Kishan Reddy | ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం … యువమోర్చా ధర్నాలో కిషన్‌రెడ్డి
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని, ఏడు నెలల కాలంలోనే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోంటుందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు

విధాత, హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని, ఏడు నెలల కాలంలోనే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోంటుందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో బీజేపీ యువమోర్చా నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగ భృతి ఇస్తామని, జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీలు, 420హామీలను అమలు చేయలేక ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంటుందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎవరికి దొరికినంత వారు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విస్తారంగా అవినీతి కొనసాగుతోందన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో మాత్రమే రాష్ట్రంలో మార్పు వచ్చిందని విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను వంద రోజుల్లో ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల తీర్పును కాలరాసి కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని, ఇప్పుడు బీఆరెస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుంటు ప్రజాస్వామాన్ని, రాజ్యాంగాన్ని ఆ రెండు పార్టీలు అపహాస్యం చేశాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కేవలం పార్టీ జెండా మాత్రమే మారింది తప్ప పరిపాలనలో మార్పు లేదన్నారు. ఈ పరిస్థితులవ్లో ప్రజావాణి వినిపించడంలో బీజేపీ కృషి చేస్తోందన్నారు. గ్రూప్ 1 మెయిన్స్‌ను 1:50 కాకుండా 1.100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ 2లో 783 పోస్టులను 2000కు పెంచాలని, 1365 గ్రూప్ 3 పోస్టులను 3000కు పెంచాలలని, హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీలో భాగంగా 25 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగులకు వెంటనే రూ.4 వేల భృతిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.