గజ్వేల్ గజిని కేసీఆర్.. YS షర్మిల

విద్య, ఉద్యోగాలు లేకుండా చేసి తెలంగాణను వందేళ్లు వెనక్కి నెట్టిన కేసీఆర్ ఎన్నికల ముందో మాట ఎన్నికల తర్వాత మరో మాట విధాత:డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 64 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణవిముక్తి కల్పించారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించాలని మొట్టమొదటి ఆలోచన చేసిందే మన వైయస్ఆర్. రైతులు రాజు చేయాలనేదే వైయస్ఆర్ సంకల్పం. వైయస్ఆర్ రైతులకు పెట్టుబడి తగ్గించి,రాబడి పెంచేలా చేశారు. రైతులకు అన్ని విషయాల్లో అండగా ఉండి రైతు […]

గజ్వేల్ గజిని కేసీఆర్.. YS షర్మిల

విద్య, ఉద్యోగాలు లేకుండా చేసి తెలంగాణను వందేళ్లు వెనక్కి నెట్టిన కేసీఆర్
ఎన్నికల ముందో మాట ఎన్నికల తర్వాత మరో మాట

విధాత:డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఐదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 64 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణవిముక్తి కల్పించారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించాలని మొట్టమొదటి ఆలోచన చేసిందే మన వైయస్ఆర్. రైతులు రాజు చేయాలనేదే వైయస్ఆర్ సంకల్పం. వైయస్ఆర్ రైతులకు పెట్టుబడి తగ్గించి,రాబడి పెంచేలా చేశారు. రైతులకు అన్ని విషయాల్లో అండగా ఉండి రైతు బాంధవుడిగా పేరు తెచ్చున్నారు. ప్రతీ మహిళా లక్షాధికారి కావాలనే ఉద్దేశంతో పావులా వడ్డీకే రుణాలు ఇచ్చి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేశారు. దేశంలో ఎవరూ ఆలోచన చేయని విధంగా పేదింటి పిల్లలకు ఉచిత విద్య అందించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రవేశపెట్టి పేద విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యేలా చేశారు. ప్రపంచంలో ఎవరూ ఆలోచన చేయని విధంగా ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి, పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించారు.

108 సేవలు ప్రవేశపెట్టి, 20 నిమిషాల్లో ఇంటి వద్దకే అంబులెన్స్ వచ్చేలా చేశారు. రాష్ట్రంలోని 46లక్షల పేద కుటుంబాలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చారు. మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆదివాసీ, గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. ఐదేండ్లలో ఎలాంటి పన్నులు, ఇతర చార్జీలు పెంచకుండా పాలన సాగించారు. అన్ని సంక్షేమ పథకాలను అద్భుతంగా నడిపించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. ఐదేండ్ల కాలంలో నిరుద్యోగుల కోసం మూడు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇవే కాక ప్రైవేటు రంగంలో 11లక్షల ఉద్యోగాలను సృష్టించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్ లోన్లు అందించి స్వయం ఉపాధిని ప్రోత్సహించారు.

రుణమాఫీ పేరుతో దగా..

ఇప్పుడున్న కేసీఆర్ ఏడేండ్లుగా ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఏమీ సాధించలేకపోయారు. ఎన్నికల్లో గెలిపిస్తే 37లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి,మూడు లక్షల మందికి కూడా రుణమాఫీ చేయలేకపోయారు. రైతులు ఎప్పుడెప్పుతు తమ రుణాలు మాఫీ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. వడ్డీ కట్టలేక కొత్త అప్పులు కూడా బ్యాంకులు ఇవ్వడం లేదు. రైతుబంధు పేరుతో రూ.5వేలు ఇచ్చి రూ.10వేలు గుంజుకుంటూ రైతులను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో 15లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఎదురుచూస్తుంటే కేసీఆర్ కు చీమ కుట్టినట్లు కూడా లేదు.మరో 15లక్షల మంది పెన్షన్ కావాలని అప్లై చేసుకుంటే కనీసం పట్టింపు లేదు. 54లక్షల మంది తాము నిరుద్యోగులమని ప్రభుత్వానికి అప్లికేషన్లు పెట్టుకుంటే.. ఏండ్లు గడిచినా నోటిఫికేషన్లు వేయడం లేదు. నేడు నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటి. దీనికి కారణం ముఖ్యమంత్రి కేసీఆరే. రాష్ట్రంలో వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్ దున్నపోతు మీద వాన పడ్డట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగు పడతాయని యువత ఉద్యమిస్తే.. తెలంగాణ ఏర్పాడ్డాక యువతకు కేసీఆర్ మొండిచేయి చూపించారు.

కండ్ల ముందే రెండు లక్షల ఖాళీలు ఉన్నా పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, యువకులను ఆత్మహత్యల బాట పట్టిస్తున్నాడు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చానని గొప్పలు చెప్పే కేసీఆర్ కు… 1200 మంది ఆత్మబలిదానాలు కనిపించలేదు. వందలాది మంది రక్తం చిందిస్తేనే తెలంగాణ వచ్చింది. వేలాది మంది పోరాడితేనే తెలంగాణ వచ్చిందే తప్ప కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదు.

కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు

ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన కేసీఆర్.. తెలంగాణ వచ్చాక కేవలం తన కుటుంబానికే ఉద్యోగాలు తెచ్చుకున్నాడు. ‘నేను, నా భార్య పావుశేరు బియ్యం వండుకుంటే చాలు.. నా కొడుకు, కూతరు అమెరికాలోనే ఉన్నారు’ అని చెప్పి.. తెలంగాణ వచ్చాక అధికారం మొత్తం తన కుటుంబం చేతుల్లో పెట్టారు. అధికారం, ఆస్తులు అన్ని కల్వకుంట్ల కుటుంబానికే పోతున్నాయి. నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపలేని కేసీఆర్.. ముఖ్యమంత్రి ఉంటే ఎంత లేకుంటే ఎంత? గజ్వేల్ అంతరావుపల్లిలో నిరుద్యోగి కొప్పురాజు ఉద్యమ సమయంలో ఎన్నో పోరాటాలు చేశారు. 2009 నుంచి 2012 వరకు నిజాం కాలేజీలో జేఏసీకి నాయకుడు పనిచేశారు. ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నాడు. రక్తం చిందించి జైలు పాలయ్యారు. తీరా తెలంగాణ వచ్చాక ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది నిరాశతో ఆత్మహత్య చేసుకున్నారు.

ఇది ముమ్మాటికీ కేసీఆర్ హత్యే.. ‘నా కొడుకు ఉద్యమంలో చనిపోయినా బాగుండు.. తెలంగాణ వచ్చాక చనిపోయిండు’ అని రోదిస్తుంటే కేసీఆర్ కండ్లకు కనిపించడం లేదు. కొప్పు రాజు తమ్ముడు ఉద్యోగం కోసం మంత్రులు,ఎమ్మెల్యేల కాళ్లమీద పడ్డా ఎవరూ కనుకరించలేదు. కేసీఆర్ అంటే ఫాం హౌజ్లో మత్తులో మొద్దునిద్రపోయాడు.. మరి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏమైంది? నిరుద్యోగుల సమస్యలు పట్టవా? 2018 ఎన్నికల ముందు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక లక్ష ఉద్యోగాలు ఎప్పుడో భర్తీ చేశామని చెప్పడం సిగ్గుచేటు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి 50వేల ఉద్యోగాలంటూ మభ్యపెడుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక, హుజూర్ నగర్ ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మోసం చేశారు. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికలోనూ అదే చెబుతున్నారు. కేసీఆర్ మాట మీద నిలబడరు. ఒక్కమాట నిలబెట్టుకోరు.కేసీఆర్ ఓ గజినిలా ప్రవర్తిస్తున్నారు.

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు
రాష్ట్రంలో పిల్లలకు చదువులు అక్కర్లేదనేది కేసీఆర్ సిద్ధాంతం. అందుకే బడులు,ఫీజు రీయింబర్స్ మెంట్ కొటువులు అన్ని బంద్ చేశారు. కేసీఆర్ కింద అందరూ బానిసల్లా బతకాలని కంకణం కట్టుకున్నాడు.విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తే వందేళ్లు వెనక్కి వెళ్లవచ్చనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారు. రాష్ట్ర బిడ్డలకు చదువులు, ఉద్యోగాలు ఇవ్వకుండా దొరా బాంచెన్ అంటూ బతకాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఏడేండ్ల కేసీఆర పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. బంగారు తెలంగాణ పేరుతో ఓట్లు కొల్లగొట్టి, చావుల తెలంగాణగా మార్చారు. నిరుద్యోగులు, రైతులు, ఆర్టీసీ కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ప్రైవేట్ టీచర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించడం లేదు. వీళ్లందరికీ మృతికి కారణమం కేసీఆర్. కేసీఆరే హంతకుడు.

దళితులను మోసం చేస్తున్న కేసీఆర్

గతంలో దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని మోసం చేశారు. దళితులకు మూడెకరాలు ఇస్తానని దగా చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని మాయ మాటలు చెప్పారు. ప్రతీ విషయంలోనూ దళితులను మోసం చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు 800 శాతం పెరిగాయి. పోలీసు స్టేషన్లలోనే దళిత మహిళలను చంపేస్తున్నారు. హుజూరాబాద్లో ఎన్నికలు వచ్చే సరికి కేసీఆర్ కు దళితులంతా బంధువులయ్యారు. మొదట దళితులకు రూ.10లక్షలు ఇస్తానని చెప్పడంతో బీసీ, ఇతర వర్గాల్లో వ్యతిరేకత వచ్చింది. దీంతో మళ్లీ అన్ని వర్గాలకు బంధు ఇస్తామని మాయ మాటలు చెబుతున్నారు. దళితులకు రూ.10లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వ భూములు అమ్మిన కేసీఆర్.. అన్ని వర్గాలకు బంధు ఇవ్వాలంటే ఫాం హౌజ్ను, ప్రగతి భవన్ను చివరికి తెలంగాణనే అమ్మేలా ఉన్నారు. కేసీఆర్ పిట్ట కథలు ఇక నుంచి తెలంగాణ ప్రజలు నమ్మరు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ను కూడా పట్టించుకోవడం లేదు.

ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు రావడం లేదు. భూములు కోల్పోయిన వారిని పట్టించుకోవడం లేదు. తాలిబన్ల చేతుల్లో ఆఫ్గనిస్తాన్ చిక్కుకున్నట్లు కల్వంకుట్ల ఫ్యామిలీకి తెలంగాణ బందీ అయింది. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు. తల్లిదండ్రులకు ఎట్టిపరిస్థితుల్లో కడుపుకోత మిగల్చవద్దు. మీ తరఫున మేం నిలబడతాం. మేం పోరాటం చేస్తాం. హుజూరాబాద్లో నిరుద్యోగులంతా పోటీ చేసి, కేసీఆర్ నియంత పాలనను దేశమంతా చూసేలా చేయాలి. నిరుద్యోగులకు అండగా మేం ఉంటాం. వారికి అన్ని విధాలా సాయం చేస్తాం. ఇకనైనా కేసీఆర్ ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కొత్త జిల్లాలు, మండలాల్లో ఉన్న 3లక్షల 85వేల ఖాళీలను సైతం భర్తీ చేయాలి. నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇవ్వాలి. 54లక్షల మంది నిరుద్యోగులు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టాలి. అర్హులకు కార్పొరేషన్ లోన్లు ఇచ్చి స్వయం ఉపాధిని ప్రోత్సహించాలి.