బంగాళాఖాతంలోకే ధరణి పోర్టల్?
రైతన్నలను వేధిస్తున్న ధరణి పోర్టల్‌ను తాము అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలోకి విసిరేస్తామన్న హామీని

- చట్ట సవరణకు సర్కార్ కసరత్తు!
- త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు
- అధికారాల వికేంద్రీకరణ దిశగా చర్యలు
- ఫైళ్లను సిద్ధం చేస్తున్న అధికారులు
- త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ వద్దకు!
- అమల్లోకి రానున్న ఎన్నికల హామీ
విధాత ప్రత్యేకం: రైతన్నలను వేధిస్తున్న ధరణి పోర్టల్‌ను తాము అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలోకి విసిరేస్తామన్న హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. రైతులు ఎదుర్కొంటున్న భూమి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మార్గాలను అన్వేషించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.
ధరణిలో జరిగిన అక్రమాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీసీఎల్‌ఏను సైతం ఆదేశించారు. ధరణి వచ్చిన తరువాత ఏర్పడిన భూమి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా నిర్ణయం తీసుకోనున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రెవెన్యూ అధికారులతో పాటు భూమి సమస్యల పరిష్కారంపై కేంద్రీకరించి పనిచేస్తున్న రైతు ప్రతినిధులు, అడ్వకేట్ భూమి సునీల్ తదితరులతో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల సచివాలయంలో సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే.
ఈ సమావేశంలోనే ధరణిలో జరిగిన అక్రమాలు, పేరుకుపోయిన సమస్యలు, వాటిని ఎందుకు పరిష్కరించలేకపోయారో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరో వైపు ధరణి నిర్వహణ కూడా సందేహాలు వ్యక్తం చేశారు. ధరణి నిర్వహణ ప్రైవేట్‌కు ఎందుకు అప్పగించారు? దీని వల్ల రైతుల భూమి డాటాకు భద్రత ఎంత? అని సందేహాలు వ్యక్తం చేశారు. వీటన్నింటిపై నివేదిక అడిగిన రేవంత్ రెడ్డి, పరిష్కారాలకు మార్గాలు కూడా చూపించాలని కోరినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్నల ఆధారంగా పరిష్కరాల మార్గాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిసింది.
కలెక్టర్ల వద్ద అధికారాలే సమస్యలకు మూలం!
ధరణిలో సమస్యలు పేరుకు పోవడానికి ప్రధానంగా అధికారాలు కలెక్టర్ వద్ద కేంద్రీకరించడమే కారణమన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించినట్లు తెలిసింది. అధికారాలను వికేంద్రీకరిస్తేనే రైతుల సమస్యలు సులువుగా పరిష్కరించడానికి వీలవుతుందని భావిస్తున్నారు. రైతులకు ఎమ్మార్వో స్థాయిలోనే భూమి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని సమాచారం.
సాధారణ సమస్యలైతే రైతులు ఎమ్మార్వో వద్దే పరిష్కరించుకునేలా నిర్ణయం ఉండబోతున్నదని తెలుస్తున్నది. క్లిష్టమైన సమస్యలైతే ఆర్డీవో వద్ద పరిష్కరించే వెసులుబాటు కల్పించనున్నారని సమాచారం. అధికారాలను వికేంద్రీకరించాలంటే ధరణి ఏర్పాటు కోసం తీసుకువచ్చిన ఆర్వోఆర్ సవరణ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఈ మేరకు చట్ట సవరణ చేయాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది.
సమగ్ర అధ్యయనానికి కమిటీ
ధరణి వల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారం, భూవివాదాలు లేని వ్యవస్థ ఏర్పాటు కోసం భూమాత పోర్టల్ ఏర్పాటు తదితర అంశాలన్నింటిపై సమగ్ర అద్యయనం చేయడం కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని వేసే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సర్కారుకు నివేదిక ఇస్తుందని, ఆ తరువాతనే ధరణిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెపుతున్నాయి.
పాత పద్ధతిలోనే అధికారాలు
తాసిల్దార్లకు పాత పద్ధతిలో అధికారాలు పునరుద్ధరిస్తేనే మంచిదన్న అభిప్రాయంతో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగానే ట్రిబ్యునళ్లను పునరుద్ధరించాలా? రెవెన్యూ కోర్టులు పునరుద్ధరించాలా? ఏది చేస్తే రైతులకు, భూ యజమానులకు ఉపయోగంగా ఉంటుందన్న దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ధరణిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా చట్ట సవరణ చే యాలన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. చట్ట సవరణ జరిగితేనే అన్ని ముందుకు వెళతాయని న్యాయ నిపుణులు అంటున్నారు.
