100 సీట్లతో బీఆర్ఎస్ గెలువబోతుంది: చీఫ్ విప్ దాస్యం

- 27 న భట్టుపల్లిలో కేసీఆర్ సభ
- చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని, 100 సీట్లకు పైగా గెలుస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గం భట్టుపల్లిలో ఈనెల 27న నిర్వహించే ప్రజా దీవెన సభ ఏర్పాట్లపై గురువారం ఎమ్మెల్యే అరూరి రమేష్ తో కలసి విప్ మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదన్నారు. ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని అన్నారు. పథకాల గురించి విమర్శించే అర్హత ప్రతిపక్ష పార్టీలకు లేదన్నారు. గ్యారంటీ, వారంటీ లేని పథకాలతో కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాల్లో అమలులో ఫెయిల్ అయిందన్నారు.
అమలుకు సాధ్యం కాని పథకాలతో దగా చేస్తున్నదన్నారు. 80 వేల మందితో ప్రజా దీవెన సభను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నందున కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహభరితంగా పనిచేస్తున్నారన్నారు. అనంతరం సభ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, మేయర్ గుండు సుధా రాణి, రైతుబంధు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షురాలు లలిత యాదవ్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, నాయకులు వనం రెడ్డి, పోలపల్లి రామ్మూర్తి, ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు.