్ గతంలో ప్రధాన మంత్రిని కోరినట్లుగా గుర్తు చేశారు.

జాతీయ స్థాయిలో ఈ అంశం తేలకపోతే రాష్ట్ర పరిధిలోనైనా వర్గీకరణ చేసుకొనే అవకాశం ఇవ్వమని కోరామని, కాని అప్పట్లో కేంద్రం అనుమతి ఇవ్వలేదన్నారు. ఒకవేళ కేంద్రం ఆ వెసులుబాటు కల్పించి ఉంటే ఇప్పటికే వర్గీకరణ మన రాష్ట్రంలో అమలవుతూ ఉండేదని పేర్కొన్నారు. ఈ అంశంలో‌ వెనుకడుగు వేయబోమన్నారు.

వర్గీకరణ కోసం అసెంబ్లీలో, పార్లమెంటులో గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు. బీజేపీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పినా మ్యానిఫెస్టోలో ఆ విషయాన్ని చేర్చలేదని విమర్శించారు. కనీసం బిల్లు కూడా పెట్టలేదని, ఇది ఆ పార్టీ చిత్తశుద్దిని అనుమానస్పదం చేస్తుందన్నారు. మాదిగలను వాడుకున్నది తప్పా వారికి మేలు చేయలేదని ఆరోపించారు. పదేండ్లగా అధికారంలో ఉండి కూడా వర్గీకరణ చేయని బీజేపీకి మాదిగల‌ ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.

దళితబంధు కింద 12 లక్షలు ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు అకౌంట్లను ఫ్రీజ్ చేసి పథకాన్ని అటకెక్కించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ మూడు ఎంపీ సీట్లలో ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వకుండా వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందన్నారు. కేసీఆర్ మాదిగలకు రెండు సీట్లు ఇచ్చి గౌరవించారని, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆరెస్‌ను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మాదిగలు బుద్ది చెప్పాలని కోరారు.