ధరణితో కొత్త చిక్కులు
రాష్ట్రంలో ధరణి పోర్టల్ వచ్చిన తరువాత భూమి క్రయవిక్రయాలు మినహాయిస్తే… అనేక సమస్యలు కొత్తగా ఏర్పడ్డాయి. ధరణిలో దొర్లిన తప్పులతోనే రైతులంతా ఇబ్బందులు పడుతున్నారు. ధరణి పోర్టల్ విషయంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో చెప్పిన మాటలకు, జరుగుతున్న దానికి పొంతన లేకుండా పోయింది.
కొన్ని అంశాలను పరిశీలిస్తే..
– ధరణి పోర్టల్ రాక ముందు రిజిస్ట్రేషన్ అయిన భూములను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ఆధారంగా కొన్నవారి పేరిట జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మ్యుటేషన్ చేయాలి. దీనికోసం మీ సేవ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తులు స్వీకరించి, ప్లాట్లు, కేటాయించాలి. ధరణి రాకకు ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి పేర్ల మీదకు రికార్డులు ఇంకా మారలేదు. తమ పేరు మీదకు మార్చాలని దరఖాస్తు పెట్టుకుంటే కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. చాలా వరకు తిరస్కరణకు గురవుతున్నాయి. పాత పట్టదారుడు వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధనలే అందుకు కారణం.
– సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి. క్రమబద్ధీకరించిన సాదాబైనామాల ప్రకారం భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలి. పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వాలి. కానీ సాదా బైనామాల ముచ్చటనే పట్టించుకోలేదు.
– కోర్టుల విచారణలో ఉన్నవి మినహా, భూ రికార్డుల సమగ్ర సర్వే సందర్భంగా పార్ట్-బీలో పెట్టిన వ్యవసాయ భూములకు సంబంధించిన అంశాలన్నింటినీ కలెక్టర్లు 60 రోజుల్లో పరిష్కరించాలి. అవసరమైన సందర్భాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవాలి. యాజమాన్య హక్కులను ఖరారు చేయాలి. కానీ వేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే సమయం కలెక్టర్లకు లేదు. డాష్ బోర్డును ఖాళీ చేసుకునే ఉద్దేశంతో.. కారణం చెప్పకుండానే దరఖాస్తులు తిరస్కరించి చేతులు దులుపుకొంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ధరణిలో సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులు దాదాపు 18 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం.
– కొన్నిచోట్ల ఒకే సర్వే నంబరులో ప్రభుత్వ, ప్రైవేటు భూములున్నాయి. ఆ సర్వే నంబరును నిషేధిత జాబితా (22/ఏ)లో పెట్టారు. అలా పెట్టిన చోట్ల కలెక్టర్లు విచారణ జరిపి, ఏది ప్రభుత్వ భూమి? ఏది ప్రైవేటు భూమి? అనేది నిర్ణయించాలి. అర్హుల వివరాలను ధరణిలో చేర్చి, పాస్ పుస్తకాలు ఇవ్వాలి. కానీ నిషేధిత భూముల జాబితాలకు పట్టా భూములు చేరాయనే ఫిర్యాదులు వేల సంఖ్యలో వచ్చాయి. రైతులు ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా వీటిని పరిష్కరించడం లేదు.
– అసైన్ భూములను అనుభవిస్తున్న రైతులు మరణిస్తే, వారి చట్టబద్ధ వారసులకు ఆ భూములను బదలాయించాలి. కానీ ఇందుకు విరుద్ధంగా.. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న అసైన్‌మెంట్ భూములు ఇప్పుడు ప్రభుత్వ భూములుగా ధరణిలో కనిపిస్తున్నాయి. తమ పేర్ల మీదకు వాటిని మార్చాలని చేసుకుంటున్న దరఖాస్తులు వృథానే తప్ప పరిష్కారం కావడం లేదు.
– ఇనాం భూములను సాగు చేసుకుంటున్న హక్కుదారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇచ్చి, ఆ వివరాలను ధరణిలో నమోదు చేయాలి. కానీ ధరణి వచ్చిన తర్వాత అసలు ఇనాం భూముల గురించి ప్రభుత్వం ఆలోచించిన పాపాన పోలేదు.