కల్వకుంట్ల కుటుంబానికే అబద్దాలు అలవాటు: కె.లక్ష్మణ్‌

కల్వకుంట్ల కుటుంబానికే అబద్దాలు అలవాటు: కె.లక్ష్మణ్‌
  • కేటీఆర్‌ మాటలు అసత్యాలు
  • ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌


విధాత: 2018లో బీఆరెస్‌తో కలిసి పనిచేస్తామని తాను కోరినట్లుగా మంత్రి కేటీఆర్‌ ట్వీట్టర్‌లో చెప్పడం పూర్తిగా అసత్యమని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కె. లక్ష్మణ్‌ బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంంగా ఖండించారు. అబద్దాలు చెప్పడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటేనని, తప్పులను ఎత్తిచూపితే ఇలా నిందలు వేస్తూ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.


బీజేపీ ఒక సిద్ధాంతానికి కట్టుబడి ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటుందన్నారు. ఎన్నికలొస్తే ఏదో ఒక పార్టీతో లాలూచీ పడటం, స్వార్ధపూర్తి రాజకీయాల కోసం పొత్తుల డ్రామాలతో ఓట్ల రాజకీయం చేయడం బీఆరెస్‌ వాళ్ల నైజమన్నారు. వంచన అనే పునాదిపైనే నే బీఆరెస్‌ను స్థాపించారని, విధి విధానాలు, సిద్ధాంతాలు లేకుండా నడుచుకునే పార్టీ బీఆరెస్‌ అని విమర్శించారు.


ఎంతోమంది అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను కుటుంబ పాలనతో కబ్జా చేశారన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి బీఆరెస్‌ పొత్తులతోనే కాలం వెళ్లదీస్తుందన్నారు. ప్రతి ఎన్నికల్లో తెరచాటు ఒప్పందాలు, పొత్తులు పెట్టుకునే బీఆరెస్‌కు బీజేపీ గూర్చి మాట్లాడే నైతికార్హత లేదన్నారు. గ్రేటర్‌ ఎన్నికలకు ముందు ఎంఐఎం పార్టీతో బీఆరెస్‌ ఒప్పందం కుదుర్చుకుందని, ఎన్నికల తర్వాతా కూటిమితో మేయర్‌ పీఠం దక్కించుకున్నాయన్నారు.


వారసత్వ, కుటుంబ, వ్యక్తి ఆధారిత రాజకీయాలకు కేరాఫ్‌ బీఆరెస్‌ పార్టీని అని అటువంటి రాజకీయాలను బీజేపీ ప్రొత్సహించదన్నారు. ఎన్నికల్లో నైతికంగా గెలిచే వారినే యోధులంటారని, అవకాశవాద రాజకీయాలతో గట్టేక్కే బీఆరెస్‌ పరాన్నజీవిగా ముద్ర వేసుకుందని, బీజేపీకి వస్తున్న ఆదరణను చూసే ఓర్వలేక మా పార్టీపై దుష్పచారం చేస్తున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు.