ఎమ్మెల్యేలతో విభేదాలే పార్టీలో మార్పులు: గుత్తా

- కేసీఆర్ దే హ్యాట్రిక్ గెలుపు
- శాసన మండలి చైర్మన్ గుత్తా
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్థానిక ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాల కారణంగానే క్యాడర్ పార్టీని వీడుతున్నట్లు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం నల్గొండలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన నేపథ్యంలో పార్టీ మార్పులు సహజమన్నారు. రాష్ట్రం సుభిక్షంగా వుండాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానంలో ఉందని, దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు కేసీఆర్ నే నమ్ముతారని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు గెలిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలు మారుతున్న తరుణంలో తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేసేందుకు తాను, తన కుమారుడు అమిత్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మూడుసార్లు ఎంపీగా పోటీ చేసిన తనకు అన్ని నియోజకవర్గాల్లో సన్నిహితులు ఉన్నారని స్పష్టం చేశారు. ఇప్పుడు పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు ఘటనలో రాజకీయం చేయడం మంచిది కాదని, సాంకేతిక సమస్యలు అప్పుడప్పుడూ వస్తాయన్నారు.