తెలంగాణ పదాన్ని చెరిపేసిందే కేసీఆర్..
‘తెలంగాణ పదాన్ని చెరిపేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందని కేటీఆర్ అనడం ఆశ్చర్యకరం.

♦ ఉద్యమ లక్ష్యాలనూ నీరుగార్చారు
♦ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
‘తెలంగాణ పదాన్ని చెరిపేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందని కేటీఆర్ అనడం ఆశ్చర్యకరం. తెలంగాణ పదాన్ని చెరిపేసిందే కేసీఆర్.. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలనూ నీరుగార్చిందీ కేసీఆరే’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పేరులో తెలంగాణను తొలగించిన ఆపార్టీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆరెస్ అధికారంలో వున్నపుడు అవినీతి తప్ప ప్రజలు పట్టలేదన్నారు.
న్యాయవిచారణను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఏకమవుతున్నాయని అన్నారు. సీబీఐ విచారణ కన్నా.. న్యాయవిచారణ గొప్పదని చెప్పారు. సీబీఐ కేంద్రం కింద పని చేస్తే, న్యాయ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందన్నది గుర్తుంచుకోవాలన్నారు. పారదర్శకంగా విచారణ జరిపేందుకే జ్యుడీషల్ విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. కవిత లిక్కర్ కేసును ఈడీ మరుగున పర్చిందని, అలాగే కేసీఆర్ అవినీతిని మరుగున పెట్టేందుకే సీబీఐ విచారణ కోరుతున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు.
కాళేశ్వరం అవినీతిలో అధికారుల పాత్ర కూడా ఉందని, ఈఎన్సీ మురళీధర్ రావును తొలగిస్తేనే నిజాలు బయటకు వస్తాయన్నారు. ఆయన గత ప్రభుత్వాల నిర్ణయాలను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మురళీధర్ రావును తక్షణం బాధ్యతల నుంచి తొలగించాలని కోరారు.
కేసీఆర్ పాలనలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, లక్ష కోట్ల అవినీతిలో కాళేశ్వరం ఒక భాగం మాత్రమే అన్నారు. కాళేశ్వరం, యాదాద్రి, మిషన్ భగీరథలో రూ.50 వేల కోట్లకు మించి అవినీతి జరిగిందన్నారు. న్యాయ విచారణను కాళేశ్వరానికే పరిమితం చేయొద్దని, యాదాద్రి, మిషన్ భగీరథ, భూ కేటాయింపులపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బంధు, మైనారిటీ బంధు ఇవ్వలేదని.. అందుకే వోడగొట్టారని అన్నారు. కేసీఆర్ బంధు ఎక్కడిది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ రద్దు చేసిందంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.