Warangal Congress Politics | మీటింగు, మీటింగే.. గ్రూపులు, గ్రూపులే! ఇదీ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కథ

మీటింగ్, మీటింగే.. గ్రూపులు, గ్రూపులే అన్నట్టు ఉంది వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి. ‘కలిసి మెలిసి సాగి, ఐక్యతను ప్రదర్శించి ప్రజలకు భరోసా ఇవ్వండి. వారిలో నమ్మకాన్ని పెంపొందించండి’ అంటూ పార్టీ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ పదే పదే కోరుతున్నా.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నేతలు మాత్రం ససేమిరా అంటున్నారు. గ్రూపు రాజకీయాలను వదల బొమ్మాళీ అంటున్నారు.

Warangal Congress Politics | మీటింగు, మీటింగే.. గ్రూపులు, గ్రూపులే! ఇదీ వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కథ

విధాత ప్రత్యేక ప్రతినిధి:

Warangal Congress Politics | సోమ, మంగళవారాల్లో వర్ధన్నపేటలో జనహిత పాదయాత్ర కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది. దీనికి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేహ్‌ గౌడ్‌ హాజరవుతున్నారు. ప్రజల్లో విశ్వాన్ని పెంపొందిస్తూ క్షేత్రస్థాయిలో వారి అభిప్రాయాలు ఎలాఉన్నాయో తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీన్ని అసరా చేసుకుని పార్టీలో ఉన్న గ్రూపుల లీడర్లు తమ ఆధిపత్యాన్ని కనబరిచేందుకు, బలాన్ని చాటేందుకు ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. తమ పలుకుబడిన అధిష్ఠానం వద్ద చూపెట్టేందుకు జరిగే ఈ పోటీతో ఇప్పటికే నాయకుల మధ్య నెలకొన్న వైషమ్యాలు మరింత ముదిరి కొత్తగా ఏ సమస్యకు దారి తీస్తుందోనన్న ఆందోళన పార్టీ క్యాడర్‌లో వ్యక్తమవుతున్నది.

ఇప్పటికే మంత్రి కొండా సురేఖ వర్సెస్ జిల్లా ఎమ్మెల్యేలు అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. ఆదివారం సమీక్షా సమావేశానికి సురేఖ– కొండా వర్గం దూరంగా ఉంది. ఇదిలా ఉండగా సోమ, మంగళవారాల్లో జరిగే ఈ జనహిత పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ శ్రేణులు పాల్గొనాలని కొండా మురళి పిలుపు నివ్వడం గమనార్హం. ఉమ్మడి కార్యాచరణకు దూరంగా ఉంటూ తాముగా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు భావిస్తున్నారు. దీంతో నాయకుల మధ్య పోటీపెరిగి ఏ పరిస్థితి ఉత్పన్నమవుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. అసలే జిందాబాద్, ముర్దాబాద్లకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర ముగింపు ఎలా జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. మీనాక్షి హాజరవుతున్నందున మంత్రి కొండా సురేఖ, కొండా మురళి పాల్గొంటారా? తమ అనుచరులను పంపించి, వారు దూరంగా ఉంటారా? అనే చర్చ సాగుతోంది. ఇంచార్జ్, పీసీసీ అధ్యక్షులు పాల్గొనే కార్యక్రమం కావడంతో పాల్గొనే అవకాశం ఉందంటున్నారు.