ఎవరో ఒకరు గెలుస్తారు! కానీ.. నిజమేదో ఆలోచించి ఓటేయండి: సీఎం కేసీఆర్
రాజకీయ పరిణితి, ప్రజాస్వామి పరిణితి రావాల్సిన అసవరం ఉంది. పైసలకు, ప్రలోభాలకు ఓటు వేయొద్దు. మీరు ఆలోచించి చైతన్యంతో నిజమేదో ఆలోచించి ఓటు వేయాలి

విధాత: ఎన్నికల్లో ఓటును అలవోకగా వేయొద్దు.. మీ తలరాత మార్చేది.. భవిష్యత్‌ను తీర్చిదిద్దేది మీ ఓటే. ఇల్లందు చాలా ఉద్యమాలు జరిగిన ప్రాంతం.. చాలా చైతన్యం ఉండే ప్రాంతం.. పోరాటాల పురిటిగడ్డ. ఎలక్షన్లు వచ్చినప్పుడు పార్టీకి ఒకరు నిలబడుతారు. బీఆర్ఎస్ తరపున హరిప్రియ ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తరపున ఎవరో ఒకరు నిలబడుతారు. నవంబర్ 30న ఎన్నికలు జరిగేది ఖాయం.. డిసెంబర్ 3న ఎవరో ఒకరు గెలిచేది ఖాయం.
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నది. రాజకీయ పరిణితి, ప్రజాస్వామి పరిణితి రావాల్సిన అసవరం ఉంది. ఇది గంభీరమైన సమస్య. ఒక ఒరవడిలో కొట్టుకుపోకుండా, పైసలకు, ప్రలోభాలకు ఓటు వేయొద్దు. మీరు ఆలోచించి చైతన్యంతో నిజమేదో ఆలోచించి ఓటు వేయాలి. ఎన్నికల్లో ప్రజలు గెలిచే స్థితి రానంత వరకు ఈ దేశం ఇలానే ఉంటది.
మీలో ఒకడిగా, కొట్లాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా చెబుతున్నాను.. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ ఏదీ..? చరిత్ర ఏందీ..? దృక్పథం ఏంది..? ప్రజల గురించి ఏం ఆలోచిస్తుంది ఆ పార్టీ అని తెలుసుకోవాలి. ఎమ్మెల్యేల ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడతుంది. మంచి ప్రభుత్వం గెలిస్తే మంచి పనులు జరుగుతాయి. చెడు ప్రభుత్వం గెలిస్తే చెడ్డ పనులు జరుగుతాయి. కాంగ్రెస్, టీడీపీ పాలన చరిత్ర మీకు తెలుసు. అందరి చరిత్రలు మీ చేతిలో ఉన్నాయి. వ్యవహారశైలి, నడకలు, వారు అవలంభించిన పద్దతులు మీ ముందున్నాయి.
ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. స్థిరంగా ఆలోచించాలి. ఏం చేస్తే లాభం జరుగుతదో ఆ దారి పట్టాలి. అదే ప్రజాస్వామ్యానికి దారి. ఓటును అలవోకగా వేయొద్దు. తమాషా కోసం వేయొద్దు. కారణం ఏందంటే ఈ దేశంలో ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం ఓటు. మీ తలరాత మార్చేది.. భవిష్యత్‌ను తీర్చిదిద్దేది మీ ఓటే. హైదరాబాద్‌లో మేం పని చేస్తున్నామంటే అది మీరు ధారపోసిన శక్తే. మీ శక్తి లేకపోతే మేం చేసేది ఏం లేదు. ఓటు వేసే ముందు నిజమైన పంథా ఎంచుకోవాలి.
మన అమూల్యమైన ఓటు సన్నాసికి వేస్తున్నామా..? సరైన వ్యక్తికి వేస్తున్నామా..? అని ఆలోచన చేయకపసోతే మనమే ఓడిపోతాం. మన బతుకులను ఎవరు మార్చలేరు. ఈ విషయాలను మీరు ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు జరిగాయి మీకు తెలుసు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది పది.. చేసింది వంద. దళితబంధు పెట్టమని ఎవరూ చెప్పలేదు. ఇంటింటికి మంచినీళ్లు ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలేదు. రైతుబంధు, రైతుబీమా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు.. కానీ చేసుకుంటూ పోయాం.
ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుంది. బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీకి ఓ పిచ్చిపట్టుకున్నది. ప్రైవేటైజేషన్ పిచ్చి. అన్ని ప్రైవేటు.. విమానాశ్రయం, ఓడరేవులు, రైళ్లు ప్రైవేటు. చివరకు దేశాన్ని ఏం చేస్తడో తెల్వదు. కరెంటు కూడా ప్రైవేటీకరణే. నన్ను కూడా బెదిరించారు. మీ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి రూ.5వేలకోట్ల బడ్జెట్‌ను కట్ చేస్తే.. ఐదేళ్లలో రూ.25వేలకోట్లు పోతయ్.. కానీ తలకాయ తెగిపడ్డా సరే మీటర్లు పెట్టా అని చెప్పిన. కారణం ఏంటంటే.. తెలంగాణ బతుకు ఏంటో నాకు తెలుసు.
‘నేను కూడా రైతునే. నేను కూడా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా. ఎన్ని బాధలున్నయో.. ఎన్ని బోర్లు వేసినమో.. ఎంత బోర్లపడ్డమో.. ఎన్ని అప్పుల పాలైనమో.. అవస్థలు పడ్డమో నాకు తెలుసు. రైతుల బాధలు నాకు తెలుసు. తెలంగాణ వచ్చిన నాడు వలసలు, కరెంటు లేదు. కరువు, మంచినీళ్లు, సాగునీరు లేదు. చెట్టుకొకరు గుట్టకొకరై బతుకపోయినం. గొడగొడ ఏడ్చినం ఆ రోజు. మనల్ని ఎవరూ పట్టించుకోలేదు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్ల చక్కదిద్దాలి.. ఎలా మొదలు పెట్టాలి.. ఏ కార్యక్రమం ముందు తీసుకోవాలి.. మూడునాలుగు నెలలు మెదడు కరుగదీసి.. మేధావులను పిలిచి.. చర్చలు జరిపి ఒకదారి వేసుకున్నాం. ఈ మధ్యనే మొఖాలు తెల్లవడుతున్నయ్. పంటలు పండుతున్నయ్. అప్పులు తీరుతున్నయ్. ఒక రకమైన పద్ధతి పెట్టుకున్నాం. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు పెట్టుకున్నాం.
‘బీఆర్‌ఎస్ రాకముందు రైతుబంధు గురించి విన్నమా? అప్పులుంటే తలుపులు తీసుకొని వెళ్లారే తప్ప రైతుకు రూపాయి ఇవ్వలేదు. రైతు సచ్చిపోతే కూడా ఆపద్బందు అనే దిక్కుమాలిన పథకం పెట్టారు. రూ.50వేలు ఇస్తామని చెప్పి ఆరు నెలలు రూ.10-20వేలు చేతులో పెట్టి పంపేది. పైరవీకారులే మేసేది. ఇవాళ రైతుబంధు పథకం పెట్టుకున్నాం. తద్వారా కొంత పెట్టుబడి సమయానికి వస్తున్నది. వ్యవసాయ స్థిరీకరణ జరగాలని రైతుల కోసం నాలుగైదు కార్యక్రమాలు చేశాం. దాంతో వ్యవసాయం నిలబడ్డది. రైతులు కొంచెం తేటపడ్డరు.
గ్రామాలకు వాపస్ వచ్చారు. గతంలో పిల్లను ఇవ్వడానికి వస్తే.. అటెండర్ ఉద్యోగం ఉన్నా సరేగాని.. వ్యవసాయం చేస్తే పిల్లనివ్వమని వాపస్‌పోయేది. నిన్న ఇవాళ పద్ధతి మారి.. భూమి ఏమన్న ఉన్నదా అని అడుగుతున్నరు. భూమి ఉంటే పిల్లను ఇస్తున్నరు. ఇదంతా మీ కండ్లముందే జరిగిన చరిత్ర. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు పెట్టుకున్నాం. నీటి తీరువా బకాయిలు రద్దు చేసుకున్నాం. రాష్ట్రంలో నీళ్లపై పన్ను లేదు’.
ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అసెంబ్లీ గడప తొక్కనివ్వమని మాట్లాడుతున్నారని.. అసెంబ్లీకి పంపేది మీరా? ఆ సన్నాసులా.? ‘అలాగే ధరణి పోర్టల్ తెచ్చుకున్నాం. ధరణి పోర్టల్‌లో ఎవరి భూమి వాళ్ల పేరుమీదున్నది. ధరణిలో రైతు పేరు వచ్చిందంటే ఎవరూ గోల్‌మాల్ అయ్యే పరిస్థితి లేదు. రైతులు నిశ్చింతగా ఉండొచ్చు. అందుకే చాలాపెద్ద సంఖ్యలో రైతులకు పొడుభూములు ఇచ్చాం. ఎవరూ గతచరిత్రలో ఎవరూ ఇవ్వలేదు. దాదాపు 15,107 కుటుంబాలకు 48,300 ఎకరాలు ప్రభుత్వం భూమి ఇచ్చింది. ఇల్లెందుకు నియోజకవర్గానికి ఓ గర్వం ఉన్నది’.
‘హరిప్రియ నాయక్ చరిత్రలో ఉంటది. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నటైమ్‌లో ఇల్లెందు నియోజకవర్గంలో 48వేల ఎకరాలకుపైగా పొడు భూములను మీకు అందించడం జరిగింది. పొడు భూములు అందించడమే కాదు.. దానిపై ఉన్న కేసులన్నీ రద్దు చేశాం. అలాగే రైతుబంధు కూడా ఇచ్చాం. గుండాలలాంటి మారుమూల ప్రాంతం, అటవీ ప్రాంతంలో త్రీ ఫేజ్ కరెంటు ఇస్తున్నాం.
దాంతో గిరిజన రైతులు కూడా సగర్వంగా వ్యవసాయం చేసుకోవాలని రైతుబంధు, బీమా తీసుకువచ్చాం. కేసులను రద్దు చేశాం. ఇలా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. ఇల్లెందు గ్రామాల్లో వానపడ్డదంటే చెప్పులు చేతలోపట్టుకొని నడిచేపోయే పరిస్థితి ఉండే. ఎక్కడా రోడ్లు సరైన రోడ్లు లేకుండే. హరిప్రియ నాయక్ నాతో కొట్లాడి రూ.వందలకోట్ల రోడ్లు మంజూరు చేసి.. అన్ని గ్రామీణ ప్రాంతాల్లో చక్కటి రోడ్లు మంజూరు చేయించి. ఇల్లెందు పట్టణానికి కూడా రూ.400కోట్లు దాకా తీసుకువచ్చి అభివృద్ధి చేశారు’.
‘గతంలో పట్టణం డర్టీగా ఉండేది. ఇప్పుడు సెంట్రల్ లైటింగ్, సీసీరోడ్లు తదితర పనులతో కొంత అందం వచ్చింది. ఇవన్నీ గతంలో జరుగలే. కానీ, హరిప్రియ అన్నీ చేసింది. బీఆర్‌ఎస్ గవర్నమెంట్ చేసింది. దయచేసి ఎవరు ఏం చేశారు. గతంలో ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు ఉండేకదా..? ఏ ప్రభుత్వం ఎవరికి న్యాయం జరిగిందో ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా చేస్తే మళ్లీ మనకు ఇబ్బందులు వచ్చే పరిస్థితులంటయ్. కొమురారంతో పాటు రెండుమండలాలు కావాలని హరిప్రియ కోరింది. హరిప్రియ నాయక్ నా బిడ్డలాంటిది.
నా బిడ్డ కోరిన తర్వాత కాదనే పరిస్థితి కాదు. ప్రజల తరఫున కోరుతుంది. ఎన్నికల తర్వాత కొత్త మండలాలను ఏర్పాటు చేస్తాం. ఒకమాటిక్కడ మనవి చేయాలి. ఈ జిల్లాలో కొంత మంది ఉన్నరు. వాళ్లకు డబ్బులు వచ్చాయి.. అహంకారం పెరిగిపోయింది. ఇక్కడి నుంచి ఎవరం కూడా బీఆర్‌ఎస్ నాయకులను అసెంబ్లీ గడప తొక్కనివ్వమని ప్రతిజ్ఞలు చేస్తున్నరు. అసెంబ్లీ గడప తొక్కేందుకు పంపేది మీరా? ఆ సన్నాసులా? ఎవరు పంపేది మీరే కదా?’.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే పోరాడే పార్టీ. మాకు ఢిల్లీలో బాసులు లేరు.. మాకు బాసులు ఎవరైనా ఉన్నారంటే అది మీరే తప్ప ఇంకెవరు లేరు. మీరు ఏ ఆదేశం ఇస్తే, మీకు ఏది అవసరం ఉంటే దానికే తలవంచుతాం తప్ప మా బాసులు ఢిల్లీలో లేరు. ఇక్కడ వేరే ఏ పార్టీ గెలిచినా వారి కట్కలు ఢిల్లీలో ఉంటాయి. స్విచ్ అక్కడ వేస్తేనే ఇక్కడ బల్బులు వెలుగుతాయి. వీళ్ల చేతుల ఏం ఉండదు.
అందుకోసం మంచి చెడు గుర్తించాలి. తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష. చదువుకున్న విద్యావంతురాలైన హరిప్రియా నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గిరిజన ప్రాంతంలో ఇంత పెద్ద సభలు జరగవు. ఇంత మంది వచ్చారంటేనే పెద్ద మెజార్టీతో గెలిచారని అర్థమవుతుంది. తప్పకుండా విజయం మనదే అనే విశ్వాసం కలుగుతుంది. మానవీయ కోణంలో ఆలోచించే మంచి విద్యావంతులరాలైన హరిప్రియను భారీ మెజార్టీతో గెలిపించాలి.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలు, రైతుల గురించి ఆలోచించలేదు. అందుకే పార్టీల వైఖరి, దృక్పథం గురించి ఆలోచించాలి. వైద్య విధానం, విద్యా విధానం మన కండ్ల ముందుంది. ఇంతకు ముందు ప్రయివేటు దవాఖానాల్లో ఇష్టమొచ్చినట్లు ఆపరేషన్లు చేసి దోపిడీ జరిగేది. అమ్మ ఒడి వాహనాలు వస్తున్నాయి. కేసీఆర్ కిట్ అమలు చేసిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి.
తెలంగాణలో అన్ని వర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుకున్నాం. గురుకులాల్లో చదివిన పిల్లలు బ్రహ్మాండమైన ర్యాంకులు తెస్తున్నారు. ఆల్ ఇండియా లెవల్ నీట్ పరీక్షలో కూడా ఉత్తీర్ణులు అవుతున్నారు. ఎంబీబీఎస్ సీట్లు కొడుతున్నారు. ఇంజినీర్లు, డాక్టర్లు అవుతున్నారు. గతంలో ఈ గురుకులాలు ఎందుకు లేవు. గురుకులాలను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసుకున్నాం. సీతారామా ప్రాజెక్టుల త్వరలోనే పూర్తవుతుంది. మన దరిద్రం కూడా పోతది. ఎత్తులో ఉన్న మండలాలకు లిఫ్ట్ పెట్టి నీళ్లిస్తాం.
గిరిజన సోదరులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మా తండాల్లో మా రాజ్యం కావాలని పోరాడారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలు చేశాం. గిరిజనులకే అధికారం వచ్చింది. అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇల్లందు నియోజకవర్గంలో మనిషి చనిపోతే జాగ లేక గుట్టల మీద కాలబెట్టే రోజులు ఉండే. ఇవాళ వైకుంఠధామాలు ఏర్పాటు చేశాం. ప్రజల కనీస అవసరాలు గుర్తించి చేసిన వారెవరో.. చేయని వారెవరో, ప్రజలను వారి ఖర్మకు వారిని వదిలేసిన వారు ఎవరో గుర్తించి ఓటు వేయాలి.