చేనేత కార్మికుల కోసం విజన్ డాక్యుమెంటరీ

చేనేత కార్మికుల సంక్షేమం కోసం, ఒక విజినరీ డాక్యుమెంట్ ను రూపొందించనున్నట్లు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ప్రకటించారు

చేనేత కార్మికుల కోసం విజన్ డాక్యుమెంటరీ
  • వృత్తితో పాటు వ్యాపారంలోనూ పద్మశాలీలకు అవకాశం
  • హైదరాబాదులో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కృషి
  • విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి వెలిచాల

విధాత బ్యూరో, కరీంనగర్: చేనేత కార్మికుల సంక్షేమం కోసం, ఒక విజినరీ డాక్యుమెంట్ ను రూపొందించనున్నట్లు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ప్రకటించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేందర్ రావు మాట్లాడారు. మేడే సందర్భంగా చేనేత సోదరులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రస్థానం యూత్ కాంగ్రెస్ నుంచి ప్రారంభమైందని, కార్మిక సంఘాలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే మార్గం పనులు హైదరాబాద్ నుండి సిద్దిపేట వరకు మాత్రమే వచ్చి ఎందుకు ఆగాయని ప్రశ్నించారు. సిద్దిపేట నుండి సిరిసిల్ల, కరీంనగర్ వరకు ట్రాక్ నిర్మాణం పనులు విస్మరించారని ఆయన మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే తారక రామారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను ఎంపీగా గెలిచిన అనంతరం ఈ రైల్వే మార్గం పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. రాముడి పేరుతో ప్రజల మనోభావాలతో బీజేపీ చెలగాటమాడుతుందని ఆరోపించారు. ప్రజల మధ్య అంతరాలు సృష్టించి ఓట్ల రూపంలో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న మేరకు కార్మికులకు శ్రామిక్ న్యాయ్ పథకం ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, ఉపాధి హామీ కూలీలకు 400 భృతి తదితర సదుపాయలను కల్పిస్తుందని పేర్కొన్నారు.

సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి వస్త్ర వ్యాపారంలో నైపుణ్యం కలిగి ఉన్న పద్మశాలీల కోసం హైదరాబాద్ శిల్పారామం మాదిరిగా రెండెకరాల స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే వారణాసి టెక్స్ టైల్స్ మాదిరిగా సిరిసిల్లలో ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.