తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం: చింతా మోహన్

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపని, ఓటర్లలలో మార్పు స్పష్టంగా వెల్లడవుతుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్‌ అన్నారు

తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం: చింతా మోహన్

న్యూఢిల్లీ : తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపని, ఓటర్లలలో మార్పు స్పష్టంగా వెల్లడవుతుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్‌ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ ప్రజలు కాంగ్రెస్‌కు గట్టి మద్దతుగా ఉన్నారన్నారు. తెలంగాణలో మాదిగలను మోసం చేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు.


బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే కులాలకు అతీతంగా పేదరికాన్ని కొలమానంగా తీసుకొని రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, దీనిపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చి పెద్ద తప్పు చేశారన్నారు.


తెలంగాణలో బీజేపీ-జనసేనలు కలిసి పోటీ చేసినా వచ్చేది ఐదు సీట్లు మాత్రమేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుతున్నారని చింతా మోహన్ ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీని పాతబస్తీ ముస్లింలు అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు.


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రుద్రరాజు చాలా మంచివాడని, నేను ఆయనను పూర్తిగా సమర్థిస్తున్నానన్నారు. కానీ మా పార్టీ నేతలే ప్రజలను ఓట్లు అడగడం లేదన్నారు. జగన్ పాలన బాగుంటుందని అనుకున్నానని, కానీ ఆయన బలహీనమయ్యారని చింత మోహన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.