ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
జిల్లా అధికారులు ‘ప్రజావాణి’ కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ఎప్పటికప్పుడు అర్జీలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు

విధాత ప్రతినిధి, పెద్దపల్లి: జిల్లా అధికారులు ‘ప్రజావాణి’ కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ఎప్పటికప్పుడు అర్జీలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, ఆర్డీఓ సీహెచ్ మధుసూధన్లతో కలిసి కలెక్టర్ ప్రజల అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి హాజరుకాని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి శాఖ తమ అంతర్గత సమావేశాలు నిర్వహించుకొని, ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిష్కారం కాని పక్షంలో దానికి కారణాలు తెలియజేస్తూ సమాధానం అందించాలని, అనవసరంగా ప్రజలను తిప్పుకోవద్దని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి బుధవారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో అధికారులు పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని, భోజన నాణ్యతపై నివేదిక అందించాలని తెలిపారు.
వినతుల వెల్లువ
ప్రజావాణి కార్యక్రమంలో వినతులు వెల్లువెత్తాయి. రామగుండం మండలం జనగామ గ్రామానికి చెందిన కావటి సాగర్ దరఖాస్తుసమర్పిస్తూ, గోదావరి నదీ జలాల ముంపుతో సాగు భూములు కోల్పోయామని, నష్టపరిహారం అందించాలని కోరారు. రామగుండం మండలం గోదావరిఖకి చెందిన అర్ణకొండ అంజయ్య అర్జీ ఇస్తూ.. కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తన కొడుకు మోసగించి, బెదిరించాడన్నారు. తన వద్ద ఉన్న బంగారం, ఆస్తిని బదలాయించుకున్నారని, న్యాయం చేయాలని కోరారు. సుల్తానాబాద్ మండలం గట్టేపల్లికి చెందిన పసుల మల్లయ్య తన ఫిర్యాదులో.. భూమి పంపిణీ నిమిత్తం కుమారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తనకు తెలియకుండా భూమిని అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ముందు చేసిన రిజిస్ట్రేషన్ రద్దుచేసి 8 ఎకరాల భూమిని తన పేరుపై వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.