కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సీఎం అనుమతి అవసరం లేదు: నాగేశ్వర్‌రావు

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సీఎం అనుమతి అవసరం లేదు: నాగేశ్వర్‌రావు

విధాత : సీఎం కేసీఆర్‌ అంగీకరిస్తే రెండు గంటల్లోనే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరుపుతుందంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి చేసిన ప్రకటనపై సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపొచ్చని.. సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి అవసరం లేదని కిషన్‌రెడ్డికి సూచించారు.


కేంద్ర జలశక్తి శాఖే సీబీఐ విచారణకు ఆదేశించవచ్చని తెలిపారు. కేంద్రానికి చెందిన 10 ఏజెన్సీలే కాళేశ్వరానికి అనుమతులిచ్చిందని వెల్లడించారు. అందుకే కేంద్రమే సీబీఐ విచారణ కోరవచ్చన్నారు. అవినీతి నిరోధక చట్టం 17ఏ ప్రకారం కేంద్ర జలశక్తి శాఖ సీబీఐ విచారణ కోరవచ్చన్నారు. సీబీఐ విచారణలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిందితులుగా తేలితే అప్పుడు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అవసరం ఉంటుందని నాగేశ్వరరావు వెల్లడించారు.


రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలో విచారణ చేపట్టరాదని సీఎం కేసీఆర్ ప్రభుత్వం చట్టం చేసిందని, అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనుమతిస్తే రెండు గంటల్లో సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశిస్తుందని ఇటీవల కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


దీనిపై సీబీఐ మాజీ డైరక్టర్‌ నాగేశ్వర్‌రావు స్పందన నేపధ్యంలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్నది వేచి చూడాల్సివుంది. తాజాగా ఎల్బీ స్టేడియం బీసీల సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ మేడిగడ్డ కుంగుబాటుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని నేపధ్యంలో కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశిస్తుందా అన్నది సందేహాంగానే ఉందని కాంగ్రెస్ వర్గాలు విమర్శిస్తున్నాయి.