డీకే అరుణ మేనకోడలికి కాంగ్రెస్ టికెట్

- రాజకీయాల్లోకి చిట్టెం వారసురాలు
- మద్దతు పలికిన మేనమామ శివకుమార్‌రెడ్డి
విధాత, ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రతినిధి: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మేనకోడలు చిట్టెం పర్ణికరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, ఆయన కుమారుడు వెంకటేశ్వర్‌రెడ్డి నక్సల్స్ దాడిలో చనిపోయిన విషయం తెలిసిందే. డీకే అరుణ.. నర్సిరెడ్డి కుమార్తె అన్న విషయం తెలిసిందే. ఆమె సోదరుడు వెంకటేశ్వర్‌రెడ్డి కుమార్తె పర్ణికరెడ్డి.
మరో విశేషం ఏమిటంటే.. నారాయణపేట టికెట్‌ను ఆశించిన కుంభం శివకుమార్‌రెడ్డికి కూడా ఆమె మేనకోడలే. వెంకటేశ్వర్‌రెడ్డి భార్య లక్ష్మి.. శివకుమార్‌రెడ్డికి స్వయానా చెల్లెలు. వెంకటేశ్వర్‌రెడ్డి మరణం తర్వాత ఆమెకు అప్పటి ప్రభుత్వం ఆర్డీవోగా ఉద్యోగం ఇచ్చింది.
అనంతరం ఆమె ఐఏఎస్ హోదా పొంది.. ప్రస్తుతం విధుల్లో ఉన్నారు. తాను టికెట్ ఆశించినా.. తన మేనకోడలికి టికెట్ రావడంతో కుంభం సైతం ఆమెకు మద్దతు పలికారు. ఇటు మక్తల్ నుంచి బీఆరెస్ తరఫున బరిలో చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి పర్ణికరెడ్డి స్వయానా తమ్ముడి కూతురు. అందులోనూ ఆమె పోటీ చేస్తున్నది కూడా పొరుగు నియోజకవర్గమే.
మొత్తానికి.. జిల్లా రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేసిన చిట్టెం నర్సిరెడ్డి కుటుంబంలో మరో తరం రాజకీయాల్లోకి వచ్చినట్టయింది. అందుకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. రాజకీయంగా అనుభవం లేకున్నా.. ఆమె కుటుంబానికి ఉన్న పట్టు, చిట్టెం నర్సిరెడ్డి రాజకీయ వారసత్వం నేపథ్యంలో ఆమెను నారాయణపేట అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసిందని భావిస్తున్నారు.