ఇంకా పెండింగ్ లోనే ఆ మూడు స్థానాలు

ఇంకా పెండింగ్ లోనే ఆ మూడు స్థానాలు
  • నల్గొండ కాంగ్రెస్ లో తెగని టికెట్ల పంచాయితీ
  • సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడలో ఖరారు కాని అభ్యర్థులు
  • నిరాశలో ఆశావహులు, కాంగ్రెస్ శ్రేణులు


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓవైపు కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఊపందుకుంటుంటే.. మరోవైపు మూడు స్థానాల్లో అభ్యర్థులను తేల్చకుండా అధిష్టానం నాన్చుతోంది. సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ స్థానాలకు ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఆ పార్టీ ఆశావహులతో పాటు అభిమానులు, కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో పాటు ఆశావహుల పోటీ అంతే ఉంటోంది. ఈ పరిస్థితుల్లో అధిష్టానం అభ్యర్థుల ప్రకటనకు మల్లగుల్లాలు పడుతోంది. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తుంటే… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోవడం ఆ పార్టీలో గందరగోళం సృష్టిస్తోంది.


 సూర్యాపేటలో దామన్న వర్సెస్ పటేల్


సూర్యాపేట స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంకా పెండింగ్ లోనే ఉంచింది. కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. పార్టీలో సీనియర్ నేతగా, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మొదటినుంచి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. తాజా ఎన్నికల్లో చివరిసారి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆయన ఇటీవలే ప్రకటించారు. ఇదే నేపథ్యంలో గతంలో టీడీపీ నుంచి అనుచరుడిగా ముద్ర పడ్డ పటేల్ రమేష్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి సూర్యాపేట స్థానం ఆశిస్తూ, తనకంటూ ప్రత్యేక క్యాడర్ ను తయారు చేశారు. ఈక్రమంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ తనకంటూ తనకే కావాలంటూ రెండు వర్గాలు అధిష్టానం వద్ద ఒత్తిడి చేయడంతో కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట అభ్యర్థిగా దామన్నకే టికెట్ కన్ఫర్మ్ అయిందంటూ ప్రచారం సాగుతోంది.


తుంగతుర్తిలో ఎదురుచూపులు


తుంగతుర్తిలో కాంగ్రెస్ స్థానం కోసం ఆశావహుల ఎదురుచూపులు అధికమయ్యాయి. గతంలో పోటీ చేసిన అద్దంకి దయాకర్ తనకే టికెట్ వస్తుందని ఆశాభావంతో ఉండగా, తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్లు అద్దంకి దయాకర్ కు ఇవ్వొద్దని అభిప్రాయాన్ని వెలిబుచ్చగా, మరికొందరు సీనియర్ నేత మోత్కుపల్లికి ఇప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వర్గాల పోరు మధ్య తుంగతుర్తి స్థానాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చలేక పెండింగ్ పెట్టింది.


మిర్యాలగూడలో బీఎల్ఆర్ వైపు మొగ్గు


మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఊపు తెచ్చిన నేతగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్, సామాజికవేత్త బత్తుల లక్ష్మారెడ్డికి పేరుంది. మొదటినుంచి కాంగ్రెస్ అధిష్టానం బీఎల్ఆర్ కు టికెట్ ఇస్తుందని ఎదురుచూసినప్పటికీ కొద్దికాలంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మిర్యాలగూడ స్థానాన్ని ఆశించడంతో అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. ప్రజాదరణ ఉన్న నేతగా బత్తుల లక్ష్మారెడ్డి ఉన్నప్పటికీ, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆశీస్సులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఉండడంతో అధిష్టానం ఈ స్థానంపై తర్జనభర్జనలో ఉన్నట్లు తెలుస్తోంది.


అయితే ఎట్టకేలకు మిర్యాలగూడ టికెట్ బత్తుల లక్ష్మారెడ్డికి ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గుచూపినట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తం మీద ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఈ మూడు స్థానాలపై నేటి సాయంత్రంలోగా కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.