మళ్లీ టీఆరెస్‌గా మార్చాలి.. బీఆరెస్ ఎమ్మెల్యే కడియం కీలక వ్యాఖ్యలు
బీఆరెస్ పార్టీని మళ్లీ టీఆరెస్‌గా మార్చే విషయాన్ని పార్టీ అధిష్టానం ఆలోచన చేయాలని మాజీ మంత్రి, బీఆరెస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

విధాత : బీఆరెస్ పార్టీని మళ్లీ టీఆరెస్‌గా మార్చే విషయాన్ని పార్టీ అధిష్టానం ఆలోచన చేయాలని మాజీ మంత్రి, బీఆరెస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వరంగల్ లోక్ సభ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుంచే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు టీఆరెస్‌ను సొంత పార్టీగా భావించారని, కానీ పార్టీ పేరు నుంచి తెలంగాణను తొలగించడం సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని కడియం అన్నారు. టీఆర్ఎస్ ప్రజలకు అనుబంధం ఉండేదని, బీఆరెస్‌గా మారిన తర్వాత ఆ సెంటిమెంట్, అటాచ్‌మెంట్ పోయిందన్నారు.
దీన్ని గమనించి ప్రజలు, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని బీఆరెస్‌ను తిరిగి టీఆరెస్‌గా మార్చే విషయంపై ఆలోచన చేయాలని కేటీఆర్‌ను కడియం కోరారు. పార్టీ పేరులో తెలంగాణను తొలగించడం వల్ల గత ఎన్నికల్లో నష్టం వాటిల్లిందని దీనివల్ల కనీసం 1-2 శాతం ఓట్లు గల్లంతయ్యాయని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని కడియం పేర్కొన్నారు. పార్టీలో కలిసి వచ్చిన తెలంగాణ సెంటిమెంటు దూరం చేయడం మంచిది కాదని, బీఆరెస్‌ను మళ్లీ టీఆరెస్‌గా మార్చాలని పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారని కడియం శ్రీహరి అసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడియం చేసిన వ్యాఖ్యలు బీఆరెస్ శ్రేణుల్లో..సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి.