రాష్ట్రానికి దశాబ్దంలో వందేళ్ళ నష్టం: రేవంత్‌రెడ్డి

రాష్ట్రానికి దశాబ్దంలో వందేళ్ళ నష్టం: రేవంత్‌రెడ్డి
  • భూముల ఆక్రమణలో కెసిఆర్ కుటుంబం
  • నిరుద్యోగులపట్ల కెసిఆర్ తీవ్ర నిర్లక్ష్యం
  • పొన్నాల కాంగ్రెస్‌లో నీకేం తక్కువైంది?
  • ప్రజలు వెళ్ళలేని ప్రగతిభవన్ పేల్చితేంది?
  • జనగామ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ పౌరుషానికి, దోపిడీ దొంగలకు మధ్య జరుగుతున్నవని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఈ ఎన్నికలు 60 సంవత్సరాల ఆకాంక్ష, వందేళ్ళ భవిష్యత్తు ప్రణాళికను నిర్ణయించేవని చెప్పారు. జనగామలో బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం సభలో ఆయన ప్రసంగించారు. త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించబోతున్నదని చెప్పారు. మొన్న హిమాచల్, నిన్న కర్ణాటక రాబోయేది తెలంగాణ అని చెప్పారు. దీంతో ఎర్రకోట పైన కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, జేడీఎస్ దుష్టచతుష్టయం కలిసి కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. దశాబ్దకాలం కేసీఆర్‌ పాలనతో శతాబ్దం కాలంపు నష్టం తెలంగాణకు వాటిల్లిందని చెప్పారు. పది తరాలకు సరిపోయేలా కేసీఆర్‌ దోపిడీ చేశారని, హైదరాబాద్‌ చుట్టూ 10 వేల ఎకరాల భూములు ఆక్రమించుకున్నారని విమర్శించారు. ప్రజలు, నిరుద్యోగులు, రైతులు, కార్మికులు వెళ్ళేందుకు అవకాశం లేని ప్రగతి భవన్‌ను కూలిస్తేంది? పేలిస్తేంది అని వ్యాఖ్యానించారు.

కొడుకు ధన దాహానికి నిరుద్యోగులు బలి

పరీక్షలు వాయిదా వేసినందుకు వరంగల్‌ ఆడబిడ్డ ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ఆ బిడ్డపై నిందలు మోపారని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘నీ కొడుకు ధన దాహానికి ఏదీ సరిపోలేదా? భూములు మింగితిరి, కాంట్రాక్టులు మింగితిరి, ఇసుక మింగితిరి, కమీషన్లు తీసుకుంటురి, జన్వాడలో భూములు ఆక్రమించుకుంటిరి. ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకుంటిరి, కోకాపేటలో భూములమ్ముకుంటిరి. ఇది కూడా సరిపోక ప్రశ్నాపత్రాలు కూడా అమ్ముకుని 30లక్షల నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు’ అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రవళిక చనిపోతే పరామర్శించని బిల్లా, రంగాలు పొన్నాల పార్టీకి రాజీనామా చేస్తే ఉరికెళ్లి పార్టీలోకి ఆహ్వానించారని విమర్శించారు.

పొన్నాల కాంగ్రెస్ నీకేం తక్కువ చేసింది

టికెట్లు ప్రకటించక ముందే పొన్నాల బీఆరెస్‌లోకి ఎందుకు వెళ్లారని రేవంత్‌ నిలదీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిన్నే ముఖ్యమంత్రిని చేసునేమో? ముందుగా అమెరికాలో మాట్లాడుకుని కేసీఆర్‌ పంచన చేరావా అని ప్రశ్నించారు. 45 యేండ్లు కాంగ్రెస్ పెంచి పోషించి ఎమ్మెల్యేగా, మంత్రిగా, పీసీసీ చీఫ్ గా అవకాశం ఇస్తే ఆ పార్టీకి ద్రోహం చేయడానికి సిగ్గుండాలని విమర్శించారు. ముత్తిరెడ్డి గురించి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి బిడ్డ భూములు కబ్జా పెట్టిండ్రని చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒకరి గురించి ఒకరికి తెలుసని, ఇద్దరి గురించి గడీలో ఉన్న దొరకు తెలుసన్నారు.

ప్రశ్నించే ఎమ్మెల్యే కేసీఆర్‌కు నచ్చరు

సమస్యల పై కొట్లాడే కొమ్మూరి లాంటి ఎమ్మెల్యే వద్దని తన మందులో సోడాపోసే పల్లా కావాలని ఆయకు కేసీఆర్‌ టికెట్ ఇచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. దొరల గడీ పాలన కావాలా? ప్రజల పాలన కావాలా? తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు.