Etela Rajender | కేసీఆర్ పాలనా నచ్చకనే కాంగ్రెస్‌ను తెచ్చుకున్నారు: ఈటల

సీఆర్ కుటుంబ, అవినీతి, నియంతృత్వ పాలన నచ్చని తెలంగాణ ప్రజలు గతి లేక కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని ఈటల రాజేందర్ విమర్శించారు.

Etela Rajender | కేసీఆర్ పాలనా నచ్చకనే కాంగ్రెస్‌ను తెచ్చుకున్నారు: ఈటల

తక్కువ కాలంలోనే కాంగ్రెస్‌పై ప్రజావ్యతిరేకత
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచార సభలో ఈటల రాజేందర్‌

విధాత: కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంతృత్వ పాలన నచ్చని తెలంగాణ ప్రజలు గతి లేక కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని, బుద్ధిగా పాలన సాగించాల్సిన కాంగ్రెస్ పాలకులు గతంలో మాదిరిగానే మళ్లీ వసూళ్లు..డాబు, దర్పాలకు పోతూ, ఇచ్చిన హామీలపై కప్పదాట్లు వేస్తూ తక్కువ కాలంలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కోంటున్నారని మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు.

ఆదివారం ఆయన వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లాలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ దౌర్జన్య పూరిత పాలనను ఎంతకాలం భరించాలోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. చీమలపుట్టలో పాములు చేరినట్టు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేక రాష్ట్రాన్ని మరింత ఆర్థిక సంక్షోభంలో నెట్టేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో బీఆరెస్ కాలం చెల్లిన పార్టీగా మారిందని, ఆ పార్టీపై ప్రజల్లో చర్చ సాగడం లేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు సైతం కాంగ్రెస్ అనేక హామీలిచ్చిందని, వాటితో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లే ప్రమాదముందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారన్నారు. అనేక స్కామ్‌లు, అవినీతి కార్యక్రమాలకు అలవాలమైన కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్లపాటు సగటు భారతీయుడు తలదించుకునే పాలనతో దేశాన్నిఅస్థిరపరిచిందని, అందుకే దేశ ప్రజలు ఆ పార్టీని చీ కొట్టారని చెప్పారు.

మోదీ పాలనతోనే దేశ ప్రగతి

ప్రధాని నరేంద్రమోదీ దేశంలో సంకీర్ణ, అస్థిర రాజకీయాలకు చరమగీతం పాడి సుస్థిరమైన, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశాన్ని ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా నిలిపారన్నారు. ప్రజల విశ్వాసాన్ని గౌరవిస్తూ రామ మందిరాన్ని నిర్మించి దేశానికి అంకితం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ అన్నారు. సామాజిక సమతుల్యాన్ని పాటించిన పార్టీ బీజేపీ అని పేర్కోన్నారు. 27 మంది ఓబీసీలు, 12 మంది దళిత, 8 మంది గిరిజన ఐదు మంది మైనారిటీ మంత్రులు ఉన్న ఏకైక క్యాబినెట్ నరేంద్ర మోడీ క్యాబినెట్ మాత్రమేనని గుర్తు చేశారు.

ఒక మహిళను ఆర్థిక మంత్రి చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదని, యూపీఏ చైర్ పర్సన్ గా సోనియా గాంధీ ఉన్న తర్వాత కూడా కాంగ్రెస్ మహిళా బిల్లును పెట్టలేకపోయిందని, దానిని అమలు చేసి చూపిస్తున్న నాయకుడు నరేంద్ర మోదీ అని తెలిపారు. 33% మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించిన బీజేపీకి, కాంగ్రెస్‌కు ఎక్కడా పోలిక లేదని ఎద్దేవా చేశారు. దేశ ప్రగతి లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారని, అధికార రాజకీయం కాకుండా ప్రజలు..దేశం ముఖ్యమనే రాజకీయాలతో ముందుకెలుతున్నారన్నారు. అందుకే మరోసారి ప్రధాని మోదీ కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మేధావులంతా కూడా ఆలోచించి బీజేపీకి మద్దతుగా నిర్ణయం తీసుకోవాలన్నారు.