Hyderabad | మేడిపల్లిలో పిల్లల విక్రయ ముఠా అరెస్టు
హైదరాబాద్‌లో చిన్నారులను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు మంగళవారం మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు

16మంది చిన్నారులను గుర్తించిన పోలీసులు
శిశు విహార్‌కు తరలింపు
అమ్మిన..కొనుగోలు చేసిన వారిపై కేసులు
రాచకొండ సీపీ తరుణ్ జోషీ
విధాత, హైదరాబాద్: ఇతర రాష్ట్రాల నుంచి చిన్నారులను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం పీర్జాదిగూడలో రూ.4.50లక్షలకు ఆర్ఎంపీ డాక్టర్ శోభారాణి శిశువును విక్రయించారు. ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయడంతో ముఠాగుట్టు రట్టయింది. మొత్తం 16 మంది చిన్నారులను ఈ ముఠా విక్రయించినట్టు నిర్ధారించారు.
కేసు వివరాలను రాచకొండ సీపీ తరుణ్ జోషి మంగళవారం మీడియాకు వెల్లడించారు. చిన్న పిల్లల విక్రయ రాకెట్ ముఠాతో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశామని తెలిపారు. ఇటీవల మేడిపల్లిలో ఆర్‌ఎంపీ శోభారాణి, సలీం, స్వప్నలను అరెస్టు చేశామని, వారిని అరెస్టు చేసిన సమయంలో ఇద్దరు చిన్నారులను రక్షించామని వెల్లడించారు. సంతానం లేని వారికి ఈ ముఠా పిల్లలను విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు. ఫిర్జాదికూడ రామకృష్ణ నగర్ లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా 3 నెలల పసికందు నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయాలు సాగుతున్నాయన్నారు.
ఢిల్లీ, పుణె నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్టు దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఢిల్లీ, పుణెలో ఉన్నవారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం వెళ్లిందని, తల్లిదండ్రుల నుంచి రూ.50వేలకు కొనుగోలు చేసి.. రూ.1.80 లక్షల నుంచి రూ.5.50 లక్షల వరకు చిన్నారులను విక్రయిస్తున్నారని రాచకొండ సీపీ తెలిపారు. ముఠా నుంచి అక్రమంగా పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తున్నామని పేర్కోన్నారు. కాగా ఆ ముఠా విక్రయించిన 16మంది చిన్నారుల అడ్రస్ తెలుసుకుని వారిని కొనుగోలు చేసి పెంచుకుంటున్న తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు రప్పించారు. వారి నుంచి పిల్లలను స్వాధీనం చేసుకుని వారిని శిశువిహారకు తరలించారు.
ఈ సందర్భంగా ఇంతకాలం తాము ప్రాణప్రదంగా పెంచుకున్న పిల్లను పోలీసులకు ఇచ్చేందుకు మనస్సురాని తల్లిదండ్రులు పిల్లలను పట్టుకుని కన్నీరుమున్నీరయ్యారు. వారి రోధనలతో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉద్వేగ భరిత వాతావరణం అలుముకుంది. అధికారికంగా దత్తత నిస్తున్నామని, ఎలాంటి సమస్యలు రావని ముఠా సభ్యులు చెప్పి నమ్మించడంతోనే పిల్లలు లేని తాము పిల్లలను కొనుగోలు చేసి పెంచుకుంటున్నామని వారు వాపోయారు.