నా నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండవు: కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గంలో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు

- ఎవరు చెప్పినా వినను.. పదవి పోయినా లెక్కచేయను
- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: మునుగోడు నియోజకవర్గంలో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది మొదటిసారి మునుగోడు నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మునుగోడు పట్టణంలోని బాబా సాహెబ్ అంబేద్కర్‌కు పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తన గెలుపు ఒక రాజగోపాల్ రెడ్డిది కాదని, అందుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తదన్నారు. మునుగోడు ప్రజలు కార్యకర్తల తరఫున మంత్రి పదవి చేపట్టిన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అభినందనలన్నారు. అవినీతి, నియంత, కుటుంబ పాలన సాగించిన కేసీఆర్ ప్రభుత్వం పతనం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని, మన ఆత్మగౌరవం నిలబడిందన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తల చెమట చుక్కల ఫలితమే 40వేల భారీ మెజారిటీ దక్కిందన్నారు. మునుగోడు నియోజకవర్గం ప్రజల ఆకాంక్ష మేరకు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా చేస్తానని, ఇందుకోసం తన పదవి పోయినా లెక్క చేయనన్నారు. ఉదయ సముద్రం కిస్తరాంపల్లి చర్లగూడెం ప్రాజెక్టును పూర్తి చేయిస్తానని, మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా మంచి రోడ్లు పచ్చదనం కనిపించేలా అభివృద్ధి చేయడంతో పాటు భూ నిర్వాసితులకు వంద శాతం న్యాయం చేస్తానన్నారు.