కేటీఆర్ సమక్షంలో బీఆరెస్‌లోకి చకిలం, జిల్లెపల్లి

విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో : నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం బీఆరెస్ మాజీ నేత చకిలం అనిల్‌కుమార్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ జిల్లెపల్లి వెంకటేశ్వర్లులు మళ్లీ కారెక్కారు. వారిద్ధరూ మంగళవారం బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో తిరిగి బీఆరెస్‌లో చేరారు.
బీఆరెస్‌లో తనకు సరైన గుర్తింపు లేదంటూ, నల్లగొండ సిటింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆ పార్టీ నుంచి కొన్ని నెలల క్రితం బయటకు వెళ్లిపోయిన చకిలం అనిల్‌కుమార్ తిరిగి బీఆరెస్‌లో చేరారు.

ఇక జిల్లెపల్లి కాంగ్రెస్ నుంచి బీఆరెస్‌లో చేరి ఉప ఎన్నికలో సిటింగ్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గెలుపు కోసం పనిచేశారు. తర్వాతా వైఎస్సార్‌సీపీ, టీపీలలో చేరిన జిల్లెపల్లి కూడా మళ్లీ ఎన్నికల వేళ కారెక్కారు. ఈ చేరికలలో జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు కంచర్ల, సైదిరెడ్డిలు కీలక పాత్ర వహించారు.
బీఆరెస్‌లోకి కాంగ్రెస్ నేత ఉదయ్ చందర్
ఆలేరు నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట నాయకులు చామల ఉదయ చందర్‌రెడ్డి, చాడ గ్రామానికి చెందిన మోకుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ల నరేశ్‌గౌడ్ సహా పలువురు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ నేతలు బీఆరెస్ లో చేరారు. వారికి మంత్రి కేటీఆర్ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

అలాగే రాష్ట్ర డాక్టర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కల్కురి అన్వేశ్, భానుచందర్ ప్రభృతులు కూడా కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితా మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.