అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ గెలిచి ఉండేదే.. ఆ తప్పులు జరిగి ఉండకపోతే

ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కనీసం 30 మందిని మార్చి ఉంటే ఫలితం ఇంకోలా ఉండేదని ఒకరంటారు! సీఎంపై సానుకూలత ఉన్నది కానీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నదని మరొకరు

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ గెలిచి ఉండేదే.. ఆ తప్పులు జరిగి ఉండకపోతే
  • అడ్డ‌­గోలు నిర్ణ‌­యాలు.. అహం­కార ధోర‌ణి.. ఏక‌­ప‌క్ష నిర్ణ‌­యాలు…
  • అసెంబ్లీ ఎన్ని­కల్లో బీఆ­రెస్‌ కొంప ముంచింది ఇవే?
  • గత లోక్‌సభ ఎన్నికల్లోనే తొలి బీటలు
  • ఆర్టీసీ కార్మి­కుల స‌మ్మెతో డేంజర్‌ బెల్స్‌
  • ధర­ణితో రైతాం­గంలో పెరిగిన వ్యతి­రే­కత
  • ఏవీ పట్టించుకోని గులాబీ పార్టీ అధినేత
  • తన నిర్ణయమే ఫైనల్‌ అంటూ వ్యవహారం
  • వాటి ఫలితంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి
  • అయినా కేసీ­ఆర్‌ ఫేస్‌ సేవిం­గ్‌కు నేతల పాట్లు
  • ఎమ్మెల్యే అభ్య­ర్థు­లపై నెపం నెట్టేసే యత్నం
  • ఎన్ని­కల్లో రెండు పార్టీల మధ్య తేడా 2% కాదు
  • హైద­రా­బా­ద్‌ను మిన­హా­యిస్తే 10 శాతం పైనే!
  • కాంగ్రెస్‌ గెలుపు.. బీఆ­రె­స్‌పై తీవ్ర వ్యతి­రే­కత ఫలితం 

. రాజకీయ పరిశీలకుల వ్యాఖ్యలు 


విధాత‌: ఎమ్మెల్యే అభ్య­ర్థుల్లో కనీసం 30 మందిని మార్చి ఉంటే ఫలితం ఇంకోలా ఉండే­దని ఒక­రం­టారు! సీఎంపై సాను­కూ­లత ఉన్నది కానీ ఎమ్మె­ల్యే­లపై వ్యతి­రే­కత ఉన్న­దని మరొ­కరు సూత్రీ­క­రి­స్తారు! 32 మెడి­కల్‌ కాలే­జీల బదులు 32 యూట్యూబ్‌ చానళ్లు పెట్టి ఉంటే బాగుం­డే­దని ఎవరో అన్నా­రని ఇంకొ­కరు నిట్టూ­ర్చ­తారు! ప్రజలు గంద­ర­గో­ళా­నికి గుర­య్యా­రని, కాంగ్రెస్‌ వలలో పడి ఆ పార్టీకి ఓటే­శా­రని వితం­డ­వా­దా­నికి దిగు­తు­న్న­వారూ ఉన్నారు! సోషల్‌ మీడి­యాలో ప్రజ­లపై తమ ఆక్రో­శాన్ని వెళ్ల­గ­క్కు­తున్న గులాబీ శ్రేణులు లెక్కకు మిక్కిలి! వెరసి.. సాకులు వెతు­క్కో­వ­డమే తప్పించి.. లోపాన్ని తెలు­సు­కు­నేం­దుకు బీఆ­రెస్‌ ప్రయ­త్నాల్లో ఉన్న సంకే­తా­లైతే కని­పిం­డచం లేదు.

ఎమ్మె­ల్యే­లను మార్చినా ఇదే ఫలితం!

బీఆ­రెస్‌ నేతలు చెబు­తు­న్న­ట్టుగా ఎమ్మె­ల్యే­లను మార్చినా ఆ పార్టీకి ఇదే ఫలితం వచ్చి ఉండే­దని రాజ­కీయ విశ్లే­ష­కులు చెబు­తు­న్నారు. వివిధ సామా­జిక మాధ్య­మాల్లో మాజీ మంత్రి కేటీ­ఆర్‌ సహా పలు­వురు నాయ­కులు, గులాబీ శ్రేణులు చేస్తున్న విశ్లే­ష­ణ­లపై వారు స్పందిస్తూ.. బీఆ­రెస్‌ ఓట­మికి ఇవేవీ అసలు కార­ణాలు కాదని, అసలు కారణం.. ఆ మాట­కొస్తే ఏకైక కారణం ఆ పార్టీ అధి­నేత కేసీ­ఆర్‌ వ్యవ­హార శైలే­నని స్పష్టం చేస్తు­న్నారు. మొదటి దఫా అధి­కా­రం­లోకి వచ్చిన దగ్గర నుంచి చివ­రకు పదవి నుంచి దిగి­పోయే సమ­యంలో కూడా అధి­నేత అహం­కారం ఎప్ప­టి­క­ప్పుడు వ్యక్త­మ­వు­తూనే వచ్చిం­దని వారు చెబు­తు­న్నారు.

పార్లమెంటు ఎన్నికల్లోనే ఓటమి పునాదులు

2018 ఎన్ని­క‌ల్లో బీఆ­రెస్ 97,00,479 ఓట్లు సాధించి, అత్య‌­ధిక మెజా­ర్టీతో రెండో­సారి అధి­కారం చేప‌­ట్టింది. అప్పుడు మంత్రి­వ‌ర్గం ఏర్పాటు చేయ‌­కుండా నా రాజ్యం… నా ఇష్టం అన్నట్లు వ్య‌వ‌­హ­రిం­చిన తీరుకు ఆ వెంటనే జ‌రి­గిన పార్ల‌­మెంటు ఎన్ని­క‌ల్లో ప్రజలు తమ నిర­సన తెలి­పారు. ఫలి­తంగా పార్ల‌­మెంటు ఎన్ని­క‌ల్లో 76,96,848 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది. అంటే.. ఏకంగా 20,03,631 లక్షల ఓట్లను కోల్పోయింది. ఇది ఎందుకు జరిగింది? అన్న విషయంలో బీఆరెస్‌ నాయకత్వం ఆత్మవిమర్శనాపూర్వక సమీక్ష చేసుకున్న దాఖలు లేవు. గుణపాఠం తీసుకున్నదీ లేదు. నిజానికి ఇప్పటి బీఆరెస్‌ ఓటమికి పునాది అక్కడే పడింది. తదుపరి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారీ దెబ్బలే తగిలాయి. ఆనాడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే.. కేసీఆర్‌ అహంకారపూరిత వైఖరితో వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తాయి. సమ్మెపై ఉక్కుపాదం మోపడమే కాకుండా యూనియన్లను రద్దు చేసేసి.. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.


పంచాయతీ కార్మికుల సమ్మె విషయంలోనూ అలానే వ్యవహరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం లేదనడానికి నాటి పరిణామాలు నిదర్శనంగా నిలిచాయి. బీఆరెస్‌ను తదుపరి ఎన్నికల్లో ఓడించాలని ఆయా వర్గాల్లో ఆలోచనలు మొదలైనది ఈ పరిణామాల తర్వాతే. బలవంతంగా సమ్మె విరమణ చేయించి, ప్రగతిభవన్‌కు పిలిచి భోజనం పెట్టి, వరాల వర్షం కురిపించినా.. సమ్మెకాలపు పరిస్థితులు, తమ సహ కార్మికుల మరణాలు కార్మికులను వెంటాడుతూనే వచ్చాయి. తాజా ఎన్నికల్లో గుణపాఠం చెప్పే పరిస్థితిని సృష్టించాయి. ధరణి వెబ్‌­సైట్‌ విష­యంలో కూడా కేసీ­ఆర్‌ ఏక­పక్ష ధోర­ణితో వ్యవ­హ­రిం­చా­రన్న అభి­ప్రా­యాలు వ్యక్త­మ­య్యాయి. ధ‌ర‌ణి వ‌ల్ల ఇబ్బం­దు­ల‌ను మంత్రులు చెప్పినా విన‌­కుండా మీకు తెలి­య‌­దులే అన్న‌­తీ­రుగా నాడు మాట్లా­డా­ర‌న్న చ‌ర్చ జ‌రి­గింది.


మంత్రుల మాట‌కు కూడా క‌నీస విలువ ఇవ్వ‌­లే­ద‌ని, దీంతో ధ‌ర‌ణి అనేది గ్రామాల్లో ప్ర‌ధాన స‌మ‌­స్య‌గా మారిం­దం­టు­న్నారు. అందుకే ధ‌ర‌­ణిని బంగా­ళా­ఖా­తంలో క‌లు­పు­తా­మ‌న్న కాంగ్రె­స్‌కు రైతులు ప‌ట్టం క‌ట్టా­ర‌ని రాజ‌­కీయ ప‌రి­శీ­ల‌­కులు అంటు­న్నారు. ఉద్యో­గులు, ఉపా­ధ్యా­యులు ప‌ట్ల నిర్ద‌­య‌గా వ్య‌వ‌­రిం­చా­ర‌న్న అభి­ప్రాయం బ‌లంగా ఉంది. ప్రభుత్వ నిర్ణ­యా­లపై పాలా­భి­షే­కాలు చేసేం­దుకు ఉద్యోగ సంఘా­ల‌ను వాడు­కు­న్నా­రని ఉద్యోగ సంఘాల నాయ­కులు చెబు­తు­న్నారు. ఇలా పార్లమెంటు ఎన్నికలు మొదలుకుని ప్రతి దశలో బీఆరెస్‌కు డేంజర్‌ బెల్స్‌ మోగుతూనే వచ్చాయి. కానీ.. అవి వినేందుకు కేసీఆర్‌ ఇష్టపడలేదో.. లేదా చుట్టూ ఉండే జోరీగల శబ్దాల్లో వినిపించలేదో.. మొత్తానికి వాటికి చెల్లించుకున్న మూల్యమే అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయమని విశ్లేషకులు చెబుతున్నారు.

అంతా నా ఇష్టం!

మంత్రు­లైనా, ఎమ్మె­ల్యే­లైనా, అధి­కా­రు­లైనా కేసీ­ఆర్‌ చెప్పిందే తప్ప.. సల­హాలు ఇవ్వ­కూ­డ­దన్న పరి­స్థితి ఆనాడు ఉండే­దని సీని­యర్‌ అధి­కా­రులు చెబు­తు­న్నారు. ప్రగ­తి­భ­వ­న్‌­లోకి మంత్రు­లకు కూడా అను­మతి లేకుండా చేసిన అంశాలు జనం­లోకి కూడా బలంగా వెళ్లాయి. తమ ఎమ్మె­ల్యేకి, తమ జిల్లా మంత్రి అను­మతి దొర­కక పోవ­డాన్ని ప్రజలు మన­సుకు తీసు­కు­న్నా­రన్న అభి­ప్రా­యాలు వ్యక్త­మ­య్యాయి. నిర్ణ­యాల్లో కూడా మంత్రు­లకు, అధి­కా­రు­లకు భాగ­స్వామ్యం ఉండేది కాదని చెబు­తు­న్నారు. తన అభి­ప్రా­యమే ఫైనల్‌ అన్నట్టు వ్యవ­హ­రిం­చిన కేసీ­ఆర్‌.. రెండో అభి­ప్రాయం వినేం­దుకు సిద్ధ­ప­డితే ఈ పరి­స్థితి ఎదు­ర­య్యేది కాదని రాజ­కీయ పరి­శీ­ల­కులు అంటు­న్నారు.

డబ్బుల స్కీమ్‌పై కేంద్రీ­క­రణ

డ‌బ్బులు వెద­జ‌­ల్లితే ప్ర‌జ‌లు ఓట్లు వేస్తా­ర‌­న్న­తీ­రుగా బీఆ­రెస్ నేత‌లు వ్య‌వ‌­హ‌­రిం­చా­ర‌ని రాజ‌­కీయ ప‌రి­శీ­ల‌­కులు అంటు­న్నారు. అందుకే ఒక్కో ఎన్ని­క‌కు నేరుగా డ‌బ్బులు పంపిణీ చేసే స్కీమ్‌లు తీసు­కొ­చ్చా­రని గుర్తు చేస్తు­న్నారు. ఈట‌ల రాజేం­ద‌­ర్‌ను హుజూ­రా­బా­ద్‌లో ఓడిం­చ‌డం కోసమే దళిత బంధు పథకం పుట్టు­కొ­చ్చిం­దని చెబు­తు­న్నారు. తాజాగా అసెంబ్లీ ఎన్ని­క‌ల నేప­థ్యంలో బీసీ బంధు సహా వివిధ రకాల ‘బంధు’ల సంప్ర­దా­యా­నికి తెర తీశా­రని, పోలిం­గ్‌కు ముందుగా రైతు­బంధు నగ­దును బ్యాంకుల్లో జ‌మ చేయ‌­డా­నికి ప్ర‌య‌­త్నిం­చా­ర‌ని, రైతు రుణ­మా­ఫీని కూడా ఎన్ని­క­లకు ముందు తెర­పైకి తెచ్చా­రని పరి­శీ­ల­కులు చెబు­తు­న్నారు. వీట­న్నింటి ద్వారా ఎన్ని­క­లకు ముందు ఓటర్ల చేతికి అధి­కా­రి­కంగా సొమ్ములు చేరితే ఓట్లన్నీ తన­వే­నన్న అత్యాశ కొంప ముంచిం­దని స్పష్టం చేస్తు­న్నారు. వీట­న్నిం­టికీ కేసీ­ఆర్‌ వ్యవ­హార శైలి తప్ప మరోటి కారణం కాదని అంటు­న్నారు.

ఏదీ ఆత్మ­గౌ­రవం?

తెలం­గా­ణలో ఆత్మ­గౌ­ర­వా­నికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. చిన్న­చిన్న విష­యాల్లో సైతం అది తరచూ బయ­ట­ప­డు­తూనే ఉంటుంది. అలాం­టిది ఈ పదే­ళ్లలో ప్రజ­లకు ఆత్మ­గౌ­రవం అనేది లేకుండా పోయిం­దని, డబ్బు­లిస్తే ఓట్లే­సే­వా­రి­గానే బీఆ­రెస్‌ నేతలు చూశా­రని విమ­ర్శలు ఉన్నాయి. అందుకే ప‌థ‌­కాలు ఎన్ని ఇచ్చినా, డ‌బ్బులు పంచినా తెలం­గాణ ప్ర‌జ‌లు ఆత్మ‌­గౌ­ర‌వం, స్వేచ్ఛ కావా­ల‌ని నిన­దించి.. ప్రభు­త్వాన్ని మార్చా­ర‌ని మ‌లి ద‌శ తెలం­గాణ ఉద్య‌­మంలో మొద‌ట‌ కేసీ­ఆర్ వెన్నంటి ఉండి, ఆ త‌రు­వాత దూరంగా ఉన్న గాదె ఇన్న‌య్య అన్నారు. కాంగ్రె­స్‌పై ప్రేమ కంటే కేసీ­ఆ­ర్‌పై కోపం­తోనే ఓడిం­చా­రని స్పష్టం చేశారు.


పైగా కేసీ­ఆర్ తెలం­గాణ ఆత్మ‌ను వ‌ది­లే­శా­ర­న్నారు. ఆయ‌న టీఆ­రె­స్‌ను బీఆ­రె­స్‌గా మార్చి­న‌­ప్పుడే తెలం­గాణ ప్ర‌జ‌లు ఆయ‌­న‌కు వ్యతి­రే­కంగా మారి­పో­యా­రని, అందుకే ఉత్త‌ర‌, ద‌క్షిణ తెలం­గాణ ప్ర‌జ‌లు భారీ మెజా­ర్టీతో ఓడిం­చా­రం­టు­న్నారు. హైద‌­రా­బా­ద్‌లో వ‌చ్చిన మెజా­ర్టీని, మెజార్టీ సీట్లను చూపుతూ రాష్ట్ర­వ్యా­ప్తంగా బీఆ­రె­స్‌కు ఆద­రణ తగ్గ­లే­దని చెప్పు­కో­వడం వాస్త­వా­లను గుర్తిం­చ­డా­నికి నిరా­క­రిం­చ­డ­మే­నని రాజ­కీయ విశ్లే­ష­కులు తేల్చి చెబు­తు­న్నారు. ఇక­నైనా అధి­నేత తన ధోర­ణిని మార్చు­కుంటే ప్రజల మనసు గెలు­చు­కో­వడం కష్ట­మేమీ కాదని స్పష్టం చేస్తు­న్నారు.


శాతాల్లో తేడాను తగ్గిం­చిన హైద­రా­బాద్‌ ఓట్లు

2023 తెలం­గాణ అసెంబ్లీ ఎన్ని­క‌ల ఫ‌లి­తా­ల‌ను ప‌రి­శీ­లిస్తే 64 స్థానాలు గెలి­చిన కాంగ్రెస్ పార్టీకి 92,35,792 ఓట్లు వ‌చ్చాయి. ఇది 39.40 శాతంగా న‌మో­దైంది. ప్ర‌తి­ప‌క్ష బీఆ­రె­స్‌కు 87,53,924 ఓట్ల పోల‌­య్యాయి. అంటే 37.35 శాతం. రాష్ట్ర­వ్యా­ప్తంగా వ‌చ్చిన ఓట్ల‌ను ప‌రి­శీ­లిస్తే కాంగ్రె­స్‌కు 4,81,868 ఓట్లు మాత్ర‌మే అధి­కంగా వ‌చ్చి­న‌ట్లు క‌ని­పి­స్తోంది. 2.05 శాతం ఓట్ల తేడా­తోనే కాంగ్రెస్ గెలి­చిం­ద‌ని, ఇది పెద్ద గెలుపు కాద‌ని బీఆ­రెస్ నేత‌లు సిద్ధాం­తాలు సృష్టిం­చారు కూడా. పైగా బీఆ­రెస్ 39 సీట్ల‌లో గెలి­చిం­ద‌ని, మ‌రో 30 స్థానాల్లో సిట్టిం­గ్‌­ల‌ను మారిస్తే మూడో­సారి అధి­కా­రం­లోకి వ‌చ్చే వాళ్ల‌­మని చెప్పు­కొం­టు­న్నారు. నిజా­నికి అసలు విష­యా­లను పక్క­న­పెట్టి ఎమ్మెల్యే అభ్య­ర్థు­లపై నింద­మో­ప­డా­నికే బీఆ­రెస్‌ నాయ­కత్వం ఇప్ప­టికీ ప్రయ­త్ని­స్తుం­డటం విచి­త్రంగా ఉన్న­దని ఒక సీని­యర్‌ రాజ­కీయ విశ్లే­ష­కుడు చెప్పారు.


నిజా­నికి రాష్ట్ర వ్యాప్తంగా బీఆ­రె­స్‌పై తీవ్ర వ్యతి­రే­కత ఉన్న­దనే విషయం పోలింగ్‌ శాతా­లను నిశి­తంగా గమ­నిస్తే అర్థ­మ­వు­తుంది. హైద‌­రా­బాద్ రీజి­య‌­న్‌­లోని 25 సీట్లు మిన‌­హా­యిస్తే ఉత్త‌ర, ద‌క్షిణ తెలం­గా­ణ‌­ల‌లో కాంగ్రెస్‌, బీఆ­రె­స్‌కు మ‌ధ్య పోలైన ఓట్ల‌తో భారీ తేడా ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌­మ‌­వు­తోంది. ఉత్త‌ర, ద‌క్షిణ తెలం­గాణ‌ కలిపి కాంగ్రె­స్‌కు 83,10,792 ఓట్లు వ‌చ్చాయి. బీఆ­రె­స్‌కు 71,76,924 ఓట్లు లభిం­చాయి. అంటే ఈ రెండు రీజి­య­న్లలో బీఆ­రె­స్‌­కంటే కాంగ్రె­స్‌కు 11,33,868 ఓట్లు అధి­కంగా పోల­య్యాయి.

రీజి­య‌న్ల వారిగా ఓట్ల శాతం ఇలా..

బీఆ­రెస్ 25 సీట్లున్న‌ ఒక్క హైద‌­రా­బా­ద్‌లో రీజి­య‌­న్‌­లోనే అత్య‌­ధిక స్థానాలు గెలి­చింది. కాంగ్రెస్ ఒక్క స్థానా­నికే ప‌రి­మి­త‌­మైంది. ఇక్క‌డ బీజేపీ ఒక్క స్థానం ఎంఐఎం 7 స్థానాల్లో గెలు­పొం­దాయి. హైద‌­రా­బాద్ రీజి­య‌­న్‌లో కాంగ్రె­స్‌కు వ‌చ్చిన ఓట్లు 25.53 శాతం మాత్ర‌మే. బీఆ­రె­స్‌కు వ‌చ్చిన ఓట్లు 38.97 శాతం. బీఆ­రెస్ కంటే కాంగ్రె­స్‌కు 13.24 శాతం ఓట్లు త‌క్కువ‌ వ‌చ్చాయి. అయితే 51 సీట్లున్న‌ ఉత్త‌ర తెలం­గాణ రీజి­య‌­న్‌లో కాంగ్రె­స్‌కు 33 సీట్లతో 41.26 శాతం ఓట్లు వ‌చ్చాయి. బీఆ­రె­స్‌కు 10 సీట్ల‌తో 34.64 శాతం ఓట్లు వ‌చ్చాయి. బీజే­పీకి 7 సీట్ల‌తో 15.66 శాతం ఓట్లు వ‌చ్చాయి. ఈ రీజి­య‌­న్‌లో బీఆ­రెస్ కంటే కాంగ్రె­స్‌కు 6.62 శాతం ఓట్లు వ‌చ్చాయి.


43 సీట్లున్న ద‌క్షిణ‌ తెలం­గా­ణ‌లో 30 సీట్లు గెలి­చిన కాంగ్రె­స్‌కు 45.86 శాతం ఓట్లు రాగా 13 సీట్లు సంపా­దిం­చు­కున్న బీఆ­రె­స్‌కు 39.29 శాతం ఓట్లు లభిం­చాయి. తెలం­గా­ణ‌లో తామే అధి­కా­రం­లోకి వ‌స్తా­మ‌ని ప్ర‌క‌­టిం­చు­కున్న బీజే­పీకి ఈ రీజి­య‌­న్‌లో ఒక్క సీటు కూడా రాలేదు కానీ 7.69 శాతం ఓట్లు పోల‌­య్యాయి. ఇక్క‌డ బీఆ­రెస్ కంటే కాంగ్రె­స్‌కు 6.57 శాతం ఓట్లు అధి­కంగా వ‌చ్చాయి. కేసీ­ఆ­ర్‌పై వ్యతి­రే­కత లేన­ట్ట­యితే ఇంత తేడా ఎందుకు వచ్చిం­దని పలు­వురు రాజ­కీయ విళ్లే­ష­కులు అంటు­న్నారు. వాస్త‌­వంగా హైద‌­రా­బా­ద్‌లో కూడా వ్య‌తి­రే­క‌త ఉన్న‌­ప్ప‌­టికీ పలు కార­ణాలు దానిని కవర్‌ చేశా­యని చెబు­తు­న్నారు. ఆంధ్రా సెటి­ల‌ర్ల ఓట్ల‌తో బీఆ­రెస్ గెలి­చిం­ద‌న్న అభి­ప్రాయం బ‌లంగా వ్య‌క్త‌­మ‌­వు­తోంది. ఆంధ్రా సెటి­ల‌ర్ల తీరు చంద్ర‌­బాబు అరె­స్టుకు ముందు ఒక లెక్క‌, విడు­ద‌ల త‌రు­వాత మ‌రో లెక్క అన్న తీరుగా ఉంద‌ని అంటు­న్నారు.


కేసీ­ఆ­ర్‌తో రాజ‌­కీయ అవ‌­స‌­రాలు వ‌చ్చే అవ‌­కాశం ఉన్నం­దున బీఆ­రె­స్‌కు ఈసారి ఓట్లు వేయా­ల‌ని ఆంధ్రా సెటి­ల‌ర్లు తీసు­కున్న నిర్ణ‌యం వ‌ల్ల‌నే హైద‌­రా­బాద్ రీజి­య‌­న్‌లో మెజార్టీ వ‌చ్చిం­ద‌న్న చ‌ర్చ జ‌రు­గు­తోంది. దీని­కి­తోడు తెలం­గా­ణ­లోని వేర్వేరు జిల్లాల నుంచి ఉపాధి కోసం అనేక మంది హైద­రా­బా­ద్‌కు వచ్చి ఉంటు­న్నారు. వీరికి ఊళ్ల­లోనూ ఓటు హక్కు ఉంటుం­దని, కేసీ­ఆ­ర్‌ను ఎలా­గైనా ఓడిం­చా­లన్న పట్టు­ద­లతో ఊళ్లకు వెళ్లి అక్కడ తమ వ్యతి­రే­క­తను చాటా­రన్న అభి­ప్రా­యాలు కూడా వ్యక్త­మ­వు­తు­న్నాయి.