మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చిపట్టింది.. : సీఎం కేసీఆర్

దళితబంధు పుట్టించిన మొగోడు ఎవరండి ఈ దేశంలో.. కేసీఆర్ అనేటోడు రాకముందు దళిత బంధు ఈ దేశంలో ఉండేనా..? దళితబంధు పెట్టమని ఎవరన్నా అడిగారా..? ఎవడన్న ఈ మొగోళ్లు ధర్నా చేసిండ్రా. దరఖాస్తు పెట్టిండ్రా.. మరి ఎవడు పెట్టిండు. ఎందుకు పెట్టాము. దయచేసి ఆలోచన చేయాలి.
ఊరికే అల్లాటప్పాగా ఓట్ల ముందు పెట్టలేదు. దళితబంధు పెట్టినప్పుడు ఎన్నికలు లేవు. నన్ను ఎవరూ అడగలేదు. అదో పెద్ద విషాదగాధ. మన దేశానికే మాయని మచ్చ. యావత్ భారత సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి. 75 ఏండ్ల కింద స్వాతంత్ర్యం వస్తే నాడు దళితుల పరిస్థితి బాగా లేదు. యుగయుగాలు, తరతరాల నుంచి అణిచివేతకు, విక్షకకు గురయ్యారు. ఊరి నుంచి వెలివాడల్లో ఉన్నారు. అంటరాని వారు అని నిందలకు గురయ్యారు. మహాకవి జాషువా బాధపడి గాయపడి కావ్యాలు రాశారు. దళిత జాతి ఎందుకు అలా ఉండాలి. వాళ్లు మనషులు కారా.? మనలాగా పుట్టలేదా..? సాటి మానవులు కారా.?.
ఇవాళ పెడబొబ్బలు పెట్టే మూడు రంగుల జెండాలు, ఎర్రెర్ర జెండాలు, పచ్చ పచ్చ జెండాలు.. ఏం చేశారండీ. ఒక్క సారి గుండె మీద చేయి వేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలి. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్పా వారి గురించి ఆలోచించలేదు. దళితులకు అరచేతికి బెల్లం పెడుతా.. చక్కెర, చాకెట్లు ఇస్తానని చెప్పి అప్పటికప్పుడు ఎన్నికల ముందు మురిపించారు. మోసం చేశారు. దశాబద్దాల తరబడి ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. వాళ్ల నిజమైన శ్రేయస్సు గురించి ఆలోచించలేదు. వాళ్లను మనషులుగా గుర్తించలేదు.
ఇవాళ ఉత్తర భారతదేశంలో దళితుల మీద రోజు దాడులే. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో చాలా భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. మహిళల మీద మానభంగాలు జరుగుతున్నాయి. ఏంది ఈ వివక్ష, ఏంది ఈ దురాగతం. ఇది ప్రజాస్వామ్య దేశమా..? అరాచకమా..? దీన్నంతనటిని క్రోడికరించి, ఆలోచించి, ఇవాళ ముఖ్యమంత్రి అయినా తర్వాత కాదు.. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిడికెడు మంది కార్యకర్తలతో దళిత చైతన్య జ్యోతి అని పెట్టుకుని కొన్ని కార్యక్రమాలు చేశాం. ఈ రోజు దళితబంధుకు కూడా అదే స్ఫూర్తి.
మొదటి టర్మ్ తర్వాత రెండో టర్మ్‌లోకి వచ్చిన తర్వాత ఆదాయం మెరుగుపడ్డాక.. దళితబంధు అమలు చేశాం. మీరందరూ చూస్తున్నారు ప్రభుత్వ వైఖరి. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టని స్కీంలే చాలా ఉన్నాయి. పది రెట్లు చాలా ఎక్కువ చేశాం. ఎప్పటికప్పుడు ఏది అవసరమో పెట్టుకుంటూ ముందుకు పోయాం. పది ఓట్లు రావాలి.. ఈ ఎన్నిక గడవాలి.. ఈ పూట గడవాలి.. అనే కిరికిరి రాజకీయాలు చేయలేదు. ఎందుకంటే మేం తెలంగాణ తెచ్చినవాళ్లం. మాకు బాధ్యత ఉంది. నూటికి నూరు శాతం బాగు చేయాలని. చిల్లర రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా బ్రహ్మాండంగా బాగు చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్లాం. దళిత ఓట్ల కోసం చిల్లర రాజకీయలు చేసే వాళ్లం అయితే.. మొదటి టర్మ్ ఎండింగ్‌లో, సెకండ్ టర్మ్ ప్రారంభంలో పెట్టేవాళ్లం. మురిపించేవాళ్లం అయితే సెకండ్ టర్మ్ ఆటోమేటిక్‌గా, స్వాభావికంగా గెలిచిన తర్వాత దళిత వర్గాల గురించి ఏదైనా మొదలుపెట్టాలని దళితబంధు మొదలుపెట్టాం.
సత్తుపల్లి చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం. ఆలోచన శక్తి ఉన్న ప్రజలు. మీతో ఒకటే మాట మనవి చేస్తున్నా.. ఎన్నికలు వస్తాయి, పోతాయి. పుయ్య మల్లయ్య గెలుస్తునే ఉంటరు. అది పెద్ద విషయం కానే కాదు. ఎవరు కాదన్నా అవున్నన్నా ఎవరో ఒకరు గెలుస్తరు. ఆలోచన చేయాలి. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులను కూడా చూడాలి. వారి చరిత్ర తెలుసుకోవాలి. వీరిని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. వీరి వెనుకాల ఉన్న పార్టీ చరిత్ర, దృక్పథం ప్రజల గురించి ఏం ఆలోచిస్తుందో తెలుసుకోవాలి. ఎవరో చెప్పారని ఓటు వేయడం కాదు. కులం వాడు నిలబడ్డాడని ఓటు వేయకూడదు. సొంత విచక్షణతో నిజనిజాల గురించి నిలబడి ఆలోచించి ఓటు వేయరో అప్పటి వరకు ప్రజాస్వామ్య పరిణితి రాదు. అలా ఆలోచించి ఓటు వేసిన దేశాల్లో బ్రహ్మాండమైన ఫలితాలు వస్తున్నాయి. ఆ చైతన్యం మన దేశంలో కూడా రావాలి.
బీఆర్ఎస్ తరపున నిలబడ్డ ఎవర్నీ అసెంబ్లీ వాకిలి తొక్కనీయమని కొందరు మాట్లాడుతున్నారు.. ఏం అహంకారం. నేను రాస్ట్రానికి సీఎంగా ఉండి.. ఇన్ని పనులు చేసి, తెలంగాణ తెచ్చిన వ్యక్తిని.. నేను కూడా అంత అహంకారంగా వాన్ని లేవనియ్య, పండనియ్యా, రానియ్యా అని మాట్లాడటం లేదు.
నాలుగు పైసలు జేబులకు రాగానే ఇంత అహంకారామా..? ఇంత మదమా..? ఖమ్మం జిల్లా దీన్ని సహిస్తదా.? డబ్బు, అహంకార రాజకీయాలు ఎన్ని రోజులు జరుగుతాయి ఈ జిల్లాలో.. జిల్లా మొత్తం ఆలోచించాలి. ఇది వ్యక్తుల మధ్య పోరాటం కానే కాదు.. పార్టీ ల మధ్య పోరాటం. ఏ పార్టీ వైఖరి ఏంటో ప్రజల ముందు చరిత్ర ఉంది. మొత్తం కాంగ్రెస్ పాలించింది. కొద్ది రోజులు టీడీపీ పాలించింది. ఈ పదేండ్లలో మనం ఏం చేశామో మీ కండ్ల ముందు ఉంది. ఆలోచించి ఓటేయండి. హృదయంతో ఏది నిజమో ఏది మంచో ఆలోచించాలి.
హుజురాబాద్‌లో నూటికి నూరు శాతం దళితబంధు అమలు చేశాం. ఆ తర్వాత ఇదే జిల్లాలోని మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో 100 శాతం కుటుంబాలకు ఇచ్చాం. భట్టి విక్రమార్క నాకు దరఖాస్తు ఇచ్చిండా..? నన్ను ఏమైనా అడిగిండా..? మా అంతల మేం సెలెక్ట్ చేసుకుని నాలుగు మండలాలు తీసుకున్నాం. మా ఎమ్మెల్యే అని సత్తుపల్లి పెట్టకపోదునా..? సండ్ర వెంకట వీరయ్యకే పేరు రావాలని స్వార్థంగా ఆలోచించలేదు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నకాడ చింతకాని మండలంలో పెట్టాం. అది మా నిజాయితీకి గీటురాయి. స్వార్థ రాజకీయ నాయకులం అయితే మా ఎమ్మెల్యేల దగ్గరనే దళితబంధు పెట్టుకునేవాళ్లం.
నాలుగు జిల్లాల్లో పెట్టాం. మొన్న సత్తుపల్లి నియోజకవర్గాన్ని పెట్టాం.. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దళితబంధు ఆపాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. మళ్లీ ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎలక్షన్ల కోసమని. ఎలక్షన్ల కోసం కేసీఆర్ పెడుతడా..? మిషన్ భగీరథ నీళ్లు ఎలక్షన్ కోసమే తెచ్చామా..? సీతారామా ప్రాజెక్టు కట్టమని నాకు ఎవడైనా చెప్పిండా..? ఈ జిల్లాలో బలుపు రాజకీయాలు చేసిన నాయకులకు వారి కలలోనైనా సీతారామ ప్రాజెక్టు కట్టాలని ఆలోచన వచ్చిందా..? వాళ్ల జన్మలా ఆలోచించారా..? గిరిజన ప్రాంతానికి నీళ్లు రాకుండా, పంటలు ఎండిపోతా ఉంటే ఎవరూ పట్టించుకోలేదు. సాగర్ పారుతుందని, పై ప్రాంతాల గురించి ఆలోచించలేదు.
ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ తరఫున నిలబడ్డ ఎవన్ని కూడా నేను అసెంబ్లీ వాకిలి తొక్కనియ్యనని జిల్లాకు చెందిన ఒకడు శపథం చేశాడని, అది అయ్యేపని కాదని సీఎం అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా తలుచుకుంటే సత్తుపల్లిలో దుమ్మురేగదా..?.
సీఎం కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ‘సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్యకు ఒక పేరుంది. నియోజకవర్గంలోని ఏ మండలం నుంచి గానీ, ఏ ఊరు నుంచి గానీ, ఎవరు గానీ సమస్య ఉందని ఫోన్ చేస్తే చాలు క్షణంలో అక్కడ పక్షిలా వాలిపోతడు. ఆపద్భందు వాహనం, అంబులెన్స్ అయినా ఆలస్యం అయితయేమోగానీ, వీరయ్యగారు ఆలస్యంగా రారని ఇక్కడి ప్రజలు చెప్తరు. ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి సండ్ర వెంకట వీరయ్య’.
‘ఈ సభకు హాజరైన మిమ్ములందరినీ చూస్తుంటే ఒక్క విషయం తేలిపోయింది. సత్తుపల్లిలో మీ అందరి ఆశీస్సులతో వీరయ్య 80 వేల మెజార్టీతో గెలుస్తారని క్లియర్‌గా అర్థమవుతున్నది. ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే హెలిక్యాప్టర్ నుంచి చూస్తే వందల వేల ట్రాక్టర్లు రోడ్ల మీద ఉన్నయ్. చాలా మంది వస్తున్నరు. ఈ గ్రౌండ్, సభ సరిపోత లేదు. అది వెంకట వీరయ్య మీద ప్రజలకు ఉన్న అభిమానం’.
‘మనం ఎవరితోనైతే విడిపోయినమో అదే బార్డర్‌ల మీరున్నరు. వాళ్ల రోడ్లు ఎట్లున్నయో, మన రోడ్లెట్టున్నయో చూడండి. అదే మన అభివృద్ధికి నిదర్శనం. సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్రా అన్నట్టు. డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ అన్నట్టు. రాష్ట్ర విభజన సందర్భంలో ఆంధ్రా నుంచి విడిపోతే మీరు ఎట్ల బతుకుతరని మన కోసం వాళ్లు బెంగటిల్లిర్రు. కానీ ఇప్పుడు వాళ్లకంటే మనమే బ్రహ్మాండంగా ఉన్నం. మన దగ్గరే వెలుగుజిలుగులు ఉన్నయ్. వాళ్లు కారు చీకట్లలో ఉన్నరు’.
‘నరేంద్రమోదీకి ఒక పిచ్చి ఉన్నది. అదేందంటే ప్రతీది ప్రైవేటైజ్ చేయడం. మాట్లాడితే ప్రైవేటైజేషన్ అంటడు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటైజ్ చేసుకుంట వస్తున్నడు. తెలంగాణలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేసినం. కానీ ప్రైవేటైజేషన్‌కు తావులేదు. పదేళ్లలో ఏదీ ప్రైవేటైజ్ చేయలే. అంతేకాదు గతంలో మోదీ మోటార్లకు మీటర్లు పెడ్తం అన్నడు. తెలంగాణలో కూడా పెట్టకపోతే ఏటా రూ.5 వేల కోట్ల నిధుల కోత పెడ్తమని హెచ్చరించిండు. కానీ నేను ఒప్పుకోలే. నేను సావనైనా సస్తగానీ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని తెగేసి చెప్పిన. ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల నష్టాన్ని భరించిన గానీ మోటార్లకు మీటర్లు పెట్టలే’.
సీతారామ ప్రాజెక్టు గుండెకాయలాంటిది. ‘సీతారామ ప్రాజెక్టు నా గుండకాయలాంటి ప్రాజెక్టు. సీతారామ పనులు 70శాతం పూర్తయ్యాయి. మిగతావి కాబోతున్నాయి. మీ అందరూ ఆశీర్వదిస్తే ఏడాదిన్నరలో నేను వచ్చి కొబ్బరికాయ కొట్టి స్విచ్ఛాన్ చేస్తాను. సాగర్ కాలువ నుంచి నీటి విడుదల కోసం ఎన్నిసార్లు బతిలాడాలి. ఇప్పుడు కూడా వెంకటవీరయ్య ఇంకోసారి నీళ్లు రావాలని అంటున్నడు. ఇంకోతడి ఇస్తే గడ్డకు పడిపోతమని చెబుతున్నడు. ఈ తండ్లాట ఎన్ని రోజులు. కృష్ణతో ఎప్పటికైనా మోసమే.. ఎందుకుంటే మూడునాలుగు రాష్ట్రాల పంచాయితీ. మనకు నీళ్లు తక్కువ. సీతారామ ప్రాజెక్టు పాత ఖమ్మం జిల్లా వరప్రధాయిని కాబోతున్నది. ప్రాజెక్టు పూర్తయితే నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరందుతుంది’ .
‘పాలేరుకు వచ్చే సీతారామ కాలువను హెలీకాప్టర్ నుంచి నామా నాగేశ్వరరావుకు చూపించాను. కొద్దిరోజుల్లోనే అయిపోతది.. కాలువ వచ్చి పాలేరులో పడితే నా ఖమ్మం జిల్లా బంగారు తునక అవుతుందని చెబుతున్నా. ఖమ్మానికి కరువనేదే రాదు. మూడు పంటలు పండించి.. నా రైతులు దర్జాగా కాలుమీద కాలువేసికొని కూర్చుంటారు. పడిగాపులు పడే దుస్థితి ఉండదు. రైతుబంధు, కరెంటు, దళితబంధు కావాలా.. ? కరకట ధమనకులు కావాల్నా..! సుందోపసుందులు కావాల్నా? నేను నిన్ను అసెంబ్లీకి పోనివ్వా? నిన్ను పార్లమెంట్‌కు పోనివ్వా? అని నాలుగు రూపాయల గర్వంతో జబ్బులు చరుకునే నీచులు కావాల్నా? పని చేసే పార్టీ కావాలా? ఆలోచించాల్సింది మీరు. గోల్‌మాల్ కావొద్దు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ మన సొంత విచక్షణ మీదుండాలి. సత్తుపల్లిలో నేడు ఒక మాటచెబుతున్నా.. కేసీఆర్ చెప్పిండంటే జరుగుతుంది. శిలాక్షరం. ఏ దళితబంధు అయితే పెట్టినమో.. వందశాతం ఎన్నికల తెల్లారి నుంచే అమలవుతుంది. అమలు చేసే బాధ్యత నాది’.
‘దళితబంధు అమలయ్యే టైమ్‌లో సత్తుపల్లికి వచ్చి ఒక్కరోజంతా మీ మధ్యలో కూర్చోని.. ప్రతి కుటుంబానికి అమలుచేయించే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఈ చిల్లరగాళ్ల మాటలు పట్టుకోవద్దు. పార్థసారథిరెడ్డి లాంటి మంచి మనిషి. అరమరికలు తెలియని వ్యక్తి. ఆయన వ్యాపారం, మెడికల్ ఫ్యాక్టరీని తప్పా వేరే పట్టించుకోరు. ఆయనను అన్నా మీరు రాజకీయాల్లోకి రావాలని పిలిచారు. ఆయన రాజ్యసభ కావాలని అడుగలేదు. ఆయనకు పిలిచి రాజ్యసభ మెంబర్‌గా అవకాశం ఇచ్చాం. ఆయన కూడా నాతో బాధపడుకుంట అంటున్నడు.. సార్ ఇంత ప్రేమ చేసి దళితబంధు పెడితే.. ఎన్నికల కోసం పెట్టారని బద్నాం చేస్తున్నారని బాధపడ్డారు. దళితబంధు పథకం కేసీఆర్ ఎన్నికల కోసం పుట్టించిండా? దళిత సమాజం నేను చెప్పే విషయంపై ఆలోచించాలి’ .
‘తెలంగాణ దళిత సమాజానికి ఈ సత్తుపల్లి నుంచి అప్పీల్ చేస్తున్నా? మీ కోసం మంచిచేసేందుకు, జాగృతం చేసేందుకు, వికాసాన్ని మనసునిండా కోరుకునేటువంటి కేసీఆర్‌లాంటి నాయకుడిని పోగొట్టుకోవద్దని మనవి చేస్తున్నా. ఇలాంటి వాళ్లురారు. మీ గురించి ఆలోచించలే.. ఎవరూ చేయలేదు. ధైర్యం చేసి చేస్తున్నది మేము. కాబట్టి దాన్ని కొనసాగించువాలంటే బీఆర్‌ఎస్‌ను అధికారంలో కొనసాగించే ప్రక్రియ మా దళితజాతి తీసుకోవాలని కోరుతున్నా. కల్లూరు, తల్లాడ, పెనుబల్లిలో ఫోర్‌లైన్, సెంట్రలైట్ కావాలని అడుగుతున్నారు. గొర్రెలకాపర్లకు రెండో విడత పథకం మొదలైంది. ఆటోమెటిక్ వస్తుంది. దానికి ఇబ్బంది లేదు. మిగతా పనులన్నీ చేసి పెడుతాం. ఇవన్నీ లెక్క కాదు. నాకు వెంకటవీరయ్య దగ్గరి మనిషి. చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయనంటే గౌరవం ఉంది. ఆయన గట్టిగా అడిగితే ఏ మంత్రిగానీ.. ముఖ్యమంత్రి కాదనలేని పరిస్థితి లేదు. చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. వెంకటవీరయ్యను అఖండ మెజారిటీతో గెలిపించి.. సత్తుపల్లి సత్తాచాటాలి’.
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ తెలంగాణలో దళారీ రాజ్యమే వస్తుంది. ‘ధరణి తీసివేస్తమని రాహుల్ గాంధీకి కూడా మాట్లాడుతున్నడు. రాహుల్ గాంధీకి ఎద్దు ఎరుకనా.. ఎవుసరం ఎరుకనా? ఎన్నడన్న నాగలి పట్టిండా? రైతుల బాధలు తెలుసా? ఇక్కడ ఎవడో సన్నాసి రాసిస్తే తెల్వక అజ్ఞానంతో మాట్లాడుతున్నడు. ధరణి బంద్ అయితే.. దానికి ప్రత్యామ్నాయం ఏం వస్తుంది? మళ్లీ వీఆర్వోలేనా ? మళ్లీ పహాణీ నకల్లేనా? మళ్లీ ఎమ్మార్వో కార్యాలయం.. వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుడేనా? అన్న నా పేరు ఎక్కియ్యంటే.. మళ్లీ లావ్ పాంచ్ హజార్ అంటారు. మళ్లీ అదే రావాలా? మీ అధికారం ఉండాలా? మీ అధికారాన్ని తీసివేసుకుంటారా..?.
‘మీ ఓటు అంటే మామూలు విషయం కాదు. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ దళారీల రాజ్యం వస్తుంది. పైరవీకారుల చుట్టూ తిప్పే రాజ్యం వస్తుంది. భూమిపై పెత్తనం ప్రభుత్వానికి వెళ్తుంది. బీఆర్‌ఎస్‌కు, సండ్ర వెంకటవీరయ్యకు ఓటు వేస్తే మీ భూమిపై పెత్తనం ఉండాలా? పోవన్నా..? ఎక్కడ మారుమూల పల్లెలో అడిగితే ధరణి ఉండాలని చెబుతున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నడు.. కేసీఆర్ ప్రజలు కట్టే అమూల్యమైన పన్నుల డబ్బులను రైతుబంధు అని రైతులకు పంచి దుబార చేస్తున్నడని మాట్లాడుతున్నడు. రైతుబంధు ఉండాలా వద్దా? మరి దుబారా అనేటాయనను ఏం చేయాలి? దాని అర్థమేంది. కాంగ్రెస్ మీకు హింట్ వస్తుంది. గొడ్డలి భుజం మీదున్నది. బట్టకప్పారు గంతే.. ఒక్క దెబ్బతో కాంగ్రెస్ గెలిస్తే.. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జై భీమ్.. కరెంటు కాటకలుస్తుంది’ .
‘మళ్లీ రెవెన్యూ రికార్డులు, వకీళ్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వాళ్లు ఓపెన్‌గా చెబుతున్నారు. వాళ్లు అంతచెప్పంగా ఓటు వేస్తామంటే నేను చేయగలిగేది ఏం లేదు. మీ ఇష్టం. మీరే ఆలోచన చేయాలి. ఆ ప్రమాదం కొనితెచ్చుకుందామా? దుష్ట దుర్మార్గ కాంగ్రెస్‌ను తెచ్చుకొని పైరవీకారుల రాజ్యాన్ని తెచ్చుకొని మన భూములపై పెత్తనాన్ని పోగొట్టుకుందామా? ఆలోచన చేయాల్సింది మీరు. గ్రామాలకు వెళ్లిన తర్వాత కేసీఆర్ ఇలా చెప్పిండు.. ఇది నిజమా? అబద్ధామా? అని ప్రతి ఒక్కరితో చర్చ చేయాలి. అప్పుడు ప్రజాస్వామ్యంలో పరిపుష్ఠి. అప్పుడు విజయం వస్తుంది.. గెలుస్తాం. వెంసూర్ మండలానికి నేను వచ్చాను. ఒకప్పుడు రైతులు ఘోరంగా ఏడ్చేది’ .
‘అదే మండలంలో పుట్టిన మన ఖమ్మం జిల్లా పార్థసారథిరెడ్డి చాలా పాఠశాలలు, జూనియర్ కళాశాల, లైబ్రరీ కట్టించారు. ఎంతో మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు. తాను సంపాదించుకున్నా పేరు ప్రతిష్ఠలు వచ్చినా తన కన్న భూమిని, మాతృభూమిని వదిలిపెట్టకుండా ప్రేమతో పార్థసారథిరెడ్డి పని చేస్తున్నారు. నేను వచ్చిన రోజు వేంసూర్ లిఫ్టుల వద్ద ఏడ్చారు. సార్ కాలువ నాలుగు మామిడి చెట్లు ఉన్నయ్.. సాగర్ కాలువ నుంచి నీళ్లు తీసుకుంటే.. మోటార్లు కోసి కాలువలో పడేస్తున్నరు బెదిరించి వెళ్లండి అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇవాళ బ్రహ్మాండంగా చెరువులు నింపుకుంటున్నాం. సండ్ర వెంకటవీరయ్య నాతో పోరాడి.. కాలువలు తవ్వించారు. చెరువు నింపడంతో వెంసూర్ మండలం కూడా పచ్చబడ్డది’.
ఆరు నూరైనా తెలంగాణలో గెలువబోయేది బీఆర్‌ఎస్ పార్టీయే. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ గెలువకుండా ఎవడూ ఆపలేరు. బీఆర్‌ఎస్ గెలుపుని ఆపడం ఎవని తాత, జేజమ్మ వశం కాదు. ‘ఖమ్మం జిల్లాలో ఒకరిద్దరు కరటక దమ్మదగ్గులున్నరు. బీఆర్‌ఎస్ తరఫున నిలబడ్డ ఎవన్ని కూడా నేను అసెంబ్లీ వాకిలి తొక్కనియ్యనని ఒకడంటడు. అది అయ్యేపనేనా..? మీరంతా తలుచుకుంటే సత్తుపల్లి నియోజకవర్గంలో దుమ్మురేగదా..? సండ్ర వెంకట వీరయ్య ఒక్కసారి కాదు, నాలుగోసారి సత్తుపల్లి పహిల్వాన్‌లా శాసనసభలో అడుగుపెట్టడా..? నామా నాగేశ్వర్‌రావు ఖమ్మం పహిల్వాన్‌లా లోక్‌సభలో అడుగుపెట్టడా..? ఒక్కొక్కనికి ఎంత అహంకారం. నాలుగు పైసలు జేబులో పడితే ఇంత అహంకారం పెరుగుతదా..? పదేళ్లు సీఎంగా పని చేసిన నేను కూడా అంత అహంకారంతోటి మాట్లాడలేదు’.
‘ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదు. పార్టీల మధ్య పోరాటం. గత దశాబ్దాలుగా ఏ పార్టీ ఏం చేసిందో ప్రజలకు తెలుసు. పదేళ్లకు ముందు దాకా ఈ రాష్ట్రంలో ఎక్కువ ఏండ్లు పాలించిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో.. ఇప్పుడు పదేళ్లలో బీఆర్‌ఎస్ పార్టీ ఏం చేసిందో మీకు తెలియదా..? అందుకే ఓటేసే ముందు ఆలోచించి ఓటేయండి. కూరగాయలను కొనేటప్పుడు కూడా పుచ్చులు ఏరిపారేసి మంచివి తీసుకుంటం. అలాంటిది మన నాయకున్ని ఎంచుకునేటప్పుడు అటువంటి విచక్షణ చేయగూడదా..? కాబట్టి బాగా ఆలోచించి ఓటేయండి. మంచి నాయకుడిని ఎన్నుకోండి’.