బీఆరెస్ పాలనలో మహిళలకు కరవైన రక్షణ: రేణుకా చౌదరి ధ్వజం

మహిళాభ్యున్నతి కాంగ్రెస్‌తోనే సాధ్యం
విధాత: సీఎం కేసీఆర్ బీఆరెస్ ప్రభుత్వ పాలనలో మహిళలు, బాలికలకు రక్షణ లేదని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి విమర్శించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలలో నియోజకవర్గాల ప్రదక్షిణ చేస్తూ చేతులెత్తి మహిళల ఓట్లు అడుక్కుంటున్నారని, మహిళలకు ఏం చేశారని మీకు ఓట్లు వేయాలంటూ రేణుకా చౌదరి ప్రశ్నించారు. చట్టలకు విరుద్ధంగా 18 ఏళ్ళ లోపు అమ్మాయిలకు వివాహాలు జరుగుతున్నాయని, బాలికలకు విద్య దూరమైందని, అత్యాచారాలు పెరిగిపోయాయని, కేజీ టూ పీజీ విద్య అమలు కాలేదని విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఒక్కరే బాగుపడ్డారని, మొదటి కేబినెట్‌లో కేసీఆర్ మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు.
అత్యాచారాలు చేసిన వారికి బీఆరెస్ నేతలే అండగా ఉంటున్నారన్నారు. తెలంగాణ పదం ఉచ్చరించే నైతికత ఇప్పుడు కేసీఆర్‌కు లేదని, ఆయన పార్టీ పేరులోని తెలంగాణ పదం కూడా తొలగించుకున్నారన్నారు. రాష్ట్రంలో 42శాతం మంది మహిళలు వేలముద్రలకే పరిమితమవ్వడం సిగ్గుచేటు కాదా అని, హైటెక్కుల ముచ్చట్లు చెప్పే కేటీఆర్ మహిళా అక్షరాస్యతపై ఏం టెక్కులు చెబుతారంటూ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపిల్లల చదువులకు విద్యాహక్కు చట్టం తెచ్చిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ తల్లి లేదని, బంగారం లేదని, పుట్టబోయే ఆడబిడ్డ మీద 5 లక్షలు అప్పు ఉందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఇతర రాష్ట్ర రైతులకు డబులిచ్చిన కేసీఆర్ తెలంగాణ మహిళా రైతులకు పైసా ఇవ్వలేదన్నారు. భర్త చనిపోయిన మహిళలకి పావలా వడ్డీ ఎటుపోయిందన్నారు.
బతుకమ్మలకు బొంతకు పనికిరాని చీరలు పంచి మోసం చేశారన్నారు. నిత్యావసర వస్తువులు ధరలు, గ్యాస్ ధర పెరగడంతో మహిళలు ఇబ్బందిపడుతున్నారన్నారు. మహిళలను అన్ని విధాలా మోసం చేసిన మీకు ఓటు వెయ్యాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళాభ్యున్నతికి 18 సంవత్సరాలనుండి ఓటు హక్కు కల్పించిందని, స్థానిక సంస్థల్లో 33 శాతం ఉన్న మహిళా రిజర్వేషన్ ను 50 శాతానికి కాంగ్రెస్ పెంచిందన్నారు. తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మా మహిళల గాజులు విష్ణుచక్రాలుగా మారి కేసీఆర్ పాలన అంతం చేసి కాంగ్రెస్ పాలన తెస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు లో కమ్మ , బీసీ సామజిక వర్గాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సివుందన్నారు.