TELANGANA ASSEMBLY | అసెంబ్లీలో సీఎం చాంబర్ ముందు బీఆరెస్ ఎమ్మెల్యేల ధర్నా..సభను ఏకపక్షంగా నడుపుతున్నారంటూ నిరసన
అసెంబ్లీలో తమ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సబితకు మాట్లాడే అవకాశమివ్వకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన బీఆరెస్ ఎమ్మెల్యేలు సీఎం చాంబర్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు.

విధాత, హైదరాబాద్ : అసెంబ్లీలో తమ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సబితకు మాట్లాడే అవకాశమివ్వకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన బీఆరెస్ ఎమ్మెల్యేలు సీఎం చాంబర్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. అసెంబ్లీలో తమకు మాట్లాడనివ్వకుండా సభను ఏకపక్షంగా నడిపిస్తున్నారంటూ నినాదాలు చేసి నిరసన తెలిపారు. అంతకుముందు సభ ప్రారంభంకాగానే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తమకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని బీఆరెస్ సభ్యులు డిమాండ్ చేశారు. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ నల్ల చొక్కాలు ధరించి సభకు వచ్చారు. అయితే స్కిల్ యూనివర్సిటీ బిల్లుపైన, ఎస్సీ వర్గీకరణపైన మాత్రమే మాట్లాడేందుకు మైక్ ఇస్తామని స్పీకర్ తేల్చిచెప్పడంతో ఆయా అంశాలపై మాట్లాడిన పిదప తిరిగి సబిత వివాదంపై మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలంటూ బీఆరెస్ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ ప్రసాద్ అందుకు నిరాకరించడంతో వాకౌట్ చేసిన బీఆరెస్ సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డి చాంబర్ ముందు నిరసనకు దిగారు. బీఆరెస్ మహిళా సభ్యులను అవమానించేలా మాట్లాడిన సీఎం రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆరెస్ సభ్యుల ఆందోళనతో అక్కడ మార్షల్స్ పెద్ద సంఖ్యలో మోహరించడంతో పాటు టాస్క్ ఫోర్స్ టీం వెంటనే సిఎం ఛాంబర్ వద్దకు రావాలని చీఫ్ మార్షల్ కోరారు. దీంతో బీఆరెస్ సభ్యులను బలవంతంగా అక్కడి నుంచి తరలించడం ఖాయంగా కనిపిస్తుంది.
అసెంబ్లీ బయట బీఆరెస్ ఎమ్మెల్యేల నిరసన అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
సీఎం రేవంత్‌రెడ్డి బీఆరెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన బీఆరెస్ సభ్యులు సీఎం చాంబర్ ముందు బైఠాయించి నిరసనకు దిగారు. మార్షల్స్, పోలీసులు రంగ ప్రవేశం చేసి వారందరిని బలవంతంగా ఎత్తుకెళ్లి అసెంబ్లీ బయటకు తరలించారు. దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆరెస్ సభ్యులు అసెంబ్లీ భవనం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అసెంబ్లీ బయట బీఆరెస్ ఎమ్మెల్యేల నిరసన అరెస్టు చేసి తెలంగాణ భవన్‌కు తరలింపు
బీఆరెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టిలు చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన బీఆరెస్ సభ్యులు సీఎం చాంబర్ ముందు బైఠాయించి నిరసనకు దిగారు. మార్షల్స్, పోలీసులు రంగ ప్రవేశం చేసి వారందరిని బలవంతంగా ఎత్తుకెళ్లి అసెంబ్లీ బయటకు తరలించారు. దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆరెస్ సభ్యులు అసెంబ్లీ భవనం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ వ్యాన్‌లలో తెలంగాణ భవన్‌కు తరలించారు.