పంటలు ఎండుతున్నయ్.. చెన్నూరులో కరెంటు కష్టాలు

- పొలాల వద్దే రైతుల ఎదురుచూపు
- 24 గంటల కరెంట్ ఊసేది?
- నీరున్నా పైరుకు అందించలేని దైన్యం
- ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న రైతులు
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా చెన్నూరు రైతులను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. 24 గంటలూ కరెంటు ఇస్తున్నమని గొప్పలుపోతున్న ప్రభుత్వానికి… ఇక్కడ ఎండుతున్న పంటలు వెక్కిరిస్తున్నాయి. బావుల్లో నీరు పుష్కలంగా ఉన్నా, కరెంటు రాక, పైరుకు నీరందించలేని దుస్థితి ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో కళ్లెదుటే ఎండుతున్న పంటను చూసి రైతు గొల్లుమంటున్నాడు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. చెన్నూరులో కరెంటు కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.
కరెంటు లేక వేసిన పంటలు ఎండి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం 24 గంటల కరెంటు అని చెప్తున్నప్పటికీ ఆచరణలో 12 గంటల కరెంటు కూడా రావడం లేదని వాపోతున్నారు. ఇలాగైతే మా పంటలు ఎండిపోవడం ఖాయమని పేర్కొంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగా వర్షాకాలం వేసిన పంటలు బ్యాక్ వాటర్ లో ముంపునకు గురయ్యాయి.

పంటంతా నష్టపోయినా రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదని విమర్శిస్తున్నారు. బావుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ కరెంటు లేకపోవడంతో కళ్ళముందే పంటలు ఎండిపోతున్నాయని, ఇప్పటికైనా అధికారులు కనికరించాలని రైతులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు.
చెన్నూరు నియోజవర్గంలో పవర్ ప్లాంట్ ఉన్నప్పటికీ విద్యుత్ నిరంతరాయంగా ఇవ్వడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఉదయం పొలాలకు వెళ్ళి.. సాయంత్రం వరకు కరెంటు కోసం ఎదురుచూసినప్పటికీ కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి దాపురించిందని ఆవేదన చెందుతున్నారు. 24 గంటల కరెంటు ఎటు పోయిందని ప్రభుత్వాన్ని రైతులు నిలదీస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సకాలంలో రైతులకు 24 గంటల నాణ్యమైన సరఫరా చేయాలని చెన్నూరు రైతులు కోరుతున్నారు.