బీఆర్ఎస్, బీజేపీ పట్ల ప్రజల్లో విశ్వాసం లేదు: చాడ వెంకట్ రెడ్డి

ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, బీజేపీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ పట్ల ప్రజల్లో విశ్వాసం లేదు: చాడ వెంకట్ రెడ్డి
  • ఆ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది
  • కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తాం
  • సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, బీజేపీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం వరంగల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో బీజేపీ విఫలమైందని అన్నారు. కేంద్రంపై బీఆర్ఎస్ వైఖరి మారడం, లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేయకపోవడం తదితర కారణాలతో బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ప్రజలు భావిస్తున్నారని, అందుకే బీజేపీ నుండి నాయకులందరూ కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు.


కేసీఆర్ హామీలు ప్రజలు నమ్మడం లేదు


సీఎం కేసీఆర్ హామీలను ప్రజలు నమ్మడం లేదని, మాటల మనిషే అని తేలిపోయిందని చాడ అన్నారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నియామకాల కోసం జరిగిందని, కానీ యువకులకు ఉద్యోగాలు రాలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, నియామకాలన్నీ లీకేజీల మయంగా మారిపోయాయని అన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే మునిగి పోయిందని, కానీ కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు నేటికీ చెక్కుచెదర లేదని అన్నారు.


దీంతో బీఆర్ఎస్ ప్రజలలో విశ్వాసం కోల్పోయిందని, ఆపార్టీ ప్రజాప్రతినిధులు కూడా ప్రజల సంక్షేమాన్ని మరిచి స్వలాభం కోసమే పని చేశారని విమర్శించారు. ధరణిలో అన్నీ లొసుగులేనని, లక్షలాది మంది సన్న, చిన్నకారు రైతుల బతుకులు రోడ్డున పడ్డాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకే ధరణి వరప్రసాదంగా మారిందని అన్నారు.


ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపెల్లి శ్రీనివాస్ రావు, జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, మారుపాక అనిల్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ కే బాష్ మియా, జిల్లా కార్యవర్గ సభ్యులు బుస్సా రవీందర్, గన్నారపు రమేష్, దండు లక్ష్మణ్, వీరగోని శంకరయ్య, తోట చంద్రకళ, గుండె బద్రి, జన్ను రవి పాల్గొన్నారు.