వాడి త‌గ్గిన సీఎం మాట‌!

వాడి త‌గ్గిన సీఎం మాట‌!
  • ప‌క్కా హ్యాట్రిక్ అంటూ మొద‌ట్లో ధీమా
  • బీఆరెస్‌కు ఎదురేలేదంటూ వ్యాఖ్య‌లు
  • నానాటికీ త‌గ్గుతూ వ‌చ్చిన విశ్వాసం!
  • మెజార్టీ మీ ద‌య అంటూ కామెంట్లు
  • ఓడితే ఇంట్లో కూర్చుంటామని బేల‌త‌నం
  • పోగొట్టుకుంటే ఆగ‌మైత‌రంటూ ఆక్రోశం
  • మూస‌పోత ధోర‌ణిలో కేసీఆర్ ప్ర‌సంగాలు
  • నాటి తెలంగాణ‌కు నేటికి తేడాపై వివ‌ర‌ణ‌
  • గెలిపిస్తే అన్నీ చేస్తామ‌ని హామీలు



విధాత‌, హైద‌రాబాద్‌: కేసీఆర్ మాట‌ల్లో ప‌స త‌గ్గిందా? ఒక‌నాడు జ‌నాన్ని ఉర‌క‌లెత్తించిన ఉప‌న్యాసాలు.. ఇప్పుడు నిస్తేజంగా సాగుతున్నాయా? తొలిజాబితా ప్ర‌క‌ట‌న నాడున్న విశ్వాసం.. అధినేత‌లో స‌న్న‌గిల్లుతున్న‌దా? ముఖ్య‌మంత్రి ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో చేస్తున్న ప్ర‌సంగాల‌ను గ‌మ‌నిస్తే తేడా క‌నిపిస్తున్న‌ద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. తొలి జాబితా ప్ర‌క‌టించిన స‌మ‌యంలో 100 సీట్లు గెలుస్తాం.. అన్న సీఎం మాట‌ల్లో క‌నిపించిన విశ్వాసం.. త‌గ్గుతూ వ‌చ్చింద‌ని వారు చెబుతున్నారు.


కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాత్మ‌కంగా వేస్తున్న అడుగులు రాష్ట్రంలో ఈసారి విజ‌యంపై ఆ పార్టీ శ్రేణుల్లో న‌మ్మ‌కాన్ని పెంచాయి. అది అందించిన ఉత్సాహంతో నేత‌లు క‌ద‌ల‌డంతో కాంగ్రెస్ గ్రాఫ్ క్ర‌మంగా పెరిగింద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. అదే స్థాయిలో బీఆరెస్ ప‌ట్టు స‌డ‌లింద‌ని చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి మాట‌ల్లో ప‌దును త‌గ్గ‌టం వెనుక ఇది కూడా ఒక కార‌ణ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు.


ఇటీవ‌లి కొన్ని ప‌రిణామాలు.. ప్ర‌భుత్వం ప‌ట్ల వ్య‌తిరేక‌త పెంచేందుకు దోహ‌ద‌ప‌డ్డాయ‌ని చెబుతున్నారు. ప్ర‌త్యేకించి కాళేశ్వ‌రం ప్రాజెక్టులోని మేడిగ‌డ్డ కుంగుబాటును వారు ప్ర‌స్తావిస్తున్నారు. ప్ర‌పంచ అద్బుతం అని చెప్పిన కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ ప్రారంభించిన నాలుగేళ్ల‌కే కుంగింది. దీంతో బీఆరెస్ పార్టీపై ప్ర‌జల్లో కాస్త న‌మ్మ‌కం స‌డ‌లింది. దాని ఫ‌లితంగా కాళేశ్వ‌రం ఘ‌న‌త చాటేందుకు ముఖ్య‌మంత్రి ప్ర‌య‌త్నించ‌డం లేదు.


ఇక బీఆరెస్ నాయ‌కులు, అభ్య‌ర్థులు దాని జోలికి వెళ్లేందుకు భ‌య‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తున్న‌ద‌ని అంటున్నారు. సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన ద‌ళిత బంధు, బీసీల‌కు ఆర్థిక స‌హాయం, గృహ‌ల‌క్ష్మి, డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప‌థ‌కాలు అమ‌లు తీరుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉన్న‌ద‌ని స‌మాచారం. బీఆరెస్ ఎమ్మెల్యేలు త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కే ఇచ్చుకున్నార‌న్న ఆరోప‌ణ‌లు వెలువ‌డుతున్నాయి.


ఇలా క్షేత్ర స్థాయిల్లో ప‌థ‌కాల అమ‌లు తీరు విధానం ప‌ట్ల ప్ర‌జా వ్య‌తిరేక వెలువ‌డుతున్న విష‌యం స్ప‌ష్టం అవుతున్న‌ది. నిరుద్యోగం కూడా పెరిగింది. నోటిఫికేష‌న్లు రావ‌డం వాయిదాలు ప‌డ‌డం వ‌ల్ల నిరుద్యోగుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతున్న‌ది. ఇలా క్షేత్ర స్థాయిలో బీఆరెస్ ప‌ట్ల వెలువ‌డుతున్న వ్య‌తిరేక‌త స‌భ‌ల‌లో సీఎం మాట్లాడేట‌ప్పుడు ప్ర‌జ‌లు స్పందిస్తున్న తీరులో వ్య‌క్త మ‌వుతోంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.


తెలంగాణ భ‌వ‌న్‌లో 115 మంది అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించిన సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ అత్యంత విశ్వాసంతో రాష్ట్రంలో బీఆరెస్ మూడ‌వ సారి అధికారంలోకి వ‌స్తుంది. ప‌క్కాగా హ్య‌ట్రిక్ కొడ‌తాం. 95 నుంచి 100 సీట్లలో గెలుస్తామ‌ని ధీమాగా ప్ర‌క‌టించారు. అక్టోబ‌ర్ 18న కాంగ్రెస్ వ‌స్తే 60 ఏళ్లు వెన‌క్కు పోతామ‌ని హెచ్చ‌రించే ధోర‌ణిలో మాట్లాడారు. త‌ర్వాత కాంగ్రెస్‌ వ‌స్తే మోసపోతం.. బంగారు క‌త్తి అని మెడ కోసుకోవ‌ద్ద‌ని అన్నారు.


అచ్చంపేట‌, వ‌న‌ప‌ర్తి, మునుగోడుల‌లో నిర్వ‌హించిన స‌భ‌ల్లో.. “ఓడిస్తే ఏం చేస్తం.. రెస్ట్ తీసుకుంటం.. న‌ష్ట‌పోయేది మాత్రం తెలంగాణ ప్ర‌జ‌లే.. అంటూ బేల‌త‌నం ప్ర‌ద‌ర్శించార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఆఖ‌రుకు .. ఎవ‌రో ఒక‌రు గెలుస్తారు.. కానీ.. ఆలోచించి ఓటు వేయాల‌ని అశ‌క్త‌త ప్ర‌ద‌ర్శించార‌ని అంటున్నారు. గ‌తంలో మోదీని గ‌ట్టిగా టార్గెట్ చేస్తూ కేసీఆర్ ఉప‌న్యాసాలు ఉండేవ‌ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు.


కానీ.. ఇప్పుడు ఏదో మాట వ‌రుస‌కు విమ‌ర్శించాలి కాబ‌ట్టి విమ‌ర్శిస్తున్నార‌ని అంటున్నారు. రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అద్భుతంగా అభివృద్ధి చేశామ‌ని చెబుతూనే.. గ‌త రెండు ఎన్నిక‌ల మాదిరిగానే.. ప‌దేళ్ల త‌ర్వాత కూడా తెలంగాణ సెంటిమెంట్‌ను మ‌రోసారి రెచ్చ‌గొట్టి ఓట్లు దండుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఒక సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు వ్యాఖ్యానించారు.


ప్ర‌స్తుతం సీఎం ప్ర‌సంగాలు చూస్తే.. నాలుగైదు అంశాల‌పైనే కేంద్రీక‌రించి.. వాటిని అటుతిప్పి ఇటు తిప్పి చెబుతున్నార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీంతో రోజూ లైవ్‌లో చూసి.. మ‌ళ్లీ అదే ఉప‌న్యాసాన్ని వినాల్సి రావ‌డంతో జ‌నాల్లోనూ పెద్ద‌గా ప్ర‌తిస్పంద‌న‌లు రావ‌డం లేద‌ని అంటున్నారు.