సీఎం రేవంత్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది
సీఎం రేవంత్‌రెడ్డి కూడా గత కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని, వ్యాపారస్తులను బ్లాక్

- వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేస్తూ వసూళ్ల దందా
- బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల తీవ్ర ఆరోపణలు
- మల్కాజిగిరిలో గెలుపుపై ధీమా
విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి కూడా గత కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని, వ్యాపారస్తులను బ్లాక్ మెయిల్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్‌లో ఆయన పార్టీ సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ఫోన్ టాపింగ్ చేస్తున్నారని విమర్శించిన మీరు కూడా ఫోన్ టాపింగ్ చేస్తున్నట్టు తెలుస్తోందని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఖబర్థార్ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఈటల హెచ్చరించారు. రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపించడానికి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను ఎంతగా వేదిస్తున్నది, ఎంత బ్లాక్ మెయిల్ చేస్తున్నది రికార్డ్ అవుతుందని, ఒక్క రాష్ట్రంలో ఉండి నేనే అన్నీ అనుకుంటున్నావని, నిన్ను వీక్షించే వారు కూడా ఉన్నారని మర్చిపోకు అని హెచ్చరించారు. రేవంత్ పిల్లి కళ్ళు మూసుకొని పాలుతాగినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈమధ్య కాలంలో నడమంత్రపు సిరిలాగా సీఎం పదవిలోకి వచ్చిన రేవంత్ నెలరోజుల్లోనే రెండు నాల్కలధోరణితో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ మా పెద్దన్న, ఆయన ఆశీర్వాదం ఉంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కొంపల్లి, అల్వాల్ ఫ్లై ఓవర్ కోసం 175 ఎకరాల రక్షణ రంగ భూమిని కేటాయించారని పొగిడిన సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ మాట మార్చి మోదీ ఎందీ ఆయనతో అయ్యేదేంది అని మాట్లడుతున్నారని, కేసీఆర్ కూడా అలానే మాట్లాడారని, ఆయనకు పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి నోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, అధికారం ఉందని ఏది పడితే అది మాట్లాడితే సహించడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.
మల్కాజిగిరిలో గెలుపు నాదే
మల్కాజిగిరిలో ఎవరు వచ్చిన ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టిన గెలిచేది బీజేపీనే అని ప్రజల ఆశీర్వాదం తమకే ఉంటుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరితో నాకు ఏం సంబంధం అని రేవంత్ రెడ్డి అంటున్నారని, నీకేం సంబంధమని గెలిపిస్తే అసలు ఇక్కడకి వచ్చావా? అని ఈటల నిలదీశారు. కళ్ళు నెత్తికి ఎక్కి మాట్లాడుతున్నాడని, రేవంత్‌కు ముందుంది మొసళ్ల పండగ అని, తురంఖాన్ అని విర్రవీగిన కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చెయ్యలేదని, నువ్వు 2 లక్షలు ఎలా చేయగలవని, మహిళలకు 2500 రూపాయల ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఒరిగేది ఏమీ లేదన్నారు. ఇక్కడ నాపై పోటీకి డబ్బులు ఉన్న వారికోసం వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు.
మోదీ పాలనలో పెరిగిన దేశ గౌరవం
ప్రజలు ఇచ్చిన అధికారం అడ్డుపెట్టుకొని ఆనాటి కాంగ్రెస్ పాలకులు ఎమర్జెన్సీ తీసుకువచ్చారని, అప్పుడు దేశం ఎంత వేదన అనుభవించింది అందరం చూసామని, మమ్ముల్ని ఎవరు ఓడగొట్టలేదు అనేది కాంగ్రెస్ అహంకారాన్ని ప్రజలు దెబ్బకొడితే దిమ్మతిరిగిందిని, ఆ తరువాత కేంద్రంలో అనేక సంకీర్ణ ప్రభుత్వాలు చూశామని చెప్పారు. యూపీఏ హయాంలో లక్షల కోట్ల కుంభకోణాలతో మంత్రులే జైలుకు పోయారని, మోదీ ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో ఒక్క స్కాం లేదని గుర్తు చేశారు. గ్రామాల్లో, పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ది కేంద్ర నిధులతో జరుగుతుందని, ఇప్పుడు అన్ని వస్తువులు మేడ్ ఇన్ ఇండియాగా వస్తున్నాయన్నారు. మోదీ పాలనలో దేశ ఆర్థిక స్థితి, ప్రపంచ దేశాల్లో భారత గౌరవం పెరిగిందన్నారు. జీఎస్‌టీ అమలు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని, 73 వేలకోట్ల రూపాయల ఆదాయం ఈరోజు 1 లక్ష 80 వేల కోట్లకు చేరుకుందని, డిజిటల్ పేమెంట్ కి అమెరికాలో 10 ఏళ్లు పడితే మనదేశంలో ముడేళ్లే పట్టిందన్నారు. దేశంలో కరోనా పేషంట్ దగ్గరికి వెళ్ళిన మొదటి మంత్రిని నేను అని, ధైర్యం నింపినమని, ప్రపంచానికి వాక్సిన్ అందించిన దేశం భారత్ అన్నారు. మోదీ గారికి 70 ఏళ్లు ఉన్నా ఆయన ఆలోచన 20 ఏళ్ళ యువకునిగా ఉందని, ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపి మన విద్యార్థులను తీసుకువచ్చిన ఘనత మోడీదేనన్నారు. అందుకే ఆయన్ని దేశ ప్రజలు ప్రేమిస్తున్నారని తెలిపారు. కంపుకొడుతున్న రైల్వే స్టేషన్ లు విమానాశ్రయాల మాదిరిగా అభివృద్ది చేస్తున్నారని, బడ్జెట్ లో 11.4 శాతం నిధులు మౌలికవసతుల కల్పించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం ఇచ్చిన దమ్మున్న నాయకుడు మోదీ అని, ఈ పదేళ్ళలో ఒక్క మంత్రి మీద కూడా అవినీతి ఆరోపణలు లేవని, రాజకీయాలు ఉంటాయి పోతాయి కానీ నీతి, విలువలు ముఖ్యమన్నారు. ప్రజలు స్వచ్చందంగా మల్కాజిగిరిలో మోదీ రోడ్ షోను విజయవంతం చేశారని, ఆ విషయం స్వయంగా మోదీగారే నాగర్ కర్నూల్ సభలో చెప్పారని ఈటల గుర్తు చేశారు.