పటాన్ చెరు.. సంగారెడ్డిలలో ఉద్రిక్తత

- పోటాపోటీగా నామినేషన్లు
విధాత: పటాన్ చెరు నియోజకవర్గంలో నామినేషన్ల చివరి రోజు బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్‌గౌడ్ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరువర్గాలు ఆర్వో కార్యాలయం వద్ధ నామినేషన్ల దాఖలుకు నీలం, కాటాలు తమ అనుచరులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా ఆర్వో కార్యాలయంకు చేరుకున్నారు. రెండు వర్గాలు ఎదురెదురుపడగా వారి పోటాపోటీ నినాదాలకు దిగారు. రెండు వర్గాల మధ్య వాగ్వావాదం, ఘర్షణ నెలకొనడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
ముందుగా పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్‌ను మధు ముదిరాజ్‌కు ఇచ్చారు. తదుపరి ఆయన స్థానంలో శ్రీనివాస్‌గౌడ్‌కు టికెట్ ఇవ్వడంతో మధు బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. నామినేషన్ దాఖలు సమయంలో రెండు వర్గాలు ఎదురుపడంతో పరస్పర విమర్శలు, నినాదాలతో ఘర్షణకు దిగారు. అటు సంగారెడ్డిలో సైతం బీజేపీ ముందుగా పులిమామిడి రాజు పేరును ఖరారు చేసి తుది జాబితాలో రాజేశ్వర్‌రావు దేశ్ పాండేకు టికెట్ ఇచ్చి చివరి నిమిషంలో మళ్లీ మార్పు చేసి, ఆయన స్థానంలో పులిమామిడి రాజుకు బీ ఫామ్ ఇచ్చింది.
దీంతో ఇరువురు నామినేషన్లు వేశారు. రెండు వర్గాల వారు ఆర్వో కార్యాలయం వద్ద ఎదురెదురుపడి వాగ్వివాదానికి దిగారు. తనకు టికెట్ ఇచ్చి రద్దు చేసి అన్యాయం చేశారంటూ రాజేశ్వర్‌రావు ఆత్మహత్య యత్నం చేసుకుంటానంటూ హల్ చల్ చేశారు. ఫోన్‌లో పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో వాగ్వివాదానికి దిగారు. అటు నారాయణ ఖేడ్ కాంగ్రెస్ టికెట్ ను సురేష్ షెట్కార్ వదులుకోవడంతో ఈ టికెట్ ఆశించిన సంజీవ్‌రెడ్డికి పార్టీ టికెట్ దక్కడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నకిరేకల్, తుంగుతుర్తి(ఎస్సీ) నియోజకవర్గాల కాంగ్రెస్ టికెట్ ఆశించిన కొండేటి మల్లయ్య కూడా తనకు టికెట్ రాకుండా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డినే అడ్డుపడ్డారని ఆరోపిస్తూ నల్లగొండలో తన నామినేషన్ దాఖలు చేశారు.
సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆర్. దామోదర్‌రెడ్డికి టికెట్ ఇవ్వగా ఆయనతో పాటు ఇదే టికెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేశ్‌రెడ్డి సైతం నామినేషన్ దాఖలు చేసి రెబల్‌గా పోటీలో ఉంటున్నట్లుగా ప్రకటించారు. కోదాడలో జనసేన పార్టీకి టికెట్‌ను సతీశ్‌రెడ్డికి ఇవ్వడాన్ని నిరసిస్తూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను జనసేన, బీజేపీ కార్యకర్తలు అడ్డుకుని నిరసన తెలిపారు. కాగా 13న నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ, 15న ఉపసంహరణ కార్యక్రమం ఉండనుంది.