ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి: సీఎం కేసీఆర్
తెలంగాణ ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

విధాత: తెలంగాణ ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. 10 ఏండ్ల నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కేంద్రం 150 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. కానీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. నేనే స్వయంగా 100 ఉత్తరాలు రాశాను. ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. పార్లమెంట్‌లో పాస్ చేసిన చట్టాన్ని కూడా మోదీ ఉల్లంఘించారు. ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని నవోదయ పాఠశాలలు స్థాపించాలని చట్టం ఉంది.
ఇది కండీషన్. చట్టాన్ని కూడా బేఖాతరు చేసి నవోదయ పాఠశాల ఒక్కటి కూడా ఇవ్వలేదు. మనం పన్నులు కడుతలేమా..? దేశంలో మనం భాగం కాదా..? ఇక్కడున్న బీజేపీ నాయకులు పెద్దగ నీలుగుతారు. మోదీతో ఎందుకు మాట్లాడలేదు. నలుగురు బీజేపీ ఎంపీలు ఏం చేయలేదు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి. చట్ట ప్రకారం రావాల్సిన పాఠశాలలు ఇవ్వకుండా మన మీద పగ పట్టినటువంటి బీజేపీకి ఎందుకోసం ఓటేయాలి. ఎవరి ముఖం చూసి ఓటేయాలి. ఏమొస్తది బీజేపీకి ఓటు వేస్తే అని ఆలోచించాలి.
రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నారు మోదీ. చచ్చినా పెట్టను అని చెప్పాను. మోటార్లకు మీటర్లు పెట్టకుపోతే ఏడాదికి వచ్చే రూ. 5 వేల కోట్లు కట్ చేస్తా అని చెబితే, కట్ చేయమని చెప్పాను. ఐదేండ్లకు రూ. 25 వేల కోట్లు కోత విధించారు. మరి ఇక్కడున్న బీజేపీ నాయకులు ఏం చేశారు. ఈ నాయకులు మనకు ఎందుకు..? వాళ్లు ఎందుకు పనికి వస్తరు. రాష్ట్రం ఇట్ల నాశనం అయిపోతుండే. రావాల్సినవి రాకపోతే.. వీళ్లు గెలిచి చేసింది ఏది.. పొడిచేది ఏందీ..? .
ఇవాళ మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం. తెలంగాణ ప్రజల హక్కులు కాపాడటం కోసం. మిగతా రెండు పార్టీలకు కూడా చరిత్రలు ఉన్నాయి. కాంగ్రెస్ చరిత్ర ఏంది..? బీజేపీ చరిత్ర ఏంది..? వారి వైఖరి మన రాష్ట్రం మీద ఏవిధంగా ఉందని చూడాలి. అవి కూడా దయచేసి ఆలోచించి అప్పుడే ఓటు వేయాలి. బామ్మర్ది, చిన్నాయన చెప్పిండని చెప్పి పొరపాటున ఓటు వేయొద్దు. ఆషామాషీగా ఓటు వేస్తే నష్టపోతాం. మంచివాళ్లకు ఓటేస్తే డెఫినెట్‌గా మంచి జరుగుతది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో మంచి పనులు చేసింది. పెట్టుబడి కోసం రైతుబంధు తెచ్చింది. కర్మగాలి ఎవరైనా చనిపోతే రైతుబీమా ఇస్తుంది. మీరు పండించిన పంటను కొనుగోలు చేసి బ్యాంకుల్లో డబ్బులు వేస్తున్నది. ఇవన్నింటిపై మీరు గ్రామాల్లో చర్చపెట్టాలె. గుడ్డిగ ఓటేసుడు గాదు. దయచేసి బాగా ఆలోచించి ఓటేయాలి.
ఇప్పుడు బీజేపాయన గెలిస్తే ఏమైతది..? ఇప్పుడు ఎన్నేండ్లాయె గెలిచి..? ఏకాన పని అయ్యిందా..? పైంగ పెద్దపెద్ద మాటలు. ఎల్లయ్యకు ఎడ్లు లేవు.. మల్లయ్యకు బండి లేదు. వట్టియే మాటలు. శూన్య ప్రియాలు.. శుష్క హస్తాలు. ఏం జరుగదు. అదే కౌశిక్‌రెడ్డి గెలిస్తే పనులు జరుగుతయ్. నేను మీకు ఒక్కటే మాట చెప్తున్నా. తెలంగాణల నేను 50 శాతం పైన తిరిగిన. ఈ ఎన్నికలల్ల వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీ గెలువబోతున్నది. మరి గవర్నమెంట్ దిక్కు ఉండే కౌశిక్ రెడ్డి గెలిస్తే మంచిదా..? వేరేటోళ్లు గెలిస్తే మంచిదా..? మీరే ఆలోచన చేయాలె. మీ ఓటు వేరే ఎవరికి వేసినా మోరీల పారేసినట్టే. మురిగిపోతది.
కేసీఆర్ హుజూరాబాద్‌కు ఏం తక్కువ జేసిండు..? మీ కాలువలు లైనింగ్ చేయించలేదా..? మునుపటి వారాబందీలు బందయ్యి ఇప్పుడు కాలువల నిండ నీళ్లు వస్తలేవా..? మీ దగ్గర ధాన్యం కొంటలేరా..? మీకు రైతుబంధు వస్తలేదా..? మీ దగ్గర దళిత బంధు అన్ని ఇండ్లకు రాలేదా..? మరి ఇన్ని జేసిన కేసీఆర్‌ను గాదని, ఎవడ్నో ఎత్తుకుంటే ఏమొస్తది..? హుజూరాబాద్ నియోజకవర్గం ఇవన్నీ ఆలోచన చేయాలె. మిత్రుడు కౌశిక్‌రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వండి. కౌశిక్ రెడ్డి వాళ్ల నాయినా.. ఈటల రాజేందర్ కూడా లేనినాడు గులాబీ జెండా మోసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి. ఇది మీ అందరికి గూడా తెలుసు.
కౌశిక్ రెడ్డి నాకు కొడుకు లాంటి వాడు. హైదరాబాద్‌లో నాతోపాటే ఉంటడు. ఇయ్యాల మామూలు ఎమ్మెల్సీగా లేడు. విప్‌గా కూడా ఉన్నడు. రేపు గెలిస్తే మీ అందరికీ బ్రహ్మాండంగా సేవ చేయగలుగుతడు. బ్రహ్మాండమైన పనులు జరుగుతయ్. కాబట్టి యువకుడు, ఉత్సాహవంతుడు అయిన కౌశిక్‌రెడ్డిని గెలిపిస్తే హుజూరాబాద్‌కు అన్ని రకాలుగా అండదండగ నేనుంటా. నియోజకవర్గంలో కొన్ని మండలాలు కావాలని కౌశిక్‌రెడ్డి నన్ను అడిగిండు. ఇంక కొన్ని పనుల గురించి చెప్పిండు. అవన్నీ గొంతెమ్మ కోరికలు ఏం గాదు. అన్నీ కాదగినయే. కాబట్టి కౌశిక్‌రెడ్డిని గెలిపించండి నేను పర్సనల్‌గా బాధ్యత తీసుకుని పనులు చేయిస్తా.
మంచివైపు పోతే మంచి జరుగుతది. చెడువైపు పోతే చెడు జరుగుతది. కాబట్టి మీ అందరిని కోరేది ఒక్కటే. గతంలో ఒకసారి మీరు నన్ను బాధపెట్టిండ్రు. పర్వాలేదు. ఆ రోజున అట్ల జరిగిపోయింది. ఇప్పుడు మళ్లా అట్ల జరగడానికి వీల్లేదు. నల్లదేదో.. తెల్లదేదో మీకు తెలిసిపోయింది. పాలిచ్చే బర్రెను ఇడిసిపెట్టి దున్నపోతును తెచ్చుకుంటడా ఎవడన్నా..? మరె ఏం జేస్తరో మీరు ఆలోచన చేసి కౌశిక్‌రెడ్డిని గెలిపించండి. నేను అన్ని రకాలుగా అండదండగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. ఈసారి కౌశిక్‌రెడ్డి గెలుస్తడు రిపోర్టులు చెప్తున్నయ్. కాబట్టి మీరందరూ కౌశిక్‌రెడ్డి ఓటేసి గెలిపించాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా.