కల్వకుర్తి బీఆరెస్ ఖాళీ? గులాబీ దళానికి కసిరెడ్డి, బాలాజీ సింగ్ గుడ్ బై?

కల్వకుర్తి బీఆరెస్ ఖాళీ? గులాబీ దళానికి కసిరెడ్డి, బాలాజీ సింగ్ గుడ్ బై?
  • పార్టీ క్యాడర్ లో సగం వీరిద్దరి వెంటే..
  • అదే బాటలోనే సర్పంచ్, ఎంపీటీసీలు
  • కాంగ్రెస్ లో చేరికకు సన్నద్ధం?
  • ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గెలుపుపై నీలినీడలు

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కల్వకుర్తి నియోజకవర్గం లో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా? ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ పార్టీ వీడనున్నారా? పార్టీ క్యాడర్ వీరివెంట నడుస్తున్నారా? ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇదే హాట్ టాపిక్. జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇదంతా నిజమే అని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. రెండు, మూడు రోజుల నుంచి ఈ నియోజకవర్గం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది.

రోజుకో రాజకీయ మలుపు

కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్ టికెట్ జాబితా ప్రకటించిన తరువాత ఇక్కడ రాజకీయ కుంపటి మొదలైంది. సిటింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు టికెట్ ఖరారు కావడంతో ఆ పార్టీలో అలజడి రేగింది. టికెట్ ఆశించిన కసిరెడ్డి నారాయణ రెడ్డి వర్గం పార్టీపై అగ్గి మీద గుగ్గిలమైంది. జైపాల్ యాదవ్ కు టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేదని అంతకు ముందే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా ఉంటూ వచ్చారు.


ఎమ్మెల్యేగా జైపాల్ యాదవ్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని, పార్టీ క్యాడర్ ను దూరంగా ఉంచారనే ఆరోపణలు కసిరెడ్డి వర్గం చేస్తూ వచ్చినా అధిష్టానం పట్టించుకోలేదు. టికెట్ ఇస్తే ఓడిపోతారని చెప్పినా ఆయనకే టికెట్ ఇవ్వడంతో కసిరెడ్డి జీర్ణించుకోలేకపోయారు. గత ఎన్నికల నుంచి కల్వకుర్తి టికెట్ కసిరెడ్డి కోరుతున్నా పార్టీ సర్ది చెప్పుకుంటూ కాలం వెళ్ళదీసింది. ఈ సారి తప్పకుండా టికెట్ వస్తుందనే ధీమా గా ఉన్నా పార్టీ పట్టించుకోలేదు. అందుకే పార్టీని వీడాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


2014, 2018 ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి భంగపడిన కసిరెడ్డికి ఎమ్మెల్సీ కట్టబెట్టి అధిష్టానం చేతులు దులుపుకుంది. ఈ సారి ఎన్నికల్లో కూడా పార్టీ దూరం పెట్టింది. బీఆర్ఎస్ లో ఉంటే భంగపాటు తప్పదని భావిస్తున్న ఆయన పార్టీని వీడెందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 30న కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం. ఆయన వెంట మెజారిటీ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు వస్తున్నారని, వీరందరి ని కలుపుకొని భారీ ఎత్తున చేరికకు ప్లాన్ వేశారు.

ఉద్యమ నేతగా గుర్తింపు


కల్వకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన బాలాజీ సింగ్ బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గా ఉన్నారు. అసెంబ్లీ కి పోటీ చేయాలని అనుకున్నారు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకైనా పాత్ర పోషించారు. నియోజకవర్గంలో మంచి పట్టుంది. ప్రతిసారి టికెట్ వస్తుందని ఆశించిన ఆయనకు చివరకు నిరాశే మిగులుతోంది. ప్రస్తుతం జైపాల్ యాదవ్ కు టికెట్ రావడంతో జీర్ణించుకోలేని బాలాజీ సింగ్ పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.


జైపాల్ యాదవ్ కు వ్యతిరేకంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి, బాలాజీ సింగ్ లు ఒక్కటై నియోజకవర్గం లో వేరు కుంపటి పెట్టారు. ఒకే పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కసిరెడ్డి పార్టీ వీడుతుండడంతో బాలాజీ సింగ్ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది. ఈ నెల 30న ముహూర్తం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఒంటరిగా మిగిలి పోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జైపాల్ ఓటమే లక్ష్యం!


తాము గెలవక పోయినా ప్రత్యర్థి ఓడిపోవాలనే పంతంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి, బాలాజీ సింగ్ ఒకే తాటిపై నిలిచి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను లక్ష్యం చేశారు. అతన్ని ఓడించాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. తమ సత్తా ఏంటో అధిష్టానం కు చూపించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్నా ఫలితం లేదని, పార్టీ ని వీడి తామేంటో నిరూపిస్తామనే ధోరణి కనిపిస్తోంది. అధిష్టానం మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. వీరు ఉన్నా ఒక్కటే.. పోయినా ఒక్కటే అనే చందంగా వ్యవహారిస్తోంది. వర్గ పోరు తప్పిందనే యోచన లో కూడా జైపాల్ యాదవ్ ఉన్నారు. మరికొన్ని రోజుల్లో కల్వకుర్తి రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

కసిరెడ్డి ని కాంగ్రెస్ ఆదరించేనా?

బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వస్తే కసిరెడ్డి నారాయణ రెడ్డి, బాలాజీ సింగ్ కు కల్వకుర్తి టికెట్ వస్తుందనే గ్యారంటీ కూడా లేదు. ఇక్కడి పార్టీ కి పెద్దదిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి ని ఆ పార్టీ వదులుకునే అవకాశం లేదు. ఇంతకాలం పార్టీని నమ్ముకుని ఉన్న వంశీని కాంగ్రెస్ పక్కన పెట్టదు. అందుకే ఇక్కడి టికెట్ ఆయనకే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.


ఒక వేళ కసిరెడ్డి, బాలాజీ సింగ్ కాంగ్రెస్ లో చేరినా ఇతర పదవులు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేయవచ్చు. ఈ ఎన్నికల్లో వీరిద్దరి సేవలు ఉపయోగించుకుని కల్వకుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నది టీపీసీసీ అనుకుంటోంది. వీరిద్దరి వెంట బీఆర్ఎస్ క్యాడర్ భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ భావిస్తోంది. అనుకున్న ప్రకారం జరిగితే కల్వకుర్తిలో కాంగ్రెస్ జెండా పాతడం ఖాయం.