ధరణికి ప్రత్యామ్నాయం కొత్త చట్టమే! దరఖాస్తుకు ఆప్షన్ లేని సమస్యలు ఎన్నో!

ధరణి తెచ్చిన దరిద్రం అంతా ఇంతా కాదు.. ముట్టుకుంటే చాలు సమస్యలు కందిరీగల్లా తగులుకుంటున్నాయి. ధరణి స్థానంతో కొత్త చట్టం వస్తే తప్ప రైతుల భూ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు.

ధరణికి ప్రత్యామ్నాయం కొత్త చట్టమే! దరఖాస్తుకు ఆప్షన్ లేని సమస్యలు ఎన్నో!

క్షేత్రస్థాయి పకడ్బందీ వ్యవస్థతోనే పరిష్కారాలు
అవగాహన కలిగిన వీఆర్వో స్థానికంగా ఉండాలి
ఆయనపై పైస్థాయిలో అజమాయిషీ ఉండాలి
గ్రామాల్లోనే పరిష్కారం కావాలంటున్న రైతులు
ధరణి వెబ్‌ పోర్టల్‌లో భూ సమస్యలు 25 లక్షలు
ఒక్కో ఊరిలో 200 పైగానే వేర్వేరు సమస్యలు
దరఖాస్తుకు ఆప్షన్ లేని సమస్యలు ఎన్నో

విధాత: ధరణి తెచ్చిన దరిద్రం అంతా ఇంతా కాదు.. ముట్టుకుంటే చాలు సమస్యలు కందిరీగల్లా తగులుకుంటున్నాయి. ధరణి స్థానంతో కొత్త చట్టం వస్తే తప్ప రైతుల భూ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. ధరణిలో 33 రకాల మాడ్యూల్స్‌ ఉన్నాయి. అవి ఒక్కొక్కటి ఒక్కో తరహా సమస్యకు ఉద్దేశించారు. అయితే.. ఈ 33 రకాల సమస్యల కంటే మించిన సంఖ్యలో సమస్యలు కనిపిస్తున్నాయి. వాటికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా ధరణిలో ఆప్షన్‌ లేదు. దీంతో ఏంచేయాలో పాలుపోని ప్రజలు నిత్యం తాసిల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతున్నా.. వాటిని పరిష్కరించే అధికారం తమకు లేదంటూ తాసిల్దార్లు చేతులెత్తేస్తున్నారు. కొంత మంది అధికారులు సివిల్ కోర్టులు ఆదేశిస్తే తాము ఏమైనా చేయగలమని ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీనంతటికీ 2020లో కేసీఆర్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్వోఆర్‌ సవరణ చట్టం (ధరణి) ప్రధాన సమస్యగా తయారైంది.
రెవెన్యూ అధికారులు సమస్యలు పరిష్కరించలేకవడం, అనేక సమస్యలకు ధరణిలో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకపోవడంతో రాష్ట్రంలో దాదాపు 25 లక్షలకు పైగా సమస్యలు పడి ఉన్నాయని ఒక అంచనా. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిననాటికి ధరణిలో 2.60 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పరిష్కరించే క్రమంలో అదనంగా మరో 60 వేల దరఖాస్తులు వచ్చాయని ధరణి లోపాలపై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు కోదండరెడ్డి తెలిపారు. ధరణిలో దరఖాస్తులకు అవకాశం లేనివి, రైతులకు ఏమి చేయాలో తెలియక అలాగే ఉండి పోయిన సమస్యలు గ్రామానికి 200 పైచిలుకు ఉంటాయని తమ పరిశీలనతో తేలినట్లు ధరణి కమిటీ సభ్యుడు, ఉచిత న్యాయ శిబిరం సృష్టికర్త, లీఫ్ సంస్థ వ్యవస్థాపకుడు భూమి సునీల్ తెలిపారు.
ధరణి పోర్టల్ ఉనికిలోకి వచ్చిన తరువాత భూమి సంబంధమైన అనేక సమస్యలు ముందుకు వచ్చాయి. వాటి పరిష్కారం కోసం దాదాపు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 70శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టు తెలుస్తున్నది. అధికారులు సమస్యలను పరిష్కరించడం కంటే.. తిరస్కరించడంపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ధరణిలో దరఖాస్తుకు నోచుకోని సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. లీఫ్ సంస్థ కేవలం 10 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేపడితే 2200 సమస్యలు వచ్చాయి. కానీ ధరణిలో దరఖాస్తు చేసినవి 400 మాత్రమే. ఈ లెక్కన ధరణిలో ధరఖాస్తు లేనివే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో అనేక భూమి సమస్యల పరిష్కారం కోసం ధరణిలో ఆర్జీ పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా లేని పరిస్థితి. ముఖ్యంగా అసైన్డ్‌ భూములకు సంబంధించి.. అసైనీ చనిపోతే అతని వారసులకు ఫౌతి చేసి, కొత్త పాస్‌బుక్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. కొత్త పాస్‌బుక్‌లు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూమి ఉంటే 15 లక్షల ఎకరాల భూములకు సమస్యలున్నాయని న్యాయనిపుణులు చెపుతున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములు ముఖ్యంగా భూదాన్, ఇనామ్, సీలింగ్ పట్టా, ఓఆర్సీ, 38(ఇ) రక్షిత కౌలుదారు, 13(బి) సర్టిఫికెట్ ఉన్న రైతులు కూడా ధరణిలో కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేదు.

అలాగే భూ సేకరణలో ఒక సర్వే నెంబర్‌లో కొంత భూమి పొతే మొత్తం సర్వే నెంబర్‌ను నిషేధిత జాబితాలో పెట్టడం సహా దేవాదాయ, వక్ఫ్, భూదాన్, ఫారెస్ట్ సరిహద్దుల వివాదాలున్న 15 లక్షల ఎకరాల భూమి సమస్యలు అలాగే పెండింగ్ లో ఉన్నాయి. వీటిని ధరణిలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు. వీటితోపాటు సేత్వార్ మిస్ మ్యాచ్ (ఆర్ఎస్ఆర్) సర్వే నెంబర్ మిస్సింగ్ సమస్యలున్నాయి. చాలా మంది రైతులకు పాత పట్టాదార్ పాస్ పుస్తకాలున్నాయి. పాత పట్టాదార్ పాస్ పుస్తకాల్లో ఉన్న భూమి విస్తీర్ణానికి కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల్లో ఉన్న విస్తీర్ణానికి చాలా తేడాలున్నాయి. ఇవి కాకుండా మరో 18 లక్షల ఎకరాల భూమిని పార్ట్(బి)లో చేర్చారు. ఇందులో 5 లక్షల ఎకరాల భూమికి ఎలాంటి కారణాలు కూడా చూపించక పోవడం గమనార్హం. మిగిలిన 13 లక్షల ఎకరాల భూమిలో ఆధార్ నెంబర్ లేదని ఆరు లక్షల ఎకరాల భూమిని పార్ట్(బి)లో చేర్చారు. ఇందులో నాలుగు లక్షల మంది రైతులు తమ ఆధార్ నెంబర్ ఇవ్వలేదని బీఆరెస్ ప్రభుత్వం పార్ట్(బి)లో పెట్టింది. ఇలా ప్రభుత్వం దాదాపు 60 లక్షల ఎకరాల భూమిని వివిధ కారణాలతో నిషేధిత జాబితో ఉంచింది. ఫలితంగా నిజంగా భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు రైతు బంధు కూడా అందని విచిత్ర పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది.

భూమి సమస్యల పరిష్కారం కోసం 20 ఏళ్లలో అనేక ప్రయత్నాలు జరిగాయి కానీ, ధరణి వచ్చిన తరువాత భూమి సమస్యలు ఇంకా ఎక్కువగా పెరిగాయి.. 2006లో రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వెళ్లి రికార్డులు పరిశీలించారు. పాస్ పుస్తకాలపై యూనికోడ్ నెంబర్ ఇచ్చారు. 200711లో ప్రతి మండలంలో 3 గ్రామాలను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకొని పారాలీగల్ టీమ్‌లు అక్కడే ఉండి సమస్యలను గుర్తించి పరిష్కరించే ప్రయత్నం చేశాయి. 2009-10 మధ్యలో ఎన్జీవోల సహాయంతో పారాలీగల్ టీమ్‌లు కలిసి ఎస్సీ, ఎస్టీల భూములపై ఇంటింటికీ తిరిగి ఇన్సెంట్రా నిర్వహించారు. అప్పట్లో దాదాపు 5 లక్షల భూమి సమస్యలు గుర్తించి, పరిష్కరించి 7 లక్షల ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారు. 2011-12లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి 21 లక్షల భూమి సమస్యలను పరిష్కరించారు. 2017లో బీఆరెస్ ప్రభుత్వం ఎల్ఆర్‌యూపీ తీసుకొచ్చింది. కానీ ధరణితో సమస్యలు జటిలం అయ్యాయి. మరోవైపు న్యాయసేవల పేరుతో నల్సార్ యూనివర్సిటీ, ప్రభుత్వం సహకారంతో గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 8 గ్రామాలలో అధ్యయనం చేసి రైతుల భూమి సమస్యలు పరిష్కరించారు. తాజాగా రంగారెడ్డి జిల్లా యాచారం మండంలో లీఫ్ సంస్థ సమస్యలను అధ్యయనం చేసింది.
ఇలా వివిధ సందర్భాలలో రైతుల సమస్యల పరిశీలన,పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలు పరిశీలిస్తే, గ్రామ, మండల స్థాయిలో రైతుల భూమి సమస్యలను పరిష్కరించే వ్యవస్థ రావాలన్న అభిప్రాయం సర్వత్రా వెలువడుతోంది. గ్రామాల్లో రైతులు తమ ఊర్లోనే రికార్డులను పరిశీలించి సరి చేసే అధికారి రావాలని కోరుతున్నారు. తాము మహా అంటే మండల కేంద్రానికి వెళతాము కానీ కలెక్టర్ వద్దకు వెళ్లే పరిస్థితి తమకు ఉండదని అంటున్నారు. ఇప్పడు గ్రామాల్లోకి వచ్చే అధికారి కనిపించడం లేదని చెబుతున్నారు. భూమి సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వీఆర్వో స్థానికంగానే ఉంటూ సమస్యలు పరిష్కరించే వ్యవస్థ కావాలని కోరుతున్నారు. మొత్తంగా మండలంలో తాసిల్దారే తమ భూమి సమస్యను పరిష్కరించే విధంగా కొత్త చట్టం తీసుకు రావాలన్న డిమాండ్ అన్ని గ్రామాల్లో రైతుల నుంచి వస్తోంది. ప్రస్తుతం ఉన్న చట్టం కోర్టుకు వెళ్లమంటోంది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదివరకే ప్రకటించినట్లుగా ధరణిని బంగాళాఖాతంలో కలిపి, రైతులకు గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా కొత్త చట్టం తీసుకురావాలని కోరుతున్నారు. కొత్త చట్టం వస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు అంటున్నారు.