హెచ్‌ఆర్‌డీలో సీఎం క్యాంపు కార్యాలయం !.. ఫ్యాకల్టీ సభ్యులతో సీఎం భేటీ

విధాత, హైద్రాబాద్ : మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణాభివృద్ధి సంస్థ(ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభిృద్ధి , మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి రేవంత్‌రెడ్డి సంస్థ ప్యాకల్టీ విభాగాల ఉద్యోగులతో భేటీ అయ్యారు. సంస్థ కార్యకలాపాలు, ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. అనంతరం సంస్థలోని వివిధ బ్లాకులను సోలార్ పవర్ వాహనంలో పర్యటించి పరిశీలించారు. సంస్థ కార్యకలాపాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డైరక్టర్ జనరల్ శశాంక్ గోయల్ వివరించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుటకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్దం చేసేందుకు హెచ్‌ఆర్‌డి కార్యక్రమాలుండాలని రేవంత్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీజీ బెన్‌హర్ మహేశ్ దత్, సీసీజీ డీజీ రాజేంద్ర నిమ్జే, హైద్రాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిలు ఉన్నారు.
క్యాంపు కార్యాలయం కోసమే పరిశీలన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్యాంపు ఆఫీస్ కోసం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ బ్లాక్‌లను పరిశీలించినట్లుగా సమాచారం. ఇప్పటిదాకా సీఎంల క్యాంపు కార్యాలయంగా ఉన్న ప్రగతి భవన్‌ను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చడంతో సీఎం క్యాంపు కార్యాలయం కోసం మరో భవనాన్ని వెతుక్కోవాల్సివచ్చింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి పరిసరాల్లో ఉండడంతో క్యాంపు కార్యాలయంగా అక్కడికి దగ్గర్లోనే (రోడ్ నెం. 25, జూబ్లీహిల్స్) ఉన్న హెచ్‌ఆర్‌డీలో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్న సూఛనల మేరకు రేవంత్ రెడ్డి హెచ్‌ఆర్‌డీని సందర్శించినట్లుగా తెలుస్తుంది