ప్రజాగోసకు దర్పణం!

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది

ప్రజాగోసకు దర్పణం!

-రేవంత్‌ తొలి ప్రజాదర్బార్ సూపర్‌హిట్‌

– ప్రజాభవన్‌కు వేలల్లో పోటెత్తిన జనం

– తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో

– ధరణితో ఎదురైన సమస్యలే అధికం

– సీఎంకు నేరుగా గోస చెప్పుకున్న జనం

– ముందే ఆన్‌లైన్‌ ఎంట్రీ.. ఎకనాలెడ్జ్‌మెంట్

– పకడ్బందీగా సమన్వయం చేసిన అధికారులు

– మునుముందు మరింత రద్దీకి చాన్స్‌

– ప్రజలను సీఎం కలవనక్కర్లేదని గతంలో అప్పటి మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు

– అది తప్పని నిరూపించిన ప్రజానీకం

విధాత : తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే తొలి ప్రసంగంలో ప్రగతిభవన్‌ ఇనుప కంచెలను బద్దలు కొట్టామని, దాని పేరును ఇకపై జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌గా మార్చుతున్నామని, అందులో ప్రతి శుక్రవారం ఉదయం ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటించిన విధంగానే రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రజాభవన్‌లో తొలి ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల ఆర్జీలను స్వీకరించి, వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


ప్రజాదర్బార్‌కు తెల్లవారుజాము నుంచే ప్రజలు క్యూ కట్టడంతో ప్రజాభవన్ లోపలి నుంచి రోడ్డు వరకు ప్రజల బారులు కనిపించాయి. వేలాది మంది తమ సమస్యలను సీఎంకు విన్నవించుకునేందుకు తరలిరాగా, ఎవరిని నిరుత్సాహపరుచకుండా వారి నుంచి ముందుగా సీఎం రేవంత్‌రెడ్డి, అనంతరం మంత్రి సీతక్క వినతులు స్వీకరించారు. రేవంత్‌రెడ్డి వెంట మంత్రి పొంగులేటి కూడా ఉన్నారు. ప్రజాభవన్‌కు ఎవరైనా రావచ్చని, ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం ప్రకటించిన నేపథ్యంలో అక్కడికి వచ్చిన ప్రజలు ప్రజాభవన్ లోపల ఎలా ఉంటుందన్న ఆసక్తితో అక్కడ కలియ తిరుగుతూ సెల్పీలు, ఫోటోలు తీసుకోవడంలో పోటీ పడ్డారు.

హెల్ప్ లైన్లతో క్రమబద్ధీకరణ

వేలమంది తమ సమస్యలను సీఎంకు ఏకరువు పెట్టుకునేందుకు తరలిరావడంతో ప్రజాభవన్‌లో అధికారులు హెల్ప్‌లైన్ డెస్క్‌లు ఏర్పాటు చేసి, ప్రజల ఆర్జీల వివరాలను నమోదు చేశారు. ఆ తర్వాత క్యూలైన్లలో వరుసగా లోపలికి పంపించారు. మొదట దివ్యాంగుల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్జీల రిజిస్ట్రేషన్లకు మొత్తం 15 హెల్ప్‌లైన్‌ డెస్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ప్రతి ఆర్జీకి ప్రత్యేక గ్రీవెన్స్ నంబర్‌, ప్రింటెడ్ ఎకనాలెడ్జిమెంట్ ఇచ్చే ఏర్పాటు చేశారు. ప్రజాదర్బార్ లోపల కూర్చోవడానికి 320 సీట్లను ఏర్పాటు చేశారు. బయట కూడా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎండ నుంచి రక్షణకై క్యూలైన్ల పైన నీడ కల్పించారు. ద్వారాల వద్ద నిలుచున్న వారికి, ప్రజాదర్బార్‌లోకి వచ్చిన ప్రజలకు తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు. హైదరాబాద్ నగరం నుండే కాకుండా వివిధ జిల్లాల నుంచి విజ్ఞాపనలతో వచ్చిన ప్రజలతో ప్రజాదర్బార్ కిక్కిరిసింది.

కొండపోచమ్మ ముంపు బాధితుల రాక

ప్ర‌జాదర్బార్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కొండపోచమ్మ రిజర్వాయర్‌ ముంపు బాధితులు క‌లిశారు. ఇప్పటి వరకు తమకు నష్టపరిహారం అందలేదని సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన రేవంత్ వారికి న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

ప్రజాదర్బార్ అర్జీలకు ప్రత్యేక అధికారులు

ప్రజాదర్బార్‌లలో అర్జీల స్వీకరణ, పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికార యంత్రాంగాన్ని నియమించింది. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించేందుకు 20 మంది సిబ్బందిని నియ‌మించారు. వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖ అధికారులకు సీఎం ఎండార్స్‌తో సిఫారసు చేశారు. ప్రతీ నెల వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై తిరిగి స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవిగుప్తా, జలమండలి ఎండీ దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, ముషార్రాఫ్ తదితర అధికారులు ప్రజాదర్బార్ నిర్వహణను సమన్వయం చేశారు.

వినతుల వెల్లువ.. బాధితుల ఆశా వేదిక

సీఎం రేవంత్‌రెడ్డి చేపట్టిన ప్రజాదర్బార్‌కు తమ సమస్యల అర్జీలతో జనం పోటెత్తడం చూస్తే ఇంతకాలంగా వారి సమస్యల పరిష్కారానికి సరైన వేదిక కరువైందన్న కఠిన వాస్తవం వెలుగులోకి వచ్చినట్టయింది. ఇటువంటివారికి ప్రజాదర్బార్ ఆశా వేదికగా మారనుందని భావిస్తున్నారు. తొలి ప్రజాదర్బార్‌లో వచ్చిన అర్జీలలో ఎక్కువగా భూ సమస్యలపైన రావడం.. అందులో కూడా ధరణి బాధిత సమస్యలపైనే ఎక్కువగా రావడం గమనార్హం. అలాగే ఇండ్లు, రేషన్ కార్డులు, ఉద్యోగాలు, పింఛన్లు కావాలని కూడా భారీగానే వినతులు అందించారు. ఎక్కువగా ఐదు నుంచి పదేళ్ల సమయంలో కూడా తమ సమస్యలు పరిష్కరించబడటం లేదని, అందుకే సీఎం వద్దనైనా తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో వచ్చామని బాధిత ప్రజలు చెప్పడం కనిపించింది. నిజానికి మండల, డివిజన్‌, కలెక్టరేట్ స్థాయిలలో ఇప్పటికే గ్రీవెన్స్ సెల్‌లు నడుస్తున్నప్పటికీ అవి నామమాత్రంగా మారాయన్న విమర్శలు ఉన్నాయి.



 



ఈ నేపథ్యంలోనే జనం సమస్యలు మరింత అధికమయ్యాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బీఆరెస్ ప్రభుత్వంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎమ్మెల్యేలు, మంత్రులు, మరీ ముఖ్యమైనవైతే కేసీఆర్ కుటుంబ సభ్యులు, వారు నియమించిన అధికారుల ఆదేశాల మేరకే నడుచుకోవాల్సి వచ్చేదని పలువురు మాజీ అధికారులు తెలిపారు. వారు కూడా తమ స్థాయిల్లోని సమస్యలపై కూడా స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు ఉండేవని వివరించారు. ఆ పరిస్థితుల్లో మంత్రులను, సీఎంలను కలిసి తమ గోడు చెప్పుకుందామనుకున్నా వారిని కలవడం పదేళ్లుగా సామాన్యులకు సాధ్యపడలేదు. ఈ కారణంగానే ఇప్పుడు ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్‌కు భారీ స్థాయిలో బాధిత ప్రజలు రావడం జరుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తున్నది.

పేరుకుపోయిన సమస్యలకు నిదర్శనం

ప్రజాదర్బార్‌కు జనం వేలల్లో వచ్చిన తీరు చూస్తే క్షేత్ర స్థాయిలో పేరుకుపోయిన ప్రజా సమస్యలకు నిదర్శనమంటున్నారు. ఎన్నికల ప్రచారంలో, పలు ఇంటర్వ్యూలలో అప్పటి మంత్రి కేటీఆర్‌ ముఖ్యమంత్రి ప్రజలను కలవకపోవడాన్ని సమర్థించుకున్న సంగతి తెలిసిందే. పాలన వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తుంటే ఇంకా సీఎంను కలువడం ఎందుకని ఎదురు ప్రశ్నించారు. ఆ బడాయి వ్యాఖ్యల డొల్లతనాన్ని ప్రజాదర్బార్‌కు హాజరైన జన సంఖ్య వెల్లడిస్తున్నదని పలువురు జర్నలిస్టులు వ్యాఖ్యానించారు. పాలన వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్నది పర్యవేక్షించాల్సిన పాలకులు అంతా బాగుందంటూ బుకాయింపు.. దబాయింపు వైఖరితో ఎన్నికలకు వెళితే నిన్నటి ఎన్నికల ఫలితాలే ఎదురవ్వక తప్పదన్నది నిర్వివాదంశం.