సీఎం రేవంత్ రెడ్డి గతంలో స్వయంగా చెప్పినట్టుగా వేలాది తెలంగాణ బిడ్డలను చంపినా బలిదేవత ఎవరని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు
అన్ని అనర్ధాలకు కాంగ్రెస్ కారణమని మండిపాటు
విధాత, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి గతంలో స్వయంగా చెప్పినట్టుగా వేలాది తెలంగాణ బిడ్డలను చంపినా బలిదేవత ఎవరని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ రాష్ట్ర సాధన తొలి, మలి దశ ఉద్యమాల్లో బలిదానాలకు, అనర్ధాలకు, కుట్రలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. 2004లో మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరని ప్రశ్నించారు.
తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరులస్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల అని ప్రశ్నించారు. 1952 లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి 6 మందిని బలిగొన్నది ఎవరని,వాటికి మీ కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం కాదా అని ప్రశ్నించారు. 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవరని, 1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11/14 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరని, దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరని మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కావా అని నిలదీశారు